టెలికంలో రాంగ్‌ సిగ్నల్స్‌..! | Telecom department approves RCom-MTS merger | Sakshi
Sakshi News home page

టెలికంలో రాంగ్‌ సిగ్నల్స్‌..!

Published Tue, Oct 24 2017 12:35 AM | Last Updated on Tue, Oct 24 2017 3:25 AM

Telecom department approves RCom-MTS merger

సాక్షి, బిజినెస్‌ విభాగం:  లాభాలొస్తాయి.. సంపాదించుకోవచ్చు కదా అని ఉన్న డబ్బుల్ని ఇన్వెస్ట్‌ చేస్తే..!! లాభాల సంగతేమో కానీ.. టెలికం కంపెనీలకు పెట్టుబడే పోయేట్లుంది!!. ఒకటి కాదు... రెండు కాదు... దేశీ టెలికంలోకి  ప్రవేశించిన విదేశీ కంపెనీలు చాలావరకూ చాప చుట్టేస్తున్నాయి. వాటి కార్యకలాపాలకు మంగళం పాడేసి ఇంటికెళ్లిపోతున్నాయి.

కొన్నాళ్లుగా టెలికం పరిశ్రమలో జరుగుతున్న విలీనాలు గమనిస్తే ఈ విషయాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఏదో నాలుగు రాళ్లు వెనకేసుకుందామని వచ్చిన విదేశీ సంస్థలు.. ఇక్కడ పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్లపై గట్టిగా ఎలాంటి ప్రతిఫలం పొందలేదు. చేతులు కాలి... పెట్టిన పెట్టుబడులను సైతం వదులుకోవాల్సిన పరిస్థితి. రష్యాకు చెందిన సిస్టెమా శ్యామ్, నార్వేకు చెందిన టెలినార్, మలేసియాకు చెందిన మాక్సిస్, జపాన్‌కు చెందిన ఎన్‌టీటీ డొకొమో వంటి కంపెనీలు టెలికంలోకి ఎంట్రీ ఇచ్చి చేతులు కాల్చుకున్నాయి.  

రూ.23,000 కోట్లకు రూ.420 కోట్లు..
రష్యాకు చెందిన సిస్టెమా శ్యామ్‌ టెలీ సర్వీసెస్‌ కంపెనీ ఎంటీఎస్‌ బ్రాండ్‌తో 2010లో భారత్‌లో సీడీఎంఏ (కోడ్‌ డివిజన్‌ మల్టిపుల్‌ యాక్సెస్‌) సర్వీసులను ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా నెట్‌వర్క్‌ ఏర్పాటుకు దాదాపు రూ.22,750 కోట్లు (3.5 బిలియన్‌ డాలర్లు) ఖర్చుపెట్టింది.

తగిన కస్టమర్లు రాక... ఆశించిన వ్యాపారం జరక్క... ఇప్పుడిది అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌లో (ఆర్‌కామ్‌) విలీనం అవుతోంది. చాలావరకూ అనుమతులు ఇప్పటికే వచ్చాయి కూడా. దీని ప్రకారం.. 800 మెగాహెర్జ్‌ స్పెక్ట్రమ్‌తో సహా సిస్టెమా కార్యకలాపాలన్నీ ఆర్‌కామ్‌ చేతికి వెళ్తాయి. విలీనాంతరం సిస్టెమాకు ఆర్‌కామ్‌లో 10 శాతం వాటా వస్తుంది. ప్రస్తుత ఆర్‌కామ్‌ మార్కెట్‌ క్యాప్‌ ఆధారంగా చూస్తే ఈ వాటా విలువ కేవలం రూ.420 కోట్లు.

టెలినార్‌కు మిగిలిందేమీ లేదు..
నార్వేకు చెందిన టెలినార్‌ (ఒకప్పుడు యూనినార్‌) కూడా భారత్‌లో తన ఇన్వెస్ట్‌మెంట్లను కోల్పొయింది. ఇది తన ఇండియాలో దాదాపు రూ.19,515 కోట్లు (3 బిలియన్‌ డాలర్లు) ఇన్వెస్ట్‌ చేసింది. భాగస్వామి యూనినార్‌ చేతులెత్తేయటంతో కొన్నాళ్లు సొంతగానే వ్యాపారం చేసింది.

చివరికిది తన వ్యాపారాన్ని ఎయిర్‌టెల్‌కు విక్రయించింది. ఈ డీల్‌ ఇటీవలే పూర్తయ్యింది. ఇక్కడ టెలినార్‌కు ఎయిర్‌టెల్‌ నుంచి ఎలాంటి నగదు లభించలేదు. అయితే ఎయిర్‌టెల్‌.. టెలినార్‌కు చెందిన రూ.1,650 కోట్ల స్పెక్ట్రమ్‌ బకాయిలను చెల్లించడానికి అంగీకరించింది. టెలినార్‌ తన రుణ బాకాయిలను చెల్లించనుంది.

వొడాఫోన్‌ కష్టాలు..
యూకేకు చెందిన వొడాఫోన్‌కు కూడా గడ్డు పరిస్థితులనే ఎదుర్కొంటోంది. దీనికి ఐడియా సెల్యులర్‌కి మధ్య విలీనం ఒప్పందం కుదిరింది. విలీనాంతం ఏర్పడే కంపెనీ భారత్‌లోనే అతిపెద్ద టెలికం సంస్థగా ఆవిర్భవిస్తుంది. నిజానికి వొడాఫోన్‌ పదేళ్ల క్రితం హచిసన్‌–ఎస్సార్‌ వాటా కొనుగోలుకు 10.9 బి. డాలర్లను వెచ్చించింది.

ప్రస్తుత ఫారెక్స్‌ రేట్ల ప్రకారం దీని విలువ రూ.71,000 కోట్లు. 2007 నాటి ఫారెక్స్‌ రేట్ల ప్రకారం చూసినా ఇది రూ.47,000 కోట్లు. వొడాఫోన్‌ భారత్‌లో మొత్తంగా రూ.1,50,000 కోట్లు వెచ్చించినట్లు అంచనా. ఇక 2016లో మళ్లీ కొత్తగా రూ.47,700 కోట్లు పెట్టుబడులు పెట్టింది. ఇటీవల ఐడియాతో విలీనం సందర్భంగా వొడాఫోన్‌ ఎంటర్‌ప్రైజ్‌ విలువను దాదాపు రూ.82,800 కోట్లుగా లెక్కించారు. అంటే లక్ష కోట్లకుపైగా గాల్లో కలిసిపోయాయన్న మాట!!.

దిక్కు తోచని మాక్సిస్‌..
మాలేసియా కంపెనీ మాక్సిస్‌ మాత్రం ఇపుడు ఆయోమయంలో ఉంది. దీనికి ఎయిర్‌సెల్‌లో 74 శాతం వాటా ఉంది. భారత్‌లో ఇది ఇప్పటిదాకా దాదాపు రూ.47,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేసింది. ఈ సంస్థ సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం 2017 క్యూ1లో ఏకంగా 32 శాతానికి పైగానే తగ్గింది. దీనికి కారణం జియో. దీంతో ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ఆర్‌కామ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఆ ఒప్పందం రద్దయ్యింది. దీంతో మరిన్ని నిధుల కోసం ప్రయత్నిస్తోంది. కాగా రుణ భారాన్ని తగ్గించుకోవడానికి గతేడాది ఎయిర్‌టెల్‌తో స్పెక్ట్రమ్‌ డీల్‌ కుదుర్చుకుంది. దీని ద్వారా రూ.3,500 కోట్లు పొందింది. అయినా కూడా ఎయిర్‌సెల్‌కు రూ.15,500 కోట్లకుపైగా రుణ భారం ఉంది.


డొకొమోకు 1.3 బిలియన్‌ డాలర్లు నష్టం!!
టాటా డొకొమో గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. టాటా సన్స్, జపాన్‌కు చెందిన ఎన్‌టీటీ డొకొమో కలిసి 2008లో టాటా డొకొమో వెంచర్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. చౌక ధరలకే డేటా, కాలింగ్‌ సేవలను అందుబాటులోకి తెచ్చిన ఈ కంపెనీ.. స్వల్ప కాలంలోనే అధిక యూజర్లకు చేరువైంది.

కానీ తర్వాత నెట్‌వర్క్‌ కవరేజ్‌ లోపాలు, ఇష్టానుసార డిడక్షన్లు వల్ల డొకొమోపై ప్రతికూల ప్రభావం పడింది. జియో రాకతో పరిస్థితి మరింత దారణంగా మారింది. చేసేదేమీలేక ఎన్‌టీటీ డొకొమో తన వాటాను టాటా సన్స్‌కు విక్రయించింది.

ఈ వెంచర్‌లో ఎన్‌టీటీ డొకొమోకు 1.3 బిలియన్‌ డాలర్లు నష్టం వాటిల్లినట్లు అంచనా. ఇక టాటా టెలీ మొబైల్‌ వ్యాపారాన్ని దాదాపు ఉచితంగా ఎయిర్‌టెల్‌కు ఇచ్చేసేందుకు ఇటీవలే టాటాలు డీల్‌ కుదుర్చుకోవడం టెలికం సమస్యలకు అద్దంపడుతోంది.


4.5 లక్షల కోట్ల రుణ భారం
విదేశీ సంస్థలే కాదు. దేశీ టెలికం రంగం పరిస్థితులు కూడా అంత ఆశాజనంగా ఏమీ లేవు. టెలికం పరిశ్రమ రుణ భారం 4.5 లక్షల కోట్లుగా ఉంది. భారతీ ఎయిర్‌టెల్‌ సీఈవో గోపాల్‌ విట్టల్‌ కూడా ఇదే విషయాన్ని చెప్పారు.

అంటే మూలధనంపై రాబడి 1 శాతంగా ఉంది. కంపెనీలు వాటి డబ్బుల్ని భారత టెలికం రంగంలో ఇన్వెస్ట్‌ చేయడం కన్నా బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసుకోవడం ఉత్తమనేది మార్కెట్‌ విశ్లేషకుల మాట!!.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement