తమ్ముడు ఆస్తులు కొనుగోలు : రేటింగ్‌పై ప్రభావమెంత? | RCom purchase not to impact RIL ratings: Moody's | Sakshi
Sakshi News home page

తమ్ముడు ఆస్తులు కొనుగోలు : రేటింగ్‌పై ప్రభావమెంత?

Published Sat, Dec 30 2017 11:45 AM | Last Updated on Sat, Dec 30 2017 11:47 AM

RCom purchase not to impact RIL ratings: Moody's - Sakshi

తమ్ముడు అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ ఆస్తుల కొనుగోలు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ క్రెడిట్‌ రేటింగ్‌పై ఏ మాత్రం ప్రభావం చూపదని గ్లోబల్‌ రేటింగ్స్‌ ఏజెన్సీ మూడీస్‌ తెలిపింది. రూ.25వేల కోట్ల కంటే తక్కువకే జరిగే ఈ డీల్‌, రిలయన్స్‌ రేటింగ్‌ను పెంచదని పేర్కొంది. ఇప్పటికీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వద్ద నగదు, నగదుతో సమానమైనవి రూ.77వేల కోట్ల వరకు ఉన్నాయని, ఈ ఫండ్లను వాడుతూ ఈ కొనుగోలు చేపడుతుందని గ్లోబల్‌  రేటింగ్స్‌ ఏజెన్సీ సీనియర్‌ క్రెడిట్‌ ఆఫీసర్, వైస్‌ ప్రెసిడెంట్‌ వికాస్‌ హలాన్‌ చెప్పారు. ప్రస్తుతం స్టేబుల్‌ అవుట్‌లుక్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రేటింగ్‌ 'బీఏఏ2'గా కొనసాగుతోందని తెలిపారు.

రుణాలతో  కొట్టుమిట్టాడుతున్న రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ రేటింగ్‌ను గత నవంబర్‌లో మూడీస్‌ ఉపసంహరించింది. కంపెనీ డాలర్‌ బాండ్‌హోల్డర్స్‌కు చెల్లింపులు చేయడంలో ఆలస్యం చేసిన కారణంగా రేటింగ్‌ను ఉపసంహరించినట్టు తెలిపింది. ఆర్‌కామ్‌కు చెందిన టవర్లు, ఆప్టిక్‌ ఫైబర్‌ కేబుల్‌ నెట్‌వర్క్స్‌, స్పెక్ట్రమ్‌, మీడియా కన్వర్జెన్సీ నోడ్స్‌ వంటి ఆస్తులను కొనుగోలు చేయడానికి ప్రస్తుతం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కి చెందిన రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ ముందుకొచ్చింది. దీని కోసం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ.25వేల కోట్ల కంటే తక్కువగానే ఖర్చు చేస్తుందని ఏజెన్సీ అంచనావేస్తోంది. 

అయితే మున్ముందు కొనుగోళ్లను పెంచితే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రేటింగ్‌ కింద కంపెనీ పరిపుష్టిని తగ్గిస్తామని, ముఖ్యంగా టెలికాం వ్యాపారాల్లో తను ప్రణాళిక బద్ధమైన మూలధన ఖర్చులను తగ్గించకపోతే, ఈ చర్యలు చేపడతామని ఏజెన్సీ వార్నింగ్‌ ఇచ్చింది. ఆర్‌కామ్‌ ఆస్తులను తాము కొనుగోలు చేయబోతున్నామంటూ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రకటించి అందర్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. మార్చి వరకు ఈ డీల్‌ను ముగించవచ్చని తెలిపింది. ఈ కొనుగోలు, ఆర్‌కామ్‌కు చెందిన టెలికాం మౌలిక సదుపాయాల ఆస్తులను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ దక్కించుకోవడానికి సాయపడుతుందని, అయితే ఆర్‌కామ్‌ 4జీ స్పెక్ట్రమ్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రత్యర్థుల చేతుల్లోకి పోదని మూడీస్‌ తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement