factory workers
-
అమ్మా.. బతుకుతామో లేదో తెలీదు: కుమార్తెకు తండ్రి చివరి కాల్
చిత్తూరు కలెక్టరేట్/చిత్తూరు అర్బన్ : మరణం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలీదు. తండ్రి, స్నేహితుడితో కలిసి తన పుట్టిన రోజు జరుపుకుంటున్న యువకుడు అదే రోజు మృత్యుఒడిలోకి చేరుతాడని అనుకోలేదు. అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యను, కుమారుడిని వదిలిపెట్టి, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు పడ్డ కష్టాన్ని తన విద్యతో రూపుమాపడానికి విదేశాలకు వెళ్లాల్సిన యువకుడి ఆశ అడియాశలైపోయింది. చిత్తూరు నగరంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ (65), ఢిల్లీబాబు (35), బాలాజీ (24) కుటుంబ పరిస్థితులు చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెడుతున్నారు. అనుమతులేవీ..? ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన ఆ భవనంలో ఏడాదిన్నర కాలంగా భాస్కర్ పేపర్ ప్లేట్లను తయారుచేసే కుటీర పరిశ్రమను నడిపిస్తున్నారు. దీనికి అధికారుల నుంచి ఎలాంటి అనుమతుల్లేవు. తమిళనాడు నుంచి భారీ మొత్తంలో సరుకును తెప్పించి, ఇక్కడ చిన్నపాటి యంత్రంతో ఒత్తిడినిచ్చి పేపర్ ప్లేట్లకు రూపునిచ్చి తయారు చేస్తున్నారు. పైగా భవనం ఏళ్లక్రితం నిర్మించింది కావడంతో అగ్నిప్రమాదం జరిగితే బయటపడే ముందస్తు ప్రణాళికలు ఏవీ కనిపించలేదు. ఈ ఘటనలో మృతి చెందిన బాధితుల శరీరంపై ఒక్క గాయం కూడా లేదు. వ్యాపించిన పొగకు ఊపిరి ఆడక ఆ ముగ్గురు మృతిచెందినట్లు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. ఆ భవనానికి రెండోవైపు దారి ఉండుంటే ప్రాణాలు పోయేవి కావని, ఒకేదారి ఉండడంతో మంటల్లో ప్రధాన దారి నుంచి లోనికి ప్రవేశించేందుకు కష్టతరం అయిందని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి పెద్దిరెడ్డి తెలిపారు. కన్నీటి వీడ్కోలు ..: మృతుల్లో భాస్కర్‌కు ముగ్గురు సంతానం. కుమార్తెలు దీప్తి, దివ్య, కుమారుడు డిల్లీబాబు ఉన్నారు. దివ్య వివాహం చేసుకుని దుబాయ్‌లో ఉండగా, తల్లి శమంతకమణిని మూడు నెలల క్రితం తనవద్దకు తీసుకెళ్లింది. తన తండ్రి, అన్న మరణవార్త వినగానే అర్థరాత్రి దుబాయ్ నుంచి హుటాహుటిన ఇక్కడికి బయలుదేరి బుధవారం మధ్యాహ్నం చిత్తూరుకు చేరుకున్నారు. భాస్కర్, డిల్లీబాబుకు బంధువులు, మిత్రుల అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. పరామర్శ.. ఘటనపై కలెక్టర్ హరినారాయణన్, ఎస్పీ రిషాంత్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని చిత్తూరు ఆర్డీవో రేణుక, తహసీల్దారు పార్వతి, కమిషనర్ అరుణ పరిశీలించారు. బాధితులను పరామర్శించారు. స్థానిక కార్పొరేటర్ నాజీరా, వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ అల్తాఫ్ ఇంకా స్థానికులు ప్రమాద ఘటనలో వేగంగా స్పందించినా.. వీళ్ల ప్రయత్నం ఫలించలేదు. ఇక మాజీ ఎమ్మెల్యే సీకే బాబు సైతం మృతుల కుటుంబాలను ఓదార్చి ధైర్యం చెప్పారు. ప్రమాద ఘడియలు ఇలా.. ►మంగళవారం అర్ధరాత్రి 11 గంటలు : చిత్తూరు నగరంలోని 44 వ డివిజన్ రంగాచారి వీధిలో పేపర్ ప్లేట్లు తయారుచేసే ఇంట్లో ఢిల్లీబాబు, తన తండ్రి భాస్కర్, స్నేహితుడు బాలాజీతో కలిసి తన జన్మదిన వేడుకలు జరుపుకున్నాడు. ►రాత్రి 11.10 : అప్పటి వరకు సరదాగా ఉన్న ఇంట్లోని వంటగది నుంచి వైర్లు కాలే వాసన వస్తోంది. సున్నపు దిమ్మెలతో నిర్మించి ఆ ఇంట్లో వైర్లు అప్పుడప్పుడు షార్ట్ సర్క్యూట్ అవడం మామూలేనని ముగ్గురూ పట్టించుకోకుండా ఉండిపోయారు. కొద్ది నిముషాల్లోనే నిప్పు రవ్వలు అక్కడ నిల్వ చేసిన పేపర్ప్లేట్లపై పడటంతో మంటలు వ్యాపించాయి. ►రాత్రి 11.14 : ఈ ఇంట్లో భారీ మొత్తంలో పేపర్‌ప్లేట్లను నిల్వ చేసి ఉంచడంతో క్షణాల్లో మంటలు భవనం మొత్తం అలముకున్నాయి. ఇదే సమయంలో దట్టమైన పొగ కమ్ముకోవడంతో అక్కడున్న ముగ్గురూ భయపడిపోయారు. బయటకు వెళ్లే మార్గంలో మంటలు వ్యాపించాయి. ►రాత్రి 11.15 : భాస్కర్ తన కుమార్తెకు చివరసారిగా ఫోన్ చేశాడు. ‘అమ్మా... ఇల్లు మొత్తం కాలిపోతా ఉంది. ఏమీ కనిపించలేదు. మీ అన్న కూడా నాతోనే ఉన్నాడు. బతుకుతామో లేదో తెలీదు...’ అంటుండగానే ఫోన్ కట్ అయిపోయింది. ముగ్గురూ ప్రాణభయంతో పరుగులుపెట్టి బాత్రూమ్లోకి వెళ్లిపోయారు. ►రాత్రి 11.17: రామ్‌నగర్ కాలనీకు చెందిన శ్రీకాంత్ అనే యువకుడు రంగాచారి వీధివైపు వెళుతూ భవనంలో మంటలుచూసి డయల్ –100కు ఫోన్ చేయడం, స్థానికులు అగ్నిమాపకశాఖకు సమాచారం ఇచ్చారు. బయటున్నవాళ్లు భవనంలో ఉన్నవారికి ఫోన్‌చేసినా ఫోన్ కలవలేదు. ►రాత్రి 11.25 : ఒకదాని వెంట ఒకటి రెండు ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సిబ్బంది ఎంత ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. పాకాల నుంచి మరో ఫైర్ ఇంజిన్ వచ్చింది. నీళ్లు అయిపోవడంతో మళ్లీ ఫైర్ ఇంజన్ వెళ్లి నీళ్లు నింపుకుని వచ్చింది. కార్పొరేషన్ ట్యాంకు నుంచి అదనంగా నీళ్లు తీసుకొచ్చారు. ►అర్థరాత్రి 12.45 : మంటలు స్వల్పంగా తగ్గడంతో ధైర్యం చేసిన అగ్నిమాపక సిబ్బంది, స్థానికుల సాయంతో ఇంటి పక్కనే ఉన్న గది షెటర్ తీసి లోపలకు వెళ్లారు. అక్కడున్న మరో కిటికీకి పగులగొట్టి గదుల్లో వెతికితే బాత్రూమ్లో భాస్కర్, ఢిల్లీబాబు, బాలాజీ విగత జీవులుగా పడున్నారు. వెంటనే అంబులెన్సులో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ముగ్గురూ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆశలు బుగ్గి పాలు ఘటనలో మృతి చెందిన డిల్లీబాబు సాఫ్ట్వేర్ ఇంజినీర్. మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. అతనికి ఏడాది వయసున్న బాబు (సాత్విక్) ఉన్నాడు. మంగళవారం ఢిల్లీబాబు పుట్టినరోజు కావడం, తన తండ్రి పక్కనే కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో మృత్యువాత పడటం స్థానికుల్ని కలచివేసింది. డిగ్రీ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం మరో రెండు నెలల్లో విదేశాలకు వెళదామనుకున్న బాలాజి ఆశలు అగ్నికి ఆహుతయ్యాయి. తవణంపల్లి మండలం తెల్లగుండ్ల పల్లికి చెందిన కరుణాకర్, పార్వతి దంపతుల కుమారుడు బాలాజీ. కుటుంబంతో కలిసి మూడేళ్ల క్రితం చిత్తూరుకు వచ్చి, రంగాచారి వీధిలో బాడుగ ఇంట్లో ఉంటున్నాడు. బాలాజి తండ్రి గ్రానైట్ ఫ్యాక్టరీలో కూలీ పని చేస్తుండగా, తల్లి పార్వతి ఇంటి పని చేస్తూ కుటుంబాన్ని లాక్కొస్తోంది. భర్తకు అనారోగ్యంగా ఉండటం ఆ కుటుంబాన్ని కుంగదీస్తుంటే, కుమారుడ్ని విదేశాలకు పంపుతున్నామనే చిన్న సంతోషం వాళ్లకు పునర్జీవం పోస్తూ వచ్చింది. తీరా చెట్టంత కొడుకు తమను విడిచి శాశ్వతంగా వెళ్లిపోయాడని తెలుకున్న ఆ దంపతులకు కన్నీళ్లు తప్ప మరేమీ మిగల్లేదు. తెల్లగుండ్లపల్లిలోనే అంత్యక్రియలు నిర్వహించారు. -
చిత్తూరు: ఘోర ప్రమాదం.. ముగ్గురి సజీవ దహనం
సాక్షి, చిత్తూరు: జిల్లాలో ఘోరం జరిగింది. పేపర్ ప్లేట్లు తయారు చేసే పరిశ్రమలో మంటలు చెలరేగి ముగ్గురు సజీవదహనం అయ్యారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రంగాచారి వీధిలో ఉన్న పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో చిక్కుకుని ముగ్గురు సజీవదహనం అయ్యారు. మృతుల్ని భాస్కర్, ఢిల్లీ బాబు, బాలాజీగా గుర్తించారు. షార్ట్ స్కర్యూట్‌తో అర్ధరాత్రి 2గం. సమయంలో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. మృతుల్లో తండ్రీకొడుకులతో పాటు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉన్నట్లు సమాచారం. కాగా.. ఫ్యాక్టరీ యాజమాని కొడుకు ఢిల్లీబాబు సదరు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా నిర్ధారణ అయ్యింది. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. -
ఛీ ఛీ.. నాలుకతో ఎంగిలి చేస్తూ, కాళ్లతో తొక్కుతూ..
రస్క్‌లు తినే అలవాటు చాలామందికి ఉంటుంది. ఉదయం సాయంత్రం, ఛాయ్‌లో ముంచుకొని వీటిని తింటుంటారు. అయితే ఈ వీడియో చూసిన తర్వాత రస్క్‌లు తినే ముందు ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే రస్క్‌ల తయారీకి చెందిన ఓ షాకింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంతోంది. అసలేం జరిగిందంటే.. ఓ ఫ్యాక్టరీలో కొందరు రస్క్‌లు తయారు చేస్తూ వాటిని ప్యాక్ చేస్తున్నారు. అయితే వారిలో ఒక వర్కర్ ట్రేలోని రస్క్‌లపై తన పాదాలను ఉంచాడు. అంతేగాక చేతులోకి కొన్ని రస్క్‌లను తీసుకొని నాలుకతో నాకుతూ ప్యాకింగ్ చేశాడు. ఇదంతా చూస్తూ పక్కన ఉన్న వారు సంతోషంతో నవ్వుతున్నారు. చదవండి: వీడియో: కన్న కూతురిని చితకబాదుతూ తండ్రి పైశాచిక ఆనందం ఈ వీడియోను శివకుమార్ పార్థసారథి అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ షేర్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. వర్కర్ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్లని పట్టుకుని తన్నాలని కొందరు.. జైల్లో పెట్టాలని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు .నెటిజన్లతో పాటు బాలీవుడ్ నటి రవీనా టండన్ సీరియస్ అయ్యారు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఈ వీడియోను షేర్ చేస్తూ.."వారు పట్టుబడతారని, ఎప్పటికీ కటకటల వెనుకే మగ్గుతారని ఆశిస్తున్నా అంటూ పేర్కొన్నారు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందో క్లారిటీ లేదు. View this post on Instagram A post shared by Shivkumar Parthasarathy (@instantshiva) -
కార్మికుల జీవితాలు ఎవడికి కావాలి?!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని రెండు కర్మాగారాల్లో వారం రోజుల వ్యవధిలో సంభవించిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో 17 మంది మరణించడం, 75 మంది గాయపడడం తెల్సిందే. మహారాష్ట్ర, ధూలే జిల్లాలోని రసాయనిక ఫ్యాక్టరీలో ఆగస్టు 28వ తేదీన సంభవించిన పేలుడులో 13 మంది మరణించారు. 72 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఫ్యాక్టరీలోని కెమికల్ బ్యారెల్‌లో లీక్ ఏర్పడిన పర్యవసానంగా అగ్ని ప్రమాదం జరిగింది. ముందుగా లీకైన బ్యారెల్ పేలడంతో పర్యవసానంగా పక్కనే ఉన్న ఇతర బ్యారెళ్లు, నైట్రోజన్ సిలిండర్లు కూడా పేలిపోయాయి. పలువురు కార్మికులు ఫ్యాక్టరీ సమీపంలోనే తాత్కాలిక వసతి కల్పించడం వల్ల పేలుడు ధాటికి కార్మికుల కుటుంబ సభ్యులు కూడా మత్యువాత పడ్డారు. ఫ్యాక్టరీ నుంచి దుర్వాసన వస్తోందని రెండు వారాల క్రితమే స్థానికులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ వారు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడంతో ఇంత ఘోరం జరిగింది. ఇక రెండో పేలుడు సంఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. ముంబై కోస్తా తీరంలోని చమురు, సహజ వాయువుల కార్పొరేషన్ ప్లాంట్‌లో పేలుడు సంభవించడంతో నలుగురు మరణించారు. ముగ్గురు గాయపడ్డారు. మరణించిన వారిలో ముగ్గురు కేంద్ర పారిశ్రామిక భద్రతా సిబ్బందికి చెందిన వారు. వారు మంటలను ఆర్పే ప్రయత్నంలో తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఈ సహజ వనరుల సంస్థ దేశంలోనే అతి పెద్దది. భారత్‌లో ఇలాంటి పారిశ్రామిక ప్రమాదాలు జరగడం సర్వ సాధారణమే. ఈ రెండు ప్రమాదాల గురించి ఈసారి మీడియాలో ఎక్కువ కవరేజీ రావడం మాత్రం అసాధారణమే. 2014 నుంచి 2016 మధ్య రెండేళ్ల కాలంలో ఫ్యాక్టరీల్లో సంభవించిన ప్రమాదాల్లో 3,562 మంది కార్మికులు మరణించారని, 51,000 మంది గాయపడ్డారని ‘కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ’ నివేదిక తెలియజేస్తోంది. ఈ లెక్కంబడి ఫ్యాక్టరీ ప్రమాదాల్లో రోజుకు ముగ్గురు మరణిస్తుంటే, 47 మంది గాయపడుతున్నట్లు లెక్క. భారత్‌లో ఏటా వత్తిపరమైన ప్రమాదాల్లో 48 వేల మంది మరణిస్తున్నారని ‘బ్రిటీష్ సేఫ్టీ కౌన్సిల్’ 2017లో విడుదల చేసిన ఓ నివేదిక వెల్లడించింది. వారిలో 24 శాతం మంది భవన నిర్మాణ కూలీలేనని పేర్కొంది. వివిధ పరిశ్రమల్లో కార్మికుల భద్రత, ఆరోగ్య పరిరక్షణ. వారు పనిచేసే పరిస్థితులకు సంబంధించి దేశంలో ఇప్పటికే 13 చట్టాలు అమల్లో ఉన్నాయి. వాస్తవానికి కార్మికుల భద్రత కోసం దేశంలో ఇన్ని చట్టాలు అవసరం లేదు. ఈ చట్టాలన్నింటికీ కలిపి సమగ్రమైన చట్టం ఒక్కటి ఉన్నా, దాన్ని కచ్చితంగా అమలు చేసినా నేడు దేశంలోని ఫ్యాక్టరీలలో ఇన్ని ప్రమాదాలు జరుగుతుండేవి కావు. ప్రస్తుతమున్న 13 చట్టాలను అమలు చేసినా ఇన్ని ప్రమాదాలు జరిగేవి కావు. భారతీయ పారిశ్రామిక రంగంలో నిర్లక్ష్యం అనేది అనివార్యంగా కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలోని ‘జాతీయ థర్మల్ విద్యుత్ కార్పొరేషన్ ప్లాంట్’లో 2017లో సంభవించిన పేలుడులో 32 మంది కార్మికులు మరణించారు. బాయిలర్ గొట్టాల (నాళాలు)ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి ఉన్నట్లయితే ఈ పేలుడు సంభవించి ఉందేది కాదని యూపీ కార్మికాభివద్ధి శాఖ ఓ నివేదికలో వెల్లడించడం ఇక్కడ గమనార్హం. ఢిల్లీలోని భావన పారిశ్రామిక ప్రాంతంలోని ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో గతేడాది జనవరిలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 17 మంది కార్మికులు మరణించారు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు తప్పించుకోవడానికి అక్కడి ఫ్యాక్టరీ ప్రధాన గేట్ తర్వాత మరో మార్గమే లేదు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా తప్పించుకోవచ్చో రూట్ మ్యాప్‌గానీ, అందుకు తగ్గ ఏర్పాట్లుగానీ ఆ భవనంలో లేవు. పైగా నిబంధనలకు విరుద్ధంగా అదే భవనాన్ని బాణసంచా నిల్వ గిడ్డంగి కూడా అక్రమంగా వినియోగిస్తున్నారు. ఇలాంటి ఫ్యాక్టరీలను ఎప్పటికప్పుడు కంపెనీ ఇన్స్పెక్టర్లు తనిఖీ చేసి కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ‘బ్రిటీష్ సేఫ్టీ కౌన్సిల్’ అధ్యయన నివేదిక ప్రకారం భారత్‌లో ప్రతి 506 ఫ్యాక్టరీలకు ఒక ఇన్స్పెక్టర్ చొప్పున ఉన్నారు. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. స్వేచ్ఛా వాణిజ్య చట్టాలు కార్మిక సంఘాల చేతులు విరిచేయగా, నేటి రాజకీయాలు వాటి ఉనికినే ప్రశ్నార్థకం చేశాయి. దాంతో పరిశ్రమల యాజమాన్యాల దష్టిలో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టిలో, ఎప్పటికప్పుడు వారిపై ఒత్తిడి తేగల సత్తా ఉన్న ప్రజల దష్టిలో నేడు కార్మికుడి ప్రాణాలకు విలువలేకుండా పోయింది. వారి బతుకులు గాలిలో దీపాలయ్యాలి. -
‘రేయాన్స్’పై మంత్రుల ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: భూపాలపల్లి జిల్లా కమలాపూర్ రేయాన్స్ ఫ్యాక్టరీలో (బిల్ట్– బల్లాపూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్) పని చేస్తున్న కార్మికుల పట్ల కంపెనీ యాజ మాన్యం నిర్లక్ష్య ధోరణిపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, గిరిజన, పర్యాటక శాఖ మంత్రి చందూ లాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ మూతపడటంతో రోడ్డున పడిన దాదాపు 750 మంది కార్మికులకు ఈనెల 9వ తేదీలోపు సంక్రాంతి పండుగ కోసం ఒక నెల జీతం చెల్లించాలని కంపెనీ ప్రతినిధికి డెడ్‌లైన్ విధించారు. 10వ తేదీన సచివాలయంలో జరిగే సమావేశానికి కంపెనీ సీఈవో హాజరు కావాలని ఆదేశిం చారు. ఈ రెండింటిలో దేనిలో విఫలమైనా తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫ్యాక్టరీ మూతపడి రెండేళ్లు గడుస్తున్నా కార్మికుల సమస్యలను తీర్చ డం లేదని రేయాన్స్ ఫ్యాక్టరీ యూనియన్ల జేఏసీ మంత్రులను ఆశ్రయించడంతో వారి ఆధ్వర్యంలో మంగళవారం సచివాల యంలో యూనియన్ల నాయకులు, కంపెనీ ప్రతినిధులతో సంయుక్త సమా వేశం జరిగింది. ఈ సమావేశంలో ఫ్యాక్టరీ యాజమాన్య ధోరణిని మంత్రులకు యూనియన్ ప్రతినిధులు వివరించారు. 32 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని వారి గోడు వెల్లడించారు. దీనిపై కడియం, నాయిని, చందూలాల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ మూతపడితే కార్మికులు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో మూడేళ్ల క్రితం సీఎం కేసీఆర్, కంపెనీ యాజమాన్యం అడిగిన ప్రతి డిమాండ్‌నూ అంగీకరిం చారన్నారు. త్వరలోనే కంపెనీ ప్రారం భిస్తామని హామీ ఇచ్చిన యాజమాన్యం ఇప్పటివరకు ఆ విషయం పట్టించు కోకపోవడం సీరియస్‌గా పరిగణిస్తున్నా మన్నారు. తీరు మార్చుకోకపోతే చట్టప రంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు ఏకకా లంలో చేపట్టాల్సి వస్తుందని హెచ్చరిం చారు. ఈ సమావేశంలో కార్మికశాఖ కమి షనర్ అహ్మద్ నదీమ్, జాయింట్ కమి షనర్ భాగ్యనాయక్, డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు, బిల్ట్ ఇండస్ట్రీ డిప్యూటీ జనరల్ మేనేజర్ కేశవరెడ్డి పాల్గొన్నారు. -
ఉక్కపోతకు అలవెన్స్ కావాల్సిందే
చెన్నై : వేసవికాలంలో ఎండలకు ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే బయపడాల్సిన పరిస్థితి. అలాంటిది ఎండ వేడి అధికంగా ఉన్న ప్రాంతాల్లో పనిచేయాలంటే ఉద్యోగులు ఎంత కష్టం. ఈ వేడిని అధిగమిస్తూ పనిచేయడానికి ఉద్యోగులకు చాలా కంపెనీలు పండ్ల రసాలు, మజ్జిగలు అందిస్తుంటాయి. కానీ కంపెనీలు తీసుకునే ఈ చర్యలతో ఉద్యోగులకు కొంత మాత్రమే ఉపశమనం దొరుకుతుంది. ఈ నేపథ్యంలో వేడిని తట్టుకోలేని ప్రతికూల పరిస్థితులు ప్రాంతాల్లోని ఫ్యాక్టరీ ఉద్యోగులకు వేడి భత్యం చెల్లించాలని పట్టుబడుతున్నారు. వేడి భత్యం ఇవ్వాలని కంపెనీ యాజమాన్యాలను అడిగినట్టు రెనాల్డ్ నిషాన్ యూనియన్ ప్రతినిధులు తెలిపారు. యాజమాన్యాలు మాత్రం దీనిపై ఇప్పటి వరకూ ఏమాత్రం స్పందించలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఎండ వేడి అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఈ భత్యం చెల్లించడం కొత్తమీ కాదని, హ్యుండాయ్ కార్ల తయారీ కంపెనీ ఒక ఉద్యోగికి నెలకు రూ.500 ఇస్తుందని ఆ కంపెనీ ప్రతినిధులు చెప్పారు. పౌండ్రీ ప్రక్రియల్లో ఎక్కువ వేడి పనులు జరుగుతాయని, అక్కడ మెటల్స్ ను 500 డిగ్రీల సెల్సియస్ వద్ద కరిగించాల్సి ఉంటుందని తెలిపారు. అంతకముందు వరకు ఉద్యోగులను ఫ్యాక్టరీ తీసుకొచ్చే బస్సులు ప్రధాన గేట్ వద్దే దించేవని, అయితే ఇప్పుడు పని ప్రాంతంలో దించేలా చర్యలు తీసుకున్నామని హ్యుండాయ్ కంపెనీ పేర్కొంది. మే నుంచి క్యాంటీన్ లో కూడా మజ్జిగ పానీయం, నిమ్మరసాలు అందిస్తామని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. చెన్నైలో ఈ మూడేళ్లలో ఈ ఫిబ్రవరి అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మార్చిలో ఈ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఈ క్రమంలోనే ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న చోట్ల వేడిమి తట్టుకోలేని ఫ్యాక్టరీ ఉద్యోగులు వేడి భత్యాలు డిమాండ్ చేస్తున్నారు. -
కనీస బోనస్ రూ.6 వేలు!
సీలింగ్ ఎత్తివేసే అవకాశం న్యూఢిల్లీ: ఫ్యాక్టరీ కార్మికులకు, ఇతర సిబ్బందికి చెల్లించే బోనస్‌పై సీలింగ్‌ను ఎత్తివేసే అవకాశం ఉంది. వచ్చేనెలలో జరిగే భారత కార్మిక సదస్సులో ఈమేరకు నిర్ణయం తీసుకుంటారు. బోనస్‌ను కనీసం రూ. 6,000 వరకు చెల్లించాలని ప్రతిపాదించారు. పరిమితిని కూడా రూ.18 వేలకు పెంచాలని నిర్ణయించనున్నారు. ప్రస్తుతం రూ.పదివేల వరకు జీతభత్యాలు తీసుకునే సిబ్బందికి మాత్రమే నెలకు రూ.3.500 బోనస్‌గా చెల్లిస్తున్నారు. ఈ పరిమితిని తొలగించాలని పలు కార్మికసంఘాలు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. పలువురు ఎంపీలు కూడా ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించి కనీసం కార్మికులందరికైనా బోనస్ చెల్లించాలని కోరారు. మారిన పరిస్థితుల్లో సీలింగ్ విధించడం భావ్యంకాదని చెప్పారు. అందుకని 1965 నాటి బోనస్ చట్టాన్ని సవరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా గత శుక్రవారం జరిగిన కార్మిక కమిటీ స్థాయీసంఘ సమావేశంలో బోనస్ సీలింగ్పరిమితిని పెంచాలని ప్రతిపాదించారు. దీంతో సుమారు మూడు కోట్ల మంది కార్మికులకు ప్రయోజనం కలుగుతుంది. -
పామాయిల్ ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ కార్మికుల నిరసన
అశ్వారావుపేట రూరల్, న్యూస్‌లైన్: అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో మరో వివాదానికి తెర లేచింది. ఇప్పుడిప్పుడే వివాదాలు సద్దుమణుగుతున్నాయనుకుంటున్న సమయంలో కొత్తగా కార్మికుల వేతనాల అంశం వివాదాస్పదంగా మారింది. ఇటీవల టెండర్ దక్కించుకున్న కొత్త కాంట్రాక్టర్ కార్మికులకు వేతనాలు తగ్గించి ఇస్తానని చెప్పడంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కాంట్రాక్ట్‌తో తనకు నష్టం వాటిల్లుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. తక్కువ జీతం తీసుకోవడం ఇష్టం లేనివారు శుక్రవారం నుంచి పనికి రావద్దని పేర్కొనడంతో కార్మికులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురై వాగ్వాదానికి దిగారు. దీంతో శుక్రవారం ఉదయం నుంచి 12గంటల వరకు పామాయిల్ గెలల దిగుమతి నిలిచిపోయింది. అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో 30 మంది కాంట్రాక్ట కార్మికులు కొంతకాలంగా పనిచేస్తున్నారు. వీరంతా ఔట్సోర్సింగ్ విధానంలో కొనసాగుతున్నారు. ప్రతి ఏడాది ఆయిల్‌ఫెడ్ నిర్ణయించే ధరలకు టెండర్ దక్కించుకునే కాంట్రాక్టర్ వీరికి వేతనాలు ఇస్తుం డాలి. నెలక్రితం ఇద్దరు వ్యక్తులు టెక్నో సంస్థ పేరిట టెండర్‌ను దక్కించుకున్నారు. టెండర్ నిబంధనల ప్రకారం ఒక్కొక్క కార్మికుడు రోజులో 8గంటలు పని చేయాలి. అయితే గతంలో టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ మాదిరిగానే ఒక్కొక్కొ కార్మికుడికి గంటకు రూ.43.75 చెల్లించాల్సి ఉండగా ప్రస్తుత కాంట్రాక్టర్ రూ 30 మాత్రమే ఇస్తానని చెప్పడంతో ఈ వివాదం చోటుచేసుకుంది. ఆగ్రహించిన కార్మికులు లోడి ంగ్ పాయింట్ వద్ద పనులు బహిష్కరించి నిరసన తెలిపారు. అనంతరం పామాయిల్ మేనేజర్ కార్యాలయం వద్ద రెండు గంటలపాటు ధార్నా చేశారు. గంటకు రూ. 50 చెల్లించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ డివిజన్ నాయకుడు పిట్టల అర్జున్‌తో డిప్యూటీ మేనేజర్ హరినాథ్‌బాబు, ఏఈఈ నాగేశ్వరరావు చర్చించారు. మేనేజర్ వచ్చాక ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్తామని, అప్పటి వరకు కార్మికులకు పాత పద్దతినే కాంట్రాక్టర్ వేతనాలు చెల్లిస్తారని చెప్పడంతో కార్మికులు శాంతించారు.