రైలు వస్తుండగా రెండు వైపుల నిలబడ్డ ఇతర గ్రామాల ప్రజలు
దేవరకద్ర: మండల కేంద్రంలోని రైల్వే గేటు మూసి వేయడంతో ప్రజలు తప్పని సరి పరిస్థితుల్లో రైల్వే పట్టాలను దాటుతున్నారు. ప్రమాదం అని తెలిిసినా ప్రభుత్వ కార్యాలయాలు, సంతలో సరుకులు కొనడానికి ఇతర గ్రామాల నుంచి వచ్చే ప్రజలు రైల్వే పట్టాలు దాటి పోక తప్పడం లేదు. కాగా ఏ మాత్రం అప్రమత్తంగా లేకున్నా.. వేగంగా వచ్చే రైళ్ల వల్ల ప్రమాదం పొంచిఉందని పలువురు పేర్కొంటున్నారు.
దేవరకద్రలో నిర్మించిన ఆర్వోబీ వల్ల రాయిచూర్, నారాయణపేట, మక్తల్, ఆత్మకూర్, మహబూబ్‌నగర్, హైదరబాద్ వంటి పట్టణాలకు నేరుగా వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది లేకుండా వెళ్తున్నారని.. కానీ పట్టణంలోని ప్రజలు, ఇతర గ్రామాల నుంచి దేవరకద్రకు వివిధ పనుల నిమిత్తం వచ్చిన వారు, బుధవారం జరిగే సంతకు చుట్టు పక్కల నుంచి వచ్చే 40 గ్రామాల ప్రజలు గేటు మూయడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముందు ఆలోచన లేకుండా తొందరపాటు నిర్ణయాల వల్ల పట్టణ ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలు నిత్యం ఇలా రైల్వే పట్టాలను దాటాల్సిన పరిస్థితి నెలకొందని అంటున్నారు. వృద్ధులు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులకూ ఇబ్బంది తప్పడం లేదని చెబుతున్నారు.
గేటు తెరిస్తే బస్టాండ్ కళకళలాడుతుంది
రైల్వే గేటు తెరిస్తే దేవరకద్ర బస్టాండ్ తిరిగి కళ కళలాడే అవకాశం ఉంది. బస్సుల రాక పోకలతో పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ ప్రాంతంలోని వ్యాపార కేంద్రాలన్ని తిరిగి పుంజుకునే అవకాశం ఉంది.
ఇప్పటికే నిరాశతో ఉన్న వ్యాపారులు తమ వ్యాపారం తిరిగి కొనసాగించుకోడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక గేటును తెరిచిన పెద్దగా ట్రాఫిక్ సమస్య ఉండదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఈ విషయంలో స్పందించి గేటు తెరిచేలా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment