అంబానీ బ్రదర్స్ మధ్య జియో చిచ్చు
న్యూఢిల్లీ: టెలికాం మార్కెట్లో ప్రకంపనలు రేపిన జియో అంబానీ బ్రదర్స్ మధ్య చిచ్చు పెట్టింది. జియో పై ఆర్‌కాం సంచలన ఆరోపణలు గుప్పింది. ముకేష్ అంబానీ గ్రూపునకు చెందిన రిలయన్స్ జియో ఫ్రీ ఆఫర్ల వల్లే పరిశ్రమ తీవ్ర నష్టాలపాలైందని, అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆరోపించింది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు, మార్కెట్ షేర్ పెంచుకునేందుకు జియో అనుసరించిన విధానాలపై సంచలన ఆరోపణలు చేసింది. దేశీయ టెలికాం కంపెనీల నష్టాలకు జియో అనుసరించిన ఫ్రీ ఆఫర్లు కొంతమేరకు ప్రభావం చూపించాయంటూ ఆర్‌కాం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఆరోపించింది.
అప్పుల ఊబిలో కూరుకుపోయి అష్టకష్టాలు పడుతున్న ఆర్‌కాం జియోపై పలు ఆరోపణలు గుప్పించింది. మార్కెట్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన జియో కారణంగానే టెలికాం కంపెనీలో భారీగా నష్టపోయాయని ఆర్‌కాం ఆరోపించింది. చరిత్రలో మొట్టమొదటిసారిగా టెలికాం ఆపరేటర్ల అప్పులు వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్ మించిపోయిందని పేర్కొంది. రుణ పెరుగుదల, రాబడి క్షీణించడం ఫలితంగా, టెలికాం కంపెనీల రుణ సేవల సామర్థ్యాలు ప్రతికూలంగా ప్రభావితమయ్యాయని తెలిపింది.