
ఎన్నెన్నో ఆశలు..!
♦ పన్ను ప్రయోజనాలు... ఆయిల్‌పామ్ వృద్ధి...
♦ రియల్టీ పురోగతి లక్ష్యం కావాలన్న ఆకాంక్షలు
సాధారణ ప్రజానీకం నుంచి అత్యున్నత స్థాయి వ్యక్తి వరకూ ప్రతి ఒక్కరూ కేంద్ర బడ్జెట్‌పై తమ ఆకాంక్షలను వ్యక్తం చేయడం సహజం. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంటుల్లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ సమయం- ఫిబ్రవరి 29 సమీపిస్తుండడంతో వివిధ వర్గాలు తమ కోరికలను ప్రభుత్వానికి తెలియడానికి తగిన ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని ముఖ్య రంగాల ప్రముఖులు ఈ మేరకు వ్యక్తం చేస్తున్న కీలక సూచనలను ఒక్కసారి పరిశీలిస్తే...
ఆయిల్ పామ్‌కు ప్రత్యేక బోర్డ్...
ఒక పరిశ్రమగా పామాయిల్ రంగం ఎదిగేందుకు ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ప్రత్యేకించి ఇందుకు ఒక ప్రత్యేక బోర్డ్‌ను ఏర్పాటు చేయాలి. దేశీయ పరిశ్రమకు ప్రయోజనం ఒనగూర్చడంలో భాగంగా క్రూడ్ పామాయిల్ దిగుమతి సుంకాలను ప్రస్తుత 17.5 శాతం నుంచి 45 శాతానికి పెంచాలని ఆయిల్ పామ్ డెవలపర్స్ అండ్ ప్రాసెసర్స్ అసోసియేషన్ కోరుతోంది. ఇందుకు సంబంధించి పామాయిల్ రంగానికి ప్రత్యేక దిగుమతి విధానాన్ని అవలంభించాలి. దేశీయంగా పామాయిల్ ఉత్పత్తి పెరగడం-- ద్రవ్యోల్బణం కట్టడికి దోహదపడుతుంది. ఈ రంగం పురోగతికి ప్రత్కేకంగా రూ.10,000 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరపాలి. అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ సవరణ ద్వారా భారీ ఎత్తున పంట ఉత్పత్తి పెరగడానికి దోహదపడాలి. - సంజయ్ గోయంకా, ప్రెసిడెంట్, ఓపీడీపీఏ
పన్ను ప్రయోజనాలు కల్పించాలి
సాధారణ ప్రజానీకానికి పన్ను సంబంధ ప్రయోజనాలను నెరవేర్చాలి. ప్రత్యేకించి బ్యాంకింగ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీపై పన్ను ప్రయోజనాలు కల్పించాలి. ప్రస్తుతం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 పైన వడ్డీవస్తే.. దానిపై మూలం వద్ద పన్ను (టీడీఎస్) కోత ఉంది. ఈ పరిమితిని మరింత పెంచాలి. బ్యాంకింగ్ డిపాజిట్ల ఆకర్షణకు, వినియోగ వృద్ధి కూడా ఊతం ఇచ్చే చర్య ఇది. వస్తు సేవల పన్ను అమలు దిశలో... ఇందుకు అనుగుణంగా పరోక్ష పన్నుల వ్యవస్థలో కొన్ని మార్పులు ఉంటాయని కూడా భావిస్తున్నాం.
- ముకేశ్ బుటానీ, మేనేజింగ్ పార్ట్‌నర్, బీఎంఆర్
రియల్టీకి మౌలిక హోదా...
రియల్టీకి తగిన ఊపునివ్వడానికి మౌలిక పరిశ్రమ హోదా కల్పించడం ఇందులో ఒకటి. దీనివల్ల ఆర్థిక సంస్థల నుంచి కొంత తక్కువ వడ్డీ రేటుకు పరిశ్రమకు రుణ సౌలభ్యం కలుగుతుంది. ఇక రియల్టీ ప్రాజెక్టులకు సంబంధించి పన్ను సంబంధ సరళీకరణలు, రాయితీలు అవసరం. ఈ దిశలో జీఎస్‌టీ అమలును కూడా పరిశ్రమ కోరుకుంటోంది. దీనితోపాటు బ్యాంకింగ్‌లో వడ్డీరేటు తగ్గింపుద్వారా అటు బిల్డర్ ఇటు వినియోగదారుకు రుణ భారాన్ని తగ్గించాలని రియల్టీ కోరకుంటోంది. సింగిల్ విండో అనుమతులకు బడ్జెట్ తగిన చర్యలు తీసుకోవాలి. - వేణు వినోద్, ఎండీ, సైబర్‌సిటీ బిల్డర్స్