ఆర్‌కామ్, ఎయిర్‌సెల్ విలీనం! | RCom, Aircel in Talks to Merge India Wireless Business | Sakshi
Sakshi News home page

ఆర్‌కామ్, ఎయిర్‌సెల్ విలీనం!

Published Wed, Dec 23 2015 2:48 AM | Last Updated on Tue, Jun 4 2019 6:47 PM

ఆర్‌కామ్, ఎయిర్‌సెల్ విలీనం! - Sakshi

ఆర్‌కామ్, ఎయిర్‌సెల్ విలీనం!

మొబైల్ వ్యాపారాల విలీనానికి ఇరు కంపెనీల చర్చలు
ఎంటీఎస్‌ను విలీనం చేసుకోనున్నట్లు ఇప్పటికే చెప్పిన ఆర్‌కామ్
మూడింటినీ కలిపి కొత్త సంస్థను ఏర్పాటు చేసే యోచన...
20 కోట్ల యూజర్లతో రెండో అతిపెద్ద  టెలికం సంస్థగా ఆవిర్భవించే అవకాశం..
 
 న్యూఢిల్లీ:
దేశీ టెలికం రంగంలో మరో భారీ విలీనానికి రంగం సిద్ధమవుతోంది. అనిల్ అంబానీ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్), ఎయిర్‌సెల్‌తో విలీనం దిశగా అడుగులు పడుతున్నాయి. రెండు కంపెనీల మొబైల్/వైర్‌లెస్ వ్యాపారాలను విలీనం చేయడానికి ఎయిర్‌సెల్ వాటాదారులతో చర్చలు జరుపుతున్నట్లు ఆర్‌కామ్ మంగళవారం ప్రకటించింది. ప్రతిపాదిత విలీనానికి సంబంధించిన చర్చల కోసం ఎయిర్‌సెల్ మెజారిటీ వాటాదారు అయిన మాక్సిస్ కమ్యూనికేషన్స్ బెర్హార్డ్ (ఎంసీబీ), మరో వాటాదారు సిండ్యా సెక్యూరిటీస్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లతో 90 రోజుల ప్రత్యేక గడువు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు కూడా ఆర్‌కామ్ తెలియజేసింది.
 
 సిస్టెమా శ్యామ్ కూడా...
 ఎంటీఎస్ బ్రాండ్‌తో దేశీయంగా టెలికం సేవలు అందిస్తున్న సిస్టెమా శ్యామ్ టెలీ సర్వీసెస్ భారతీయ వ్యాపారాన్ని విలీనం చేసుకునే ప్రక్రియలో ఆర్‌కామ్ నిమగ్నమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్‌కామ్, ఎంటీఎస్, ఎయిర్‌సెల్.. మూడు సంస్థల మొబైల్ వ్యాపార కార్యకలాపాలనూ కలిపి ఆర్‌కామ్ నేతృత్వంలో ఒక కొత్త సంస్థను ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈక్విటీ డీల్ రూపంలో ఈ విలీన సంస్థను నెలకొల్పనున్నారని... ఆర్‌కామ్ వాటాదారులు తమ వద్దనున్న ఒక్కో షేరుకి కొత్తగా ఆవిర్భవించే సంస్థలో మూడు షేర్లను ఆశిస్తున్నట్లు కూడా ఆయా వర్గాల సమాచారం.
 
  టవర్ల విభాగం అమ్మకం తర్వాత ఆర్‌కామ్ మొత్తం రుణ భారం రూ.10 వేల కోట్ల దిగువకు చేరుతుందని అంచనా. కొత్తగా ఏర్పాటయ్యే సంస్థకు ఈ రుణాన్ని బదలాయించడం ద్వారా రుణ రహిత సంస్థగా మారాలనేది ఆర్‌కామ్ ప్రణాళికగా విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అనుకున్నట్లు జరిగితే ఆర్‌కామ్, ఎయిర్‌సెల్, ఎంటీఎస్‌ల వైర్‌లెస్ వ్యాపారాలను కలపడం ద్వారా ఆవిర్భవించే కొత్త సంస్థ బ్రాండ్ ఇతర వివరాలు కొద్ది రోజుల్లో ఖరారయ్యే అవకాశాలున్నాయి. వైర్‌లెస్ వ్యాపారాన్ని కొత్త సంస్థకు బదలాయించాక ఆర్‌కామ్ మున్ముందు పూర్తిగా ఎంటర్‌ప్రైజ్ వ్యాపారంపైనే పూర్తిగా దృష్టిపెట్టాలని భావిస్తున్నట్లు ఆ వర్గాలు తెలియజేశాయి.
 
 అతిపెద్ద స్పెక్ట్రం వాటా...
 ఈ మూడు కంపెనీల మొబైల్ వ్యాపారాన్ని విలీనం చేసి కొత్త సంస్థను ఏర్పాటు చేస్తే... మొత్తం దేశీ టెలికం పరిశ్రమకు కేటాయించిన స్పెక్ట్రంలో 19.3% ఈ కొత్త సంస్థ గుప్పిట్లోకి వస్తుంది. అప్పుడు దేశంలో అత్యధిక స్పెక్ట్రం వాటా కలిగిన సంస్థ ఇదే అవుతుంది. 2జీ, 3జీ, 4జీ సర్వీసులన్నింటిలోనూ (అన్ని బ్యాండ్‌విడ్త్‌లూ) ఈ ప్రతిపాదిత కొత్త సంస్థకు స్పెక్ట్రం ఉంటుంది.
 
  కాగా, నిర్వహణ వ్యయాలు, మూలధన పెట్టుబడుల విషయంలో మెరుగైన సమన్వయంతో పాటు ఆదాయాలను పెంచుకునేందుకు కూడా ఈ విలీనం ఉపకరిస్తుందని ఆర్‌కామ్ పేర్కొంది. ఈ ప్రతిపాదనలు ఇంకా చర్చల స్థాయిలోనే(నాన్-బైండింగ్) ఉన్నాయని.. పూర్తిస్థాయి మదింపు, నియంత్రణ సంస్థల అనుమతి, వాటాదారులు, సంబంధిత పక్షాల(థర్డ్‌పార్టీ) ఆమోదాలకు లోబడే విలీన లావాదేవీ జరుగుతుందని తెలిపింది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చే విషయాన్ని కచ్చితంగా చెప్పలేమని కూడా ఆర్‌కామ్ పేర్కొంది. విలీన వార్తల నేపథ్యంలో ఆర్‌కామ్ షేరు ధర మంగళవారం బీఎస్‌ఈలో 2.39 శాతం లాభపడి రూ.85.70 వద్ద ముగిసింది. ఒకానొక దశలో రూ.87.10 గరిష్టాన్ని కూడా తాకింది.
 
 నంబర్ 2 టెల్కోగా..
 ఈ డీల్ పూర్తయితే దేశంలో రెండో అతిపెద్ద టెలికం ఆపరేటర్‌గా నిలిచే అవకాశం ఉంది. తాజా విలీనం ప్రతిపాదన కార్యరూపం దాల్చితే యూజర్ల సంఖ్యాపరంగా దేశంలో రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ ఆపరేటర్‌గా కొత్త సంస్థ ఆవిర్భవిస్తుంది. ప్రస్తుతం ఆర్‌కామ్ 11 కోట్ల మంది యూజర్లతో దేశంలో నాలుగో అతిపెద్ద టెల్కోగా నిలుస్తోంది. ఎయిర్‌సెల్ 8.4 కోట్ల మంది సబ్‌స్క్రయిబర్లతో అయిదో స్థానంలో ఉంది. ఇక ఆర్‌కామ్ విలీనం చేసుకోనున్నట్లు ప్రకటించిన సిస్టెమా శ్యామ్‌కు భారత్‌లో 83.6 లక్షల మంది యూజర్లు ఉన్నారు. ఈ మూడూ కలిస్తే కొత్తగా ఏర్పాటయ్యే సంస్థ యూజర్లు దాదాపు 20 కోట్లకు చేరుతారు.
 
 టవర్ల వ్యాపారానికి సంబంధం లేదు..
 ఆర్‌కామ్ మొబైల్ టవర్లు, ఆప్టికల్ ఫైబర్ మౌలిక సదుపాయాలకు ఈ ప్రతిపాదిత విలీనంతో సంబంధం లేదని కంపెనీ తెలియజేసింది. టవర్ల విభాగాన్ని విక్రయిస్తున్నట్లు ఈ నెల 4న ఆర్‌కామ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రైవేటు ఈక్విటీ సంస్థలు తిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్, టీపీజీ ఆసియా ఇంక్‌లతో నాన్-బైండింగ్ ఒప్పందంపై ఆర్‌కామ్ సంతకాలు కూడా చేసింది. ఈ డీల్ విలువ దాదాపు రూ.30 వేల కోట్లుగా అంచనా. దీని ద్వారా వచ్చే మొత్తాన్ని రుణ భారం తగ్గించుకోవడం కోసం ఆర్‌కామ్ ఉపయోగించుకోనుంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement