అశ్వారావుపేట రూరల్, న్యూస్‌లైన్: అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో మరో వివాదానికి తెర లేచింది. ఇప్పుడిప్పుడే వివాదాలు సద్దుమణుగుతున్నాయనుకుంటున్న సమయంలో కొత్తగా కార్మికుల వేతనాల అంశం వివాదాస్పదంగా మారింది. ఇటీవల టెండర్ దక్కించుకున్న కొత్త కాంట్రాక్టర్ కార్మికులకు వేతనాలు తగ్గించి ఇస్తానని చెప్పడంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కాంట్రాక్ట్‌తో తనకు నష్టం వాటిల్లుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు.
తక్కువ జీతం తీసుకోవడం ఇష్టం లేనివారు శుక్రవారం నుంచి పనికి రావద్దని పేర్కొనడంతో కార్మికులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురై వాగ్వాదానికి దిగారు. దీంతో శుక్రవారం ఉదయం నుంచి 12గంటల వరకు పామాయిల్ గెలల దిగుమతి నిలిచిపోయింది. అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో 30 మంది కాంట్రాక్‌ట కార్మికులు కొంతకాలంగా పనిచేస్తున్నారు. వీరంతా ఔట్‌సోర్సింగ్ విధానంలో కొనసాగుతున్నారు. ప్రతి ఏడాది ఆయిల్‌ఫెడ్ నిర్ణయించే ధరలకు టెండర్ దక్కించుకునే కాంట్రాక్టర్ వీరికి వేతనాలు ఇస్తుం డాలి. నెలక్రితం ఇద్దరు వ్యక్తులు టెక్నో సంస్థ పేరిట టెండర్‌ను దక్కించుకున్నారు.
టెండర్ నిబంధనల ప్రకారం ఒక్కొక్క కార్మికుడు రోజులో 8గంటలు పని చేయాలి. అయితే గతంలో టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ మాదిరిగానే ఒక్కొక్కొ కార్మికుడికి గంటకు రూ.43.75 చెల్లించాల్సి ఉండగా ప్రస్తుత కాంట్రాక్టర్ రూ 30 మాత్రమే ఇస్తానని చెప్పడంతో ఈ వివాదం చోటుచేసుకుంది. ఆగ్రహించిన కార్మికులు లోడి ంగ్ పాయింట్ వద్ద పనులు బహిష్కరించి నిరసన తెలిపారు. అనంతరం పామాయిల్ మేనేజర్ కార్యాలయం వద్ద రెండు గంటలపాటు ధార్నా చేశారు. గంటకు రూ. 50 చెల్లించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ డివిజన్ నాయకుడు పిట్టల అర్జున్‌తో డిప్యూటీ మేనేజర్ హరినాథ్‌బాబు, ఏఈఈ నాగేశ్వరరావు చర్చించారు. మేనేజర్ వచ్చాక ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్తామని, అప్పటి వరకు కార్మికులకు పాత పద్దతినే కాంట్రాక్టర్ వేతనాలు చెల్లిస్తారని చెప్పడంతో కార్మికులు శాంతించారు.
పామాయిల్ ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ కార్మికుల నిరసన
Published Sat, Oct 5 2013 5:16 AM | Last Updated on Fri, Sep 1 2017 11:20 PM
Advertisement
Advertisement