
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో జరగనుంది. సమావేశంలో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాల్సిన ఇద్దరిని ఖరారు చేయడంతోపాటు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న కీలక బిల్లులపైనా చర్చించనున్నారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నోటీసులు జారీచేసిన అంశంపైనా భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈడీ విచారణ సందర్భంగా ఒకవేళ కవితను అరెస్టుచేస్తే ఎలా స్పందించాలన్న విషయమై సమావేశంలో ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. కేంద్రం రాష్ట్రంపై వ్యవహరిస్తున్న కక్షసాధింపు చర్యలపై మున్ముందు ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపైనా చర్చ జరగనుంది.
పలు అంశాలపై నిర్ణయాలు
పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, స్థలాలున్న వారికి ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల చొప్పున నిధుల మంజూరుపై నిర్ణయం, మూడు పారిశ్రామికవాడల్లోని భూముల క్రమబద్ధీకరణ అంశాలపై కేబినెట్ చర్చించనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో అమలవుతున్న కంటివెలుగు కార్యక్రమం, మంగళవారం ప్రారంభమైన ‘మహిళా ఆరోగ్య’కార్యక్రమాలను కూడా సమీక్షించే అవకాశం ఉంది.
నేడు నామినేషన్ల దాఖలు
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నవీన్‌కుమార్, దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామిరెడ్డి గురువారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. వారి వెంట మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వెళ్లనున్నారు. కాగా, గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఎస్‌పీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment