న్యూఢిల్లీ: ఎరిక్సన్‌కు చెల్లించాల్సిన బకాయిల కేసులో రిలయన్స్ గ్రూప్ చైర్మన్, వ్యాపారవేత్త అనిల్ అంబానీపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎరిక్సన్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసులో బుధవారం తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు... రూ.550 కోట్ల బకాయి చెల్లించకుండా తన ఉత్తర్వులను ఉల్లంఘించారని, ఇది పూర్తిగా ధిక్కరణ కిందకే వస్తుందని స్పష్టం చేసింది. నాలుగు వారాల్లో రూ.453 కోట్లు కనక ఎరిక్సన్‌కు చెల్లించకపోతే మూడు నెలల జైలు శిక్ష తప్పదని స్పష్టం చేసింది. ఈ కేసులో ఆర్‌కామ్ చైర్మన్ అనిల్‌తో పాటు రిలయన్స్ టెలికం చైర్మన్ సతీశ్ సేథ్, రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ చైర్‌పర్సన్ చిరహా విరాణికి కూడా సుప్రీంకోర్టు ఇదే హెచ్చరికలు చేసింది. తన మునుపటి ఉత్తర్వులకు సంబంధించి ఇచ్చిన హామీలను వీరు నిలబెట్టుకోలేదని, తద్వారా ముగ్గురూ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ‘‘ఉద్దేశపూర్వకంగానే వీరు ఎరిక్సన్‌కు నిధులివ్వలేదని భావించాల్సి వస్తోంది’’ అని సుప్రీం పేర్కొంది. ధర్మాసనం ఈ హెచ్చరిక చేస్తున్న సమయంలో అనిల్ అంబానీ సహా ముగ్గురూ కోర్టు హాల్లోనే ఉన్నారు. అనిల్ తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ముకుల్ రోహత్గీ తమ వాదనలు వినిపించారు. రూ.453 కోట్లు చెల్లించడం ద్వారా ‘కోర్టు ధిక్కరణ’ వేటు నుంచి తప్పుకోగలుగుతారని న్యాయమూర్తులు ఎఫ్‌ఎఫ్ నారిమన్, వినీత్ సరన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టంచేసింది. రిలయన్స్ ఎటువంటింటి బేషరతు క్షమాపణలు చెప్పినా, దాన్ని ఆమోదించాల్సిన పనిలేదని కూడా సుప్రీం కోర్టు పేర్కొంది.
కోటి డిపాజిట్ చేయకపోతే మరో నెల జైలు
ఆర్‌కామ్, రిలయన్స్ టెలికమ్యూనికేషన్, రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ రూ.కోటి చొప్పున 4 వారాల్లో రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాలని కూడా ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. లేదంటే ఈ కంపెనీల చైర్ పర్సన్‌లు మరో నెల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించింది. కాగా అత్యున్నత న్యాయస్థానం రిజిస్ట్రీ వద్ద రిలయన్స్ గ్రూప్ డిపాజిట్ చేసిన రూ.118 కోట్లను వారం రోజుల్లో ఎరిక్సన్‌కు పంపిణీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘‘రూ.550 కోట్లు ఎరిక్సన్‌కు చెల్లించడానికి మూడు రిలయన్స్ కంపెనీలకూ 120 రోజుల గడువిచ్చాం. తర్వాత దీనిని మరో 60 రోజులూ పొడిగించాం. అయినా దీనిని కంపెనీలు పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పుడు వచ్చి రూ.118 కోట్లు చెల్లిస్తామనడం సరికాదు. బకాయి మొత్తం కట్టాల్సిందే.’’ అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు న్యాయపాలనకు అడ్డంకులని పేర్కొంది.
సుప్రీం ఉత్తర్వుల్ని గౌరవిస్తాం: రోహత్గీ
అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువడిన కొద్ది నిమిషాల తరువాత అనిల్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ విలేకరులతో మాట్లాడుతూ, ‘‘అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులపట్ల గౌరవం ఉంది. ఎరిక్సన్‌కు బకాయిలపై సుప్రీంకోర్టు ఉత్తర్వులను గ్రూప్ పాటిస్తుందన్న విశ్వాసం ఉంది. బకాయిల చెల్లింపుల విషయంలో ఇబ్బందులున్నా, ఉన్నత న్యాయస్థానం తన ఆదేశాలను తాను ఇచ్చింది’’ అని అన్నారు.
జియోతో ఒప్పందం వైఫల్యంవల్లే: అనిల్
తనకు రావాల్సిన డబ్బుపై ఎరిక్సన్ తీవ్ర విమర్శలే చేసింది. రిలయన్స్ గ్రూప్‌కు రఫేల్ జెట్ డీల్‌లో పెట్టుబడి పెట్టడానికి డబ్బు ఉందికానీ, తన రూ.550 కోట్ల బకాయి తీర్చడానికి మాత్రం లేదని విమర్శించింది. అయితే అనిల్ గ్రూప్ దీనిని తీవ్రంగా ఖండించింది. తన సోదరుడు ముకేశ్ అంబానీ నియంత్రణలోని రిలయన్స్ జియోతో తన ఆస్తుల విక్రయ ఒప్పందం విఫలమైందని, తన కంపెనీ దివాలా ప్రొసీడింగ్స్‌లోకి వెళ్లాల్సి వచ్చిందని ఆయన ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. ఎరిక్‌సన్‌కు బకాయిలు చెల్లిండానికి చేయాల్సిందంతా చేసినా, ఫలితం రాలేదని తెలిపారు.
గ్రూప్ షేర్ల పతనం
తాజా పరిణామంతో రిలయన్స్ గ్రూప్ షేర్లు భారీగా నష్టపోయాయి. రిలయన్స్ కమ్యూనికేషన్: రూ.5.45– రూ.6.15 కనిష్ట, గరిష్ట స్థాయిల్లో తిరిగిన ఈ షేర్ ధర చివరకు 4.17 శాతం (0.25పైసలు) నష్టపోయి రూ.5.75 వద్ద ముగిసింది. రిలయన్స్ క్యాపిటల్: రూ.135.10–రూ.152.50 మధ్య తిరిగిన ఈ షేర్ ధర చివరకు 4.30 శాతం నష్టంతో చివరకు 144.95 వద్ద ముగిసింది. నష్టపోయిన ఇతర షేర్లను చూస్తే, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ (4.07 శాతం), రిలయన్స్ నావెల్ అండ్ ఇంజనీరింగ్ (2.34 శాతం), రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (2.29 శాతం), రిలయన్స్ పవర్ (0.92 శాతం) ఉన్నాయి. ఈ స్టాక్స్ ఇంట్రాడే ట్రేడింగ్‌లో 10.3 శాతం వరకూ కూడా పడటం గమనార్హం.
కేసు క్రమం ఇదీ...
►ఆర్‌కామ్ దేశవ్యాప్త టెలికం నెట్‌వర్క్ నిర్వహణకు అనిల్ గ్రూప్‌తో 2014లో ఎరిక్సన్ ఇండియా ఏడేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. రూ.1,500 కోట్లకుపైగా బకాయిలు చెల్లించలేదని ఆరోపించింది.
► రూ.47,000 కోట్లకుపైగా రుణ భారంలో కూరుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్, తనకు బకాయిలు చెల్లించలేకపోవడంతో, ఎరిక్సన్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)లో దివాలా పిటిషన్ దాఖలు చేసింది. గత ఏడాది మే నెలలో ఈ పిటిషన్‌ను ట్రిబ్యునల్ అడ్మిట్ చేసుకుంది.
► అయితే ఈ కేసును ఆర్‌కామ్ సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుంది. ఇందుకు వీలుగా రూ.550 కోట్లు చెల్లిస్తానని హామీ ఇచ్చింది. 2018 సెప్టెంబర్ 30 లోపు ఈ చెల్లింపులు జరుపుతామని పేర్కొంది.
► ఈ హామీకి కట్టుబడకపోవడంతో ఎరిక్సన్ సెప్టెంబర్‌లో సుప్రీంను ఆశ్రయించింది.
► ఎరిక్సన్‌కు చెల్లించాల్సిన బకాయిలపై గతేడాది అక్టోబర్ 23న ఆర్‌కామ్‌కు అత్యున్నత న్యాయస్థానం చివరి అవకాశం ఇచ్చింది. డిసెంబర్ 15లోపు బకాయిలు మొత్తం చెల్లించాలని ఆదేశించింది. జాప్యం జరిగితే ఇందుకు సంబంధించి మొత్తంపై 12 శాతం వార్షిక వడ్డీ చెల్లించాలని స్పష్టం చేసింది.
►డిసెంబర్ 15లోపు ఆర్‌కామ్ బకాయిలు చెల్లించలేకపోతే, ఎరిక్సన్ కోర్టు ధిక్కరణ కేసు ప్రొసీడింగ్స్‌ను ప్రారంభించవచ్చని సూచించింది.
►అయితే ఆ లోపూ బకాయిలు చెల్లించలేకపోవడంతో జనవరి 4న ఎరిక్సన్ మళ్లీ సుప్రీం కోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది.
► దీనిపై బుధవారం సుప్రీం కోర్టు తన తీర్పును ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment