సాక్షి,న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి భారీ ఊరట లభించింది.1200 కోట్ల రూపాయల రుణం విషయంలో ఎస్‌బీఐ చేపట్టనున్న దివాలా చర్యలను ఢిల్లీ హైకోర్టు అడ్డుకుంది. ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ సోదరుడు, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీపై దాఖలైన దివాలా పిటిషన్‌ను కోర్టు గురువారం నిలిపివేసింది. అలాగే ఆస్తులను విక్రయించకుండా అనిల్ అంబానీని నిలువరిస్తూ ఆదేశాలు జారీచేసింది. (చదవండి : అనిల్ అంబానీకి ఎస్‌బీఐ షాక్)
అడాగ్ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ లిమిటెడ్ తీసుకున్న కార్పొరేట్ రుణాలపై అనిల్ అంబానీ వ్యక్తిగత హామీ ఇచ్చారు. ఇవి మొండి బకాయిలుగా మారటంతో దివాలా చట్టం ప్రకారం అంబానీ నుంచి రూ.1200 కోట్లను రాబట్టేందుకు ఎస్‌బీఐ రంగంలోకి దిగింది. కార్పొరేట్ రుణాల చెల్లింపుల ప్రక్రియకు ఒక రిజల్యూషన్ ప్రొఫెషనల్‌ను నియమించాలని కోరుతూ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)ని ఎస్‌బీఐ ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
మొబైల్ సేవల్ సంస్థ ఆర్‌కామ్ 2002లో అనిల్ అంబానీ ప్రారంభించారు. కానీ పోటీకి నిలబడలేక, భారీ అప్పుల్లో కూరుకుపోయింది. ఆ తరువాత 2016లో ముకేశ్ అంబానీ సృష్టించిన జియో సునామీతో మరింత కుదేలై దివాలా తీసింది. అటు 2017 జనవరిలో రుణ చెల్లింపులో డిఫాల్ట్ కావడంతో ఆర్‌ఐటిఎల్ రుణాన్ని 26 ఆగస్టు 2016 నుండి నిరర్ధక ఆస్తిగా ప్రకటించింది బ్యాంకు. ప్రస్తుతం ఈ రెండు కంపెనీలు మూతపడ్డాయి. మరోవైపుఈ విషయం కార్పొరేట్ రుణానికి సంబంధించినదని, వ్యక్తిగత రుణానికి చెందినది కాదని అడాగ్ గ్రూపు గతంలోనే ప్రకటించింది. ఈ ఏడాది మార్చిలోనే రుణ పరిష్కార ప్రణాళికలకు రుణదాతలు అంగీకరించారని, ట్రైబ్యునల్ ఆమోదం కోసం వేచి చూస్తున్నట్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment