సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైన కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి పెరుగుతోంది కనుక.. నిల్వ, మార్కెటింగ్‌పై దృష్టిపెట్టాలని ఆదేశించారు. ధాన్యం నిల్వ, మిల్లింగ్, మార్కెటింగ్, నూతన పరిశ్రమల ఏర్పాటుకు.. తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్‌కమిటీని నియమించారు. మంత్రులు గంగుల, హరీష్‌రావు, కేటీఆర్, పువ్వాడ, ఇంద్రకరణ్, సబిత, ప్రశాంత్‌రెడ్డి, జగదీష్‌రెడ్డిలని సబ్‌కమిటీ సభ్యులుగా నియమించారు.
తెలంగాణలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆయిల్ పామ్ సాగుచేసే రైతులకు పంట పెట్టుబడి ప్రోత్సాహకం కింద సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ క్రమంలో మొదటి ఏడాది 26వేలు రూపాయలు, రెండు, మూడో ఏడాదికి గాను 5వేల రూపాయల చొప్పున సబ్సిడీ ఇవ్వాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు.
‘తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ’ కి ఆమోదం
అలానే ‘తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ’కి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్ద ఎత్తున స్థాపించాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో కనీసం 10 జోన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 500 ఎకరాలకు తగ్గకుండా 1000 ఎకరాల వరకు తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ ఏర్పాటు చేసి 2024 -25 సంవత్సరం వరకు రాష్ట్రవ్యాప్తంగా 10 వేల ఎకరాలల్లో ఏర్పాటు లక్ష్యంగా చర్యలు చేపట్టాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.
ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ మార్గదర్శకాల ద్వారా ప్రోత్సాహకాలు అందించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వం భూమిని సేకరించి ఏర్పాటు చేసిన జోన్లలో అన్ని మౌలిక వసతులను ప్రభుత్వమే అభివృద్ది చేసి దరఖాస్తు చేసుకున్నవారికి అర్హత మేరకు అందులో భూమిని కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. తద్వారా సుమారు 25 వేల కోట్ల పెట్టుబడిని ఆకర్షించి, 70 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి 3 లక్షల మందికి పరోక్ష ఉపాధిని కల్పించాలని నిర్ణయించింది.
విదేశాలకు ఎగుమతి చేసే నాణ్యతతో కూడిన స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రత్యేక ప్రోత్సహకాలు అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు ప్రత్యేకంగా ‘ప్లగ్ అండ్ ప్లే’ పద్దతిలో షెడ్లను ప్రభుత్వమే నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ రంగంలో సాంకేతికతను మరియు నైపుణ్యాన్ని పెంచే దిశగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ విధానాన్ని అమలు పరచాలని అధికారులను ఆదేశించింది.
రైతులకు సమగ్ర శిక్షణకు సౌకర్యాలను వ్యవసాయశాఖ కల్పించాలి అని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఉద్యానశాఖను పూర్తిస్థాయిలో క్రియాశీలకంగా మార్చాలని.. పౌరసరఫరాలు, వ్యవసాయశాఖలో ఖాళీలు భర్తీ చేయాలని తెలిపారు. పండిన ధాన్యం వెంటనే మిల్లింగ్ చేసి డిమాండ్ ఉన్నచోటకు పంపాలన్నారు. అన్ని రకాల పంట ఉత్పత్తుల పరిశ్రమలను ప్రోత్సహించాలన్నారు. రైస్ మిల్లుల మిల్లింగ్ సామర్థ్యం పెంచుకోవాలని సూచించారు. కొత్త పారాబాయిల్డ్ మిల్లులు ఎక్కువగా స్థాపించాలని కేసీఆర్ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment