ముంబై: రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) మూడు చైనా బ్యాంకుల నుంచి 2012లో తీసుకున్న రుణాలకు తాను ఎటువంటి వ్యక్తిగత హామీ ఇవ్వలేదని పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ మరోసారి స్పష్టం చేశారు. అనిల్ అంబానీకి వ్యతిరేకంగా చైనా బ్యాంకులు బ్రిటన్ కోర్టును ఆశ్రయించగా.. వ్యక్తిగత హామీ ఇచ్చినందుకు చైనా బ్యాంకులకు 717 మిలియన్ డాలర్లు (సుమారు రూ.5వేల కోట్లకుపైగా) చెల్లించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఎస్‌బీఐ సైతం ఆర్‌కామ్ రుణానికి సంబంధించి వ్యక్తిగత హామీ ఇచ్చిన అనిల్ అంబానీ నుంచి రూ.1,200 కోట్లు వసూలు చేసుకునేందుకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను (ఎన్‌సీఎల్‌టీ) ఆశ్రయించింది. ఈ విషయాలపై రిలయన్స్ ఇన్‌ఫ్రా, రిలయన్స్ పవర్ కంపెనీల వాటాదారుల వార్షిక సమావేశంలో (ఆన్‌లైన్ ద్వారా నిర్వహించారు) అనిల్ అంబానీ స్పష్టతనిచ్చారు.
ఈ రెండు కేసుల్లోనూ (ఎస్‌బీఐ, చైనా బ్యాంకులు) రుణాలను గ్రూపు కంపెనీ (ఆర్‌కామ్, రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్) తీసుకున్నవే కానీ, తనకోసం కాదని అనిల్ పేర్కొన్నారు. చైనీ బ్యాంకులతో నాన్ బైండింగ్ లెటర్ ఆఫ్ కంఫర్ట్ కుదుర్చుకునేందుకు తాను పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చానే కానీ, హామీపై సంతకం చేయలేదని చెప్పారు. ఆర్‌కామ్ దివాలా కేసులో తుది ఫలితం ఆధారంగా చైనా బ్యాంకులకు ఎంత ఇచ్చేదీ తేలుతుందన్నారు.
వాటాలు పెంచుకుంటాం: గ్రూపు కంపెనీలు రిలయన్స్ ఇన్‌ఫ్రా, రిలయన్స్ పవర్‌లో ప్రమోటర్లు వాటాల పెంచుకోవాలని నిర్ణయించినట్టు అనిల్ అంబానీ వాటాదారులకు తెలిపారు. మార్చి నాటికి రిలయన్స్ పవర్‌లో ప్రమోటర్లు, ప్రమోటర్ల సంస్థలకు 19.29 శాతం వాటా ఉండగా, రిలయన్స్ ఇన్‌ఫ్రాలో 14.7 శాతం మిగిలి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment