అనిల్ అంబానీ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (అడాగ్) ఛైర్మన్ అనిల్ అంబానీ కీలక ప్రకటన చేశారు. అప్పులు చెల్లించడానికి తాము పూర్తిగా కట్టుబడి వున్నామని ప్రకటించారు. మంగళవారం ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో అనిల్ అంబానీ ఈ మేరకు హామీ ఇచ్చారు. 2018 ఏప్రిల్ మరియు మే 2019 మధ్య కాలంలో ఇప్పటికే వడ్డీ సహా రూ. 35వేల కోట్ల రూపాయల రుణాలను తిరిగి చెల్లించామని పేర్కొన్నారు. ఆస్తులు విక్రయం, తనఖా ద్వారా ఈ అప్పులను తీర్చినట్టు తెలిపారు. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి తమకు ఎటువంటి సహాయం అందలేదని స్పష్టం చేశారు. ఆర్థికపరమైన సవాళ్లు, ఇబ్బందులు ఎన్ని ఉన్నా రుణాలను పూర్తిగా తీర్చడానికి కట్టుబడి వున్నామన్నారు. ఈ పక్రియ వివిధ దశల్లో ఇప్పటికే అమల్లో ఉందని చెప్పారు. ఈ క్రమంలో రిలయన్స్ గ్రూపునకు చెందిన వాటాదారులు, ఉద్యోగుల పూర్తి మద్దతు తమకు లభిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
2014 నాటి ఆర్‌కాం- ఎరిక్సన్ ఇండియా డీల్‌కు సంబంధించి అనిల్ అంబానీకి చెందిన ఆర్‌కాం 1,500 కోట్ల రూపాయల నగదు చెల్లించలేదని నేషనల్ కంపెనీ లా అప్పెల్లేట్ ట్రిబ్యునల్ ముందు ఎరిక్సన్ ఫిర్యాదు చేసింది. డిసెంబర్ 15 లోగా ఎరిక్సన్ అప్పులు తీర్చివేయాలని లేదంటే, 12 శాతం వడ్డీతో మొత్తం చెల్లించాల్సి వుంటుందని గత ఏడాది అక్టోబర్‌లో ఆర్‌కాంను సుప్రీం ఆదేశించింది. ఈ నేపథ్యంలో రూ.25వేల కోట్ల విలువైన ఆస్తులు (స్పెక్ట్రమ్, ఫైబర్, టెలికాం టవర్లు, కొన్ని రియల్ ఎస్టేట్) విక్రయానికి అనుమతిని మంజూరు చేసింది. అయినా ఈ చెల్లింపుల్లో సంస్థ పదే పదే విఫలం కావడంతో కోర్టు ధిక్కరణ, జరిమానాను కూడా ఎదర్కోవాల్సి వచ్చింది. దీంతో 453 కోట్ల రూపాయలను తక్షణమే ఎరిక్సన్‌కు చెల్లించాలని సుప్రీంకోర్టు గత నెలలో ఆదేశించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment