జియో, ఆర్‌కామ్‌ ఒప్పంద గడువు పొడిగింపు  | RCom, Reliance Jio Extend Validity Of Asset Sale Pact To June 28 | Sakshi
Sakshi News home page

జియో, ఆర్‌కామ్‌ ఒప్పంద గడువు పొడిగింపు 

Published Tue, Jan 1 2019 1:45 AM | Last Updated on Tue, Jan 1 2019 1:45 AM

 RCom, Reliance Jio Extend Validity Of Asset Sale Pact To June 28 - Sakshi

న్యూఢిల్లీ: వైర్‌లెస్‌ ఆస్తుల విక్రయానికి సంబంధించి కుదుర్చుకున్న ఒప్పందం గడువును పొడిగించుకుంటున్నట్లు ఆర్‌కామ్, జియో ప్రకటించాయి. ఆర్‌కామ్‌కు చెందిన స్పెక్ట్రం డీల్‌కు టెలికం శాఖ నుంచి అనుమతులు రాని నేపథ్యంలో ఈ డీల్‌ను పొడిగించుకోవాలని ఇరు కంపెనీలు నిర్ణయించుకున్నాయి. ‘‘రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌తో కుదుర్చుకున్న ఆస్తుల కొనుగోలు ఒప్పంద కాలపరిమితిని 2019 జూన్‌ 28 వరకు ఆర్‌జియో  పొడిగించుకుంది’’అని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సోమవారం ప్రకటించింది. ప్రభుత్వపరమైన అన్ని రకాల అనుమతులు, ఆమోదాలు, రుణదాతల అంగీకారం పొంది సదరు ఆస్తులపై ఉన్న చిక్కులన్నీ తీరాకే కొనుగోలు జరుగుతుందని తెలిపింది. టవర్లు, ఫైబర్, ఎంసీఎన్, స్పెక్ట్రమ్‌ విక్రయానికి సంబంధించి ఆర్‌జియోతో కుదుర్చుకున్న ఒప్పంద కాలపరిమితిని పొడిగించుకున్నట్లు ఆర్‌కామ్‌ సైతం విడిగా ప్రకటించింది.

పలు సందేహాల నేపథ్యం...
జియోకు స్పెక్ట్రం విక్రయానికి సంబంధించి తమకు నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ను జారీ చేయాలని ఆర్‌కామ్‌ చాలా రోజులుగా టెలికం శాఖను అభ్యర్థిస్తూ వస్తోంది. కానీ ఇరు కంపెనీల మధ్య ఈ డీల్‌కు సంబంధించిన చెల్లింపులపై టెలికం శాఖ పలు సందేహాలు వ్యక్తం చేస్తోంది. వీటిపై సమాధానమిచ్చేందుకు ఆర్‌జియో, ఆర్‌కామ్‌ ప్రతినిధులు ఈ నెలలో టెలికం సెక్రటరీతో సమావేశమయ్యారు. ఈ విషయంలో బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలన్న టెలికం శాఖ డిమాండ్‌ను టెలికం ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు తిరస్కరించినట్లు ఆర్‌కామ్‌ గుర్తు చేసింది. బ్యాంకు గ్యారెంటీ బదులు తమ అనుబంధ సంస్థ ఆర్‌రియల్టీ ద్వారా అవసరమైన కార్పొరేట్‌ గ్యారెంటీ ఇస్తామని తెలిపింది. అందువల్ల ఇక అభ్యంతరాలకు ఎలాంటి అవకాశం లేదని ఆర్‌కామ్‌ పేర్కొంది. టెలికం శాఖ మాత్రం డీల్‌కు ఆమోదముద్ర వేసేందుకు ఇంకా అంగీకరించలేదు. ముఖ్యంగా చెల్లింపుల బకాయిలు, ఇతర చార్జీలపై ఇంకా స్పష్టత రావాలని టెలికం శాఖ భావిస్తోంది. ముఖ్యంగా డీల్‌కు సంబంధించి ఆర్‌కామ్‌కు ఎలాంటి గ్యారెంటీ కూడా ఇవ్వటానికి జియో అంగీకరించలేదు. అందుకని టెలికం శాఖ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. దీంతో ఇరు కంపెనీలు ఒప్పంద కాలపరిమితిని పొడిగించుకున్నాయి.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement