మొబైల్ యూజర్లకు మెగా ఆఫర్!
- రూ. 93కు 10 జీబీ 4జీ డాటా
- రిలియన్స్ కమ్యూనికేషన్ ప్రటకన
- నిర్ణీత సర్కిళ్లలో ఈ వారం నుంచి అమలు
ప్రముఖ టెలికం ఆపరేటర్ రిలయన్స్ కమ్యూనికేషన్ తన వినియోగదారులకు భారీ ఆఫర్ ఇవ్వబోతున్నది. రిలయన్స్ జియో నెట్‌వర్క్ ఉపయోగించే సీడీఎంఏ వినియోగదారులకు ఈ వారం నుంచి రూ. 93కే 10 జీబీ 4జీ డాటా అందివనున్నట్టు తెలిపింది. కొన్ని ఎంపికచేసిన సర్కిళ్లలో ఈ ధరకు 4జీ డాటాను ఇవ్వనున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం చాలా మొబైల్ ఆపరేటర్లు, ఇంటర్‌నెట్ ఆపరేటర్లు ఇస్తున్న బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ కన్నా ఇది ఎంతో తక్కువ కావడం గమనార్హం.
‘వచ్చేవారం నుంచి తన సీడీఎంఏ వినియోగదారుల కోసం రిలయన్స్ జీయో ఇన్ఫోకామ్ 4జీ నెట్‌వర్క్‌ను వినియోగించబోతున్నట్టు ఆర్ కామ్ కేంద్ర టెలికం డిపార్ట్‌మెంట్ (డీవోటీ)కు తెలియజేసింది. సీడీఎంఏ వినియోగదారులు 4జీకి అప్‌గ్రేడ్ చేయించుకుంటే వారికి ఈ సేవలు లభించనున్నాయి’ అని విశ్వసనీయ వర్గాలు మీడియాకు తెలిపాయి.
ఆర్‌కామ్‌కు 80 లక్షలమంది సీడీఎంఏ వినియోగదారులు ఉండగా, అందులో 90శాతం 4జీ సేవలను అప్‌గ్రేడ్ చేసుకోవడానికి అంగీకరించారని డీవోటీ అందిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. పోటీ మొబైల్ ఆపరేటర్ల కన్నా చాలా తక్కువ ధరకు ఆర్ కామ్ తన వినియోగదారులకు 4జీ ఆఫర్ అందిస్తుండటం గమనార్హం. కేవలం రూ. 93 10 జీబీ 4జీ డాటాను ఇవ్వబోతుండటం పోటీ ఆపరేటర్ల కన్నా 90 శాతం తక్కువ ధరకు ఇచ్చినట్టు అవుతుందని పరిశీలకులు చెప్తున్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లోని ఈస్ట్, వెస్ట్ ప్రాంతాలు, ఒడిశా, మధ్యప్రదేశ్, బిహార్ తదితర 12 సర్కిళ్లలో 4జీ లాంచ్ కానుంది. ఈ సర్కిళ్లలో ఈ ఆఫర్ ను ఆర్ కామ్ వినియోగదారులకు అందివ్వబోతున్నది.