adag
-
అడాగ్ షేర్ల ర్యాలీ పట్ల అప్రమత్తంగా ఉండండి
అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని అడాగ్ షేర్లు చాలాకాలం తర్వాత చర్చనీయాంశంగా మారాయి. మార్చి కనిష్టం నుంచి అనేక రెట్లు లాభపడంతో దలాల్ స్ట్రీట్‌లో ఇప్పుడు ఈ షేర్ల గురించే మాట్లాడుకుంటున్నారు. రిలయన్స్ పవర్ షేరు మార్చి 25 నుంచి జూలై1 మధ్యకాలంలో 357శాతం లాభపడింది. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 349శాతం, రిలయన్స్ క్యాపిటల్ షేర్లు 243 శాతం ర్యాలీ చేశాయి. ఇదే సమయంలో బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లో సెన్సెక్స్ మాత్రమే 35శాతం పెరిగింది. ర్యాలీలో సత్తా లేదు: మార్చి కనిష్టాల నుంచి అడాగ్ షేర్లు చేసిన ర్యాలీలో సత్తాలేదని మార్కెట్ నిపుణులు అంటున్నారు. అడాగ్ షేర్లు నిస్సందేహంగా ర్యాలీ చేశాయని, అయితే గడిచిన 10ఏళ్లలో ఈ షేర్ల నాశనం చేసిన 98శాతం సంపద విధ్వంసంతో తాజా ర్యాలీని సరిపోల్చడం మూర్ఖత్వం అవుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అడాగ్ షేర్లపై ఇప్పటికే పలు బ్రోకరేజ్‌లు, రేటింగ్ సంస్థలు ‘‘బేరిష్’’ రేటింగ్‌ను కేటాయించాయి. మార్కెట్ ర్యాలీలో భాగంగా ఈ షేర్లలో మూమెంట్ ఉన్నప్పటికీ.., వీటికీ దూరంగా ఉండటం మంచిదని సలహానిస్తున్నాయి. ‘‘ మా ఫండమెంటల్ ప్రమాణాలను అందుకోలేకపోవడంతో అడాగ్ షేర్లపై మాకు ఎలాంటి అభిప్రాయం లేదు. అయినప్పటికీ, రిటైల్ ఇన్వెస్టర్లు అనేక పెన్నీ స్టాక్లను కొనుగోలు చేస్తున్నారని మేము నమ్ముతున్నాము. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఇన్వెస్టర్లు ఇలాంటి తప్పులు చేసిన మంచి పాఠాలు నేర్చుకుంటారు.’’ అని ఈక్వినామిక్స్ రీసెర్చ్ అండ్ అడ్వైజరీ జీ.చొక్కా లింగం అభిప్రాయపడ్డారు. ఇటీవల అడాగ్ కంపెనీల్లో జరిగిన కొన్ని కార్పోరేట్ పరిణామాలు ఇన్వెసర్లను దృష్టిని ఆకర్షించాయి. ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ సంపూర్ణ రుణ రహిత కంపెనీగా మారుతుందని కంపెనీ ఛైర్మన్ అనిల్ అంబానీ పేర్కోన్నారు. ఈ కంపెనీకి సుమారు రూ.6వేల పైగా అప్పు ఉంది. ఈ రుణాన్ని తీర్చేందుకు కంపెనీ ఆస్తులను విక్రయప్రకియను మొదలుపెట్టింది. పెన్నీస్టాకులకు దూరంగా ఉండండి: తక్కువ ధరల్లో లభ్యమయ్యే పెన్నీ స్టాకులకు దూరంగా ఉండటం మంచదని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అడాగ్ షేర్లు మాత్రమే కాకుండా బిర్లా టైర్స్, ఆప్టో సర్కూ్యట్స్, అలోక్ ఇండస్ట్రీస్, రుచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, జేఎంటీ అటో, అల్కేమిస్ట్, సింటెక్స్ ప్లాస్టిక్స్, ఆంధ్రా సిమెంట్స్, ఎమ్కోతో సుమారు 178 పెన్నీ స్టాకులు మార్చి కనిష్టం నుంచి 100శాతం నుంచి 1700శాతం ర్యాలీ చేశాయి. గత 7-8 ఏళ్లలో 1,000 కి పైగా షేర్లు స్టాక్స్ మార్కెట్ నుంచి వైదొలిగాయి. వాటిలో ఎక్కువ భాగం పెన్నీ స్టాక్స్ కావడం విశేషం. గడచిన ఆరేళ్లలో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు పెన్సీ స్టాక్‌ల ద్వారా రూ.1.5 - రూ.2లక్షల కోట్లను నష్టపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మార్కెట్లో బలమైన లిక్విడిటీ ఉన్న కారణంగా చాలా పెన్నీ స్టాక్ పెరిగాయి. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఇన్వెస్టర్లు ఎలాంటి ఫండమెంట్లను పట్టించుకోకుండా తక్కువ ధరలో లభ్యమయ్యే షేర్లను కొనుగోలు చేస్తున్నాయి. వారిని రాబిన్‌హుడ్ ఇన్వెసర్లు అని పిలవచ్చు. అడాగ్‌తో సహా అంలాంటి కౌంటర్లలో కొనుగోలు జరపకపోవడం మంచింది.’’ అని సామ్కో సెక్యూరిటీస్ హెడ్ ఉమేష్ మెహతా తెలిపారు. -
ఓ అసమర్ధుడి వ్యాపార యాత్ర...
న్యూఢిల్లీ: ఓడలు బళ్లు అవుతాయన్న సామెత... అడాగ్ గ్రూపునకు అతికినట్టు సరిపోతుంది. ఎందుకంటే 2008లో అడాగ్ గ్రూపు చైర్మన్ అనిల్ అంబానీ గ్రూపు విలువ 42 బిలియన్ డాలర్లు. అంటే సుమారు రూ.2.9 లక్షల కోట్లు. అప్పుడు ప్రపంచంలో అత్యంత సంపద కలిగిన వారిలో అనిల్‌ది 6వ స్థానం. కానీ ఆ తరువాతి 11 ఏళ్లలో అనిల్ అంబానీ ఎన్నెన్నో నిర్ణయాలు తీసుకున్నారు. ఉన్న కంపెనీల నుంచే కొత్త కంపెనీలను సృష్టించారు. విలువ పెంచుతానంటూ రకరకాల వ్యాపారాల్లోకి వచ్చారు. పెరగటం మాట అటుంచి... ఆయన గ్రూపు విలువ అత్యంత దారుణ స్థాయికి పడిపోయి రూ.5,000 కోట్లకు పరిమితమయ్యింది. గడిచిన ఏడాదిన్నరగా అడాగ్ గ్రూపు షేర్లు పతనమవుతూనే ఉన్నాయి. సోమవారం ముగింపు ధరలతో చూసినపుడు అడాగ్ గ్రూపు మార్కెట్ విలువ రూ.6,196 కోట్లు. అయితే మంగళవారం సైతం గ్రూపు కంపెనీల షేర్లు భారీగా 10 నుంచి 20 శాతం మధ్య నష్టపోయాయి. ఈ ప్రకారం ఆయన సంపద రూ.5,000 కోట్లకు దిగినట్టు భావించాలి. దీనికితోడు ప్రమోటర్లు తమ వాటాల్లో అత్యధిక భాగాన్ని తనఖా పెట్టి రుణాలు తీసుకున్నారు. షేర్లు ప్రతి రోజూ కొత్త కనిష్టాలకు పడిపోతుండటంతో రుణాలిచ్చిన సంస్థలు బహిరంగ మార్కెట్లో అడాగ్ గ్రూపు షేర్లను నిలువునా విక్రయించేస్తున్నాయి. ఈ రకంగా చూస్తే అడాగ్ గ్రూపు విలువ చూడటానికి రూ.5వేల కోట్లున్నప్పటికీ... ప్రమోటర్ అనిల్ అంబానీ తాకట్టు పెట్టకుండా ఉంచుకున్న వాటాల విలువ కేవలం రూ.500 కోట్లే ఉంటుందని అంచనా. అంటే 2008 నాటి సంపదలో 98 శాతాన్ని హారతి కర్పూరం చేసేశారు. అనిల్‌తో పాటు ఆయన గ్రూపు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు కూడా... దాదాపు 90 శాతం సంపదను కోల్పోయి కుదేలయ్యారు. వారం రోజులు కూడా కాలేదు... గడిచిన 14 నెలల కాలంలో రూ.35,000 కోట్ల మేర రుణాలను చెల్లించేశామని, భవిష్యత్తులో అన్ని రుణాలను సకాలంలో చెల్లిస్తామని అనిల్ అంబానీ సరిగ్గా వారం క్రితం ప్రకటించారు. కానీ, ఆ మరుసటి రోజే అంటే గత బుధవారం రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కంపెనీల ఆడిటింగ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ ప్రకటించింది. నిధుల మళ్లింపుపై ఆరోపణలు చేసింది. కోరిన సమాచారాన్ని అందించలేకపోయినట్టు పేర్కొంది. దీంతో అనిల్ గ్రూపు కంపెనీలపై మరిన్ని సందేహాలు తలెత్తాయి. సమీప కాలంలో అడాగ్ గ్రూపు షేర్లు కోలుకోకపోవచ్చన్న అంచనాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపించారు. మంగళవారం రిలయన్స్ ఇన్ఫ్రా 19 శాతం నష్టపోయి రూ.45.80 వద్ద క్లోజవగా, రిలయన్స్ క్యాపిటల్ 11 శాతం నష్టంతో రూ.63.55 వద్ద ముగిసింది. రిలయన్స్ నావల్ అండ్ ఇంజనీరింగ్ 17 శాతానికి పైగా నష్టపోయి రూ.4.65 వద్ద, రిలయన్స్ పవర్ 13 శాతానికి పైగా క్షీణించి రూ.4.57 వద్దకు పడిపోయాయి. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కూడా 10 శాతం నష్టంతో రూ.11.95కు చేరుకుంది. రిలయన్స్ నిప్పన్ అసెట్ మేనేజిమెంట్ (ఆర్‌నామ్) మాత్రం నష్టం లేకుండా రూ.220.80 వద్ద క్లోజయింది. అయితే ఆర్‌నామ్‌లో మొత్తం వాటాను జపాన్‌కు చెందిన నిప్పన్‌కు అడాగ్ గ్రూపు విక్రయించటం తెలిసిందే. వ్యాపారాల విక్రయం... రిలయన్స్ క్యాపిటల్‌కు ఉన్న రూ.18,000 కోట్లకుపైగా రుణ భారాన్ని తగ్గించుకునే కార్యక్రమంలో భాగంగా ఆర్‌నామ్‌లో ఉన్న 42.88 శాతానికి వాటాను విక్రయించి బయటపడాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆర్‌నామ్‌లో 10.75 శాతం వాటాను రూ.1,450 కోట్లకు రిలయన్స్ క్యాపిటల్ ఓపెన్ మార్కెట్లో విక్రయించింది. మిగిలిన వాటాను జపాన్‌కు చెందిన భాగస్వామి నిప్పన్ లైఫ్ కొనుగోలు చేయనుంది. బిగ్ఎఫ్ఎం రేడియోలోనూ వాటాలను రేడియో మిర్చికి విక్రయించేందుకు అనిల్ డీల్ కుదుర్చుకున్నారు. వీటన్నిం టికంటే ముందే అత్యంత విలువైన ముంబైలోని విద్యుత్ ట్రాన్స్మిషన్ వ్యాపారాన్ని అదానీ గ్రూపునకు అమ్మేశారు. మిగిలిన ఆస్తులు, ప్రాజెక్టులను విక్రయించి రుణ భారాన్ని దింపుకుని అస్సెట్ లైట్ విధానానికి మళ్లనున్నట్టు అనిల్ ఇప్పటికే ప్రకటించేశారు. మరి వ్యాపారాలను విక్రయానికి పెడితే రుణాలు తీర్చడానికి సరిపడా నిధులయినా వస్తాయా? అన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. స్వయంకృతాపరాధం అప్పట్లో ముకేశ్, అనిల్ ఇద్దరూ రిలయన్స్ సామ్రాజ్యాన్ని చెరిసగం పంచుకున్నారు. ప్రస్తుతం ముకేశ్ అంబానీ సంపద రూ.3.68 లక్షల కోట్లు. ఆయన గ్రూపు విలువైతే 7.5 లక్షల కోట్లపైమాటే. ఇక అనిల్ సంగతి చూస్తే ముకేశ్ సంపదలో 2 శాతం కూడా లేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రమోటర్‌గా ముకేశ్ అంబానీకి గత ఆర్థిక సంవత్సరంలో అందుకున్న డివిడెండ్ ఆదాయం రూ.14,500 కోట్లు. కానీ, అనిల్ కంపెనీల విలువ ముకేశ్ డివిడెండ్ ఆదాయం ముందు కూడా నిలబడలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి దారితీసిన కారణాలేంటని ప్రశ్నించుకుంటే... ‘‘ఇది ఆశ, భయం వంటి సాధారణ కథ మాదిరే. రిలయన్స్ కమ్యూనికేషన్ సంక్షోభానికి అధిక రుణాలే కారణం. పైగా సకాలంలో వ్యాపారం నుంచి బయటపడలేదు. ఫలితంగా గ్రూపు కంపెనీలపైనా ఈ ప్రభావం పడింది’’ అని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ భాసిన్ పేర్కొన్నారు. గ్రూపు 90 శాతం మార్కెట్ విలువను కోల్పోవడంతోపాటు వాటాదారుల నమ్మకాన్ని కూడా దెబ్బతీసిందన్నారు. వ్యాపారాలను తప్పుగా నిర్మించటం, తనఖా ఉంచిన షేర్ల విక్రయాలు వాటాదారులకు కష్టంగా మారినట్టు చెప్పారు. అధిక రుణాలకు తోడు, తక్కువ మార్జిన్లు, తక్కువ క్యాష్‌ఫ్లోతో కూడిన వ్యాపారాలే అనిల్ గ్రూపులో 80%‡ ఉన్నట్టు టార్గెట్ ఇన్వెస్టింగ్ వ్యవస్థాపకుడు సమీర్‌కల్రా పేర్కొన్నారు. ‘‘అడాగ్ గ్రూపు వ్యాపారాల్లో పవర్, యుటిలిటీలు, ఎన్‌బీఎఫ్‌ఎసీ ఇప్పటికీ ఆకర్షణీయంగా ఉన్నాయి. అయితే, వీటిల్లో కొన్ని ఆస్తులను వేగంగా విక్రయించడంపైనే భవిష్య త్తు ఆధారపడి ఉంది’’ అని భాసిన్ పేర్కొన్నారు. రాను న్న బడ్జెట్ ఈ గ్రూపు పరిస్థితిని మార్చేది కావచ్చన్నారు. -
కుప్పకూలుతున్న అడాగ్ షేర్లు
సాక్షి, ముంబై: అనిల్అంబానీ నేతృత్వంలోని అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ అడాగ్ గ్రూపు షేర్లు మరోసారి భారీగా నష్టపోతున్నాయి. గ్రూపులోని కీలకమైన రిలయన్స్ఇన్ఫ్రా 2018-19 క్యు4 ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. ఈ ఫలితాల్లో ఏకంగా రూ.3,301కోట్ల నష్టాలను సంస్థ ప్రకటించింది. దీంతో సోమవారం రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన పలు కంపెనీల షేర్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా రిలయన్స్ ఇన్ఫ్రా 11శాతం కుప్పకూలింది. ఇతర సంస్థలు రిలయన్స్ క్యాపిటల్ షేరు 7శాతం, రిలయన్స్ పవర్ కౌంటర్ 3 శాతం, రిలయన్స్ కమ్యూనికేషన్స్ 5శాతానిపైగా నష్టపోతున్నాయి. మరోవైపు బిజినెస్ నిర్వహణలో కంపెనీ సామర్థ్యంపై తాజాగా ఆడిటర్లు సందేహాల నేపథ్యంలో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. అంతేకాదు అనుబంధ సంస్థ ముంబై మెట్రో.. గ్రూప్‌లోని మరో కంపెనీ రిలయన్స్ నావల్ అండ్ ఇంజినీరింగ్, తదితర అనుబంధ సంస్థలపైనా ఆడిటర్లు ఆందోళన వెలిబుచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రధాన సంస్థ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నష్టాలు నమోదు చేస్తున్నందున కంపెనీ గ్యారంటర్‌గా ఉన్న రుణాల విషయంలోనూ సందేహాలున్నట్లు ఆడిటర్లు పేర్కొన్నారు. -
అప్పులన్నీ తీర్చేస్తాం!
సాక్షి, న్యూఢిల్లీ : అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (అడాగ్) ఛైర్మన్ అనిల్ అంబానీ కీలక ప్రకటన చేశారు. అప్పులు చెల్లించడానికి తాము పూర్తిగా కట్టుబడి వున్నామని ప్రకటించారు. మంగళవారం ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో అనిల్ అంబానీ ఈ మేరకు హామీ ఇచ్చారు. 2018 ఏప్రిల్ మరియు మే 2019 మధ్య కాలంలో ఇప్పటికే వడ్డీ సహా రూ. 35వేల కోట్ల రూపాయల రుణాలను తిరిగి చెల్లించామని పేర్కొన్నారు. ఆస్తులు విక్రయం, తనఖా ద్వారా ఈ అప్పులను తీర్చినట్టు తెలిపారు. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి తమకు ఎటువంటి సహాయం అందలేదని స్పష్టం చేశారు. ఆర్థికపరమైన సవాళ్లు, ఇబ్బందులు ఎన్ని ఉన్నా రుణాలను పూర్తిగా తీర్చడానికి కట్టుబడి వున్నామన్నారు. ఈ పక్రియ వివిధ దశల్లో ఇప్పటికే అమల్లో ఉందని చెప్పారు. ఈ క్రమంలో రిలయన్స్ గ్రూపునకు చెందిన వాటాదారులు, ఉద్యోగుల పూర్తి మద్దతు తమకు లభిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. 2014 నాటి ఆర్‌కాం- ఎరిక్సన్ ఇండియా డీల్‌కు సంబంధించి అనిల్ అంబానీకి చెందిన ఆర్‌కాం 1,500 కోట్ల రూపాయల నగదు చెల్లించలేదని నేషనల్ కంపెనీ లా అప్పెల్లేట్ ట్రిబ్యునల్ ముందు ఎరిక్సన్ ఫిర్యాదు చేసింది. డిసెంబర్ 15 లోగా ఎరిక్సన్ అప్పులు తీర్చివేయాలని లేదంటే, 12 శాతం వడ్డీతో మొత్తం చెల్లించాల్సి వుంటుందని గత ఏడాది అక్టోబర్‌లో ఆర్‌కాంను సుప్రీం ఆదేశించింది. ఈ నేపథ్యంలో రూ.25వేల కోట్ల విలువైన ఆస్తులు (స్పెక్ట్రమ్, ఫైబర్, టెలికాం టవర్లు, కొన్ని రియల్ ఎస్టేట్) విక్రయానికి అనుమతిని మంజూరు చేసింది. అయినా ఈ చెల్లింపుల్లో సంస్థ పదే పదే విఫలం కావడంతో కోర్టు ధిక్కరణ, జరిమానాను కూడా ఎదర్కోవాల్సి వచ్చింది. దీంతో 453 కోట్ల రూపాయలను తక్షణమే ఎరిక్సన్కు చెల్లించాలని సుప్రీంకోర్టు గత నెలలో ఆదేశించిన విషయం తెలిసిందే. -
అనిల్ అంబానీ పని అయిపోయిందా..?
అన్నదమ్ములిద్దరూ దాదాపు ఒకే దగ్గర జర్నీ ప్రారంభించారు. కానీ ఒకరు ఆకాశామే హద్దుగా ఎదుగుతుంటే.. మరొకరు అధఃపాతాళం లోతుల్లోకి జారిపోతున్నారు. దేశంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో నువ్వా, నేనా అన్నట్లుగా ఒకప్పుడు అన్న ముకేశ్ అంబానీతో పోటీపడిన అనిల్ అంబానీ ప్రస్తుతం ఆ లిస్టులో ఎక్కడో కిందికి పడిపోయారు. అన్న ముకేశ్ అంబానీ 47 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా రాజ్యమేలుతుండగా.. 2 బిలియన్ డాలర్లకు పడిపోయిన సంపదతో తమ్ముడు అనిల్ అంబానీ కనీసం దేశీ కుబేరుల లిస్టులోనూ చోటు కోసం తంటాలు పడే పరిస్థితికి తగ్గిపోయారు. దశాబ్ద కాలంలో అన్న ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.లక్ష కోట్ల నుంచి రూ. 8 లక్షల కోట్లకు ఎగిసినప్పటికీ... అడ్డదిడ్డంగా ఎడాపెడా కంపెనీలు ఏర్పాటు చేస్తూ, సంబంధంలేని రంగాల్లోకి దూరేస్తూ.. అప్పులు పెంచుకుంటూ పోయిన అనిల్ అంబానీ సారథ్యంలోని అడాగ్ గ్రూప్ విలువ వేల కోట్ల స్థాయికి పడిపోయింది. పదేళ్ల క్రితం రూ. 1.7 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో అగ్రశ్రేణి సంస్థగా వెలుగొందిన ఫ్లాగ్ షిప్ కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) ప్రస్తుతం దాదాపు రూ. 50,000 కోట్ల పైచిలుకు రుణాల భారంతో కుదేలై.. దివాలా తీసింది. గ్రూప్‌లోని మిగతా కంపెనీలు నానా తంటాలు పడుతున్నాయి. ఆర్‌కామ్ దివాలా ప్రకటనతో సోమవారం అడాగ్ గ్రూప్ సంస్థల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. గ్రూప్‌లో కీలకమైన అయిదు సంస్థల మార్కెట్ విలువ ఒక్క రోజే ఏకంగా రూ.5,831 కోట్ల మేర పడిపోయింది. ఈ నేపథ్యంలో సంక్షోభంలో చిక్కుకున్న అనిల్, అడాగ్ గ్రూప్ కంపెనీలు, కారణాలపై ‘సాక్షి’ బిజినెస్ విభాగం అందిస్తున్న ప్రత్యేక కథనమిది... సరి సమానంగా విభజన... వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ మరణానంతరం సోదరులిద్దరి మధ్య ఆధిపత్య పోరు పెరిగిపోవటంతో 2005లో దాదాపు రూ.90,000 కోట్ల రిలయన్స్ సామ్రాజ్యం రెండుగా చీలిపోయింది. ఇందులో ముడిచమురు కంపెనీ అన్న ముకేశ్‌కు రాగా.. టెలికం, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్ఫ్రా, పవర్ వంటి కీలక సంస్థలు అనిల్ చేతికి దక్కాయి. అవిభాజ్య గ్రూప్‌లో అనిల్ అంబానీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా (సీఎఫ్ఓ) వ్యవహరించేవారు. వ్యాపార భారాన్ని భుజాలపై మోయడం కన్నా.. డీల్స్ కుదర్చడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు. కాకపోతే విభజన తరవాత భారీ సామ్రాజ్యాన్ని నిర్వహించాల్సిన బాధ్యత మీద పడటంతో.. ఆయన సామర్థ్యాలకు పరీక్ష మొదలైంది. సవాళ్లూ ఒక్కొక్కటిగా ఎదురవటం మొదలెట్టాయి. వ్యాపార విస్తరణ కాంక్షతో సంబంధం లేని రంగాల్లోకి కూడా చొచ్చుకుపోయారు అనిల్. చివరకు అప్పుల భారం పేరుకుపోయిన ఆర్‌కామ్ రూపంలో సంక్షోభం బయటపడింది. వచ్చే ఆదాయాలు వడ్డీలు కట్టడానికి కూడా సరిపోని పరిస్థితుల్లోకి గ్రూప్ దిగజారిపోయింది. ముంబైలో తొలి మెట్రో లైన్ నిర్మించిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ... గతేడాది ఆగస్టులో బాండ్లను చెల్లించలేక చేతులెత్తేసింది. 2008లో రికార్డ్ ఐపీవోకి వచ్చిన రిలయన్స్ పవర్ షేరు.. అప్పట్నుంచీ పడుతూనే ఉంది. కాస్త లాభసాటిగా ఉండే ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం రిలయన్స్ క్యాపిటల్‌కి కూడా కష్టాలు తప్పలేదు. మొత్తానికి సంక్షోభంలోకి పడిపోయిన కొన్ని గ్రూప్ కంపెనీలను చూస్తే.. ఆర్‌కామ్: కాల్ డిస్కనెక్ట్.. 2010లో 17% మార్కెట్ వాటాతో దేశీ టెలికంలో ఆర్‌కామ్ రెండో స్థానంలో ఉండేది. 2016లో అన్న ముకేశ్ ఎంట్రీ తర్వాత ఇది పదవ స్థానానికి పడిపోయి.. టాప్ కంపెనీల లిస్టు నుంచి తప్పుకుంది. ఒకప్పుడు రూ.1.7 లక్షల కోట్ల మార్కెట్ విలువతో అగ్రస్థానంలో వెలుగొందిన ఆర్‌కామ్ ఇప్పుడు రూ.45 వేల కోట్ల పైచిలుకు రుణ భారంలో ఉంది. చివరికి ప్రధానమైన మొబైల్ వ్యాపారాన్ని అన్న కంపెనీకే అమ్మేసినా.. స్పెక్ట్రం బాకీల వివాదంతో డీల్ ముందుకు సాగడం లేదు. బాకీలు ఎగ్గొట్టినందుకు కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలంటూ ఎరిక్సన్ వంటి కంపెనీలు కోర్టులను ఆశ్రయించాయి. 1.8 బిలియన్ డాలర్ల విదేశీ రుణాన్ని వసూలు చేసుకునేం దుకు చైనా డెవలప్మెంట్ బ్యాంక్ కూడా దివాలా పిటిషన్ వేసింది. సినిమా... అట్టర్ ఫ్లాప్ ఒకప్పటి సినీతార టీనా మునీమ్‌ను వివాహం చేసుకున్న అనిల్ అంబానీ .. తన అడాగ్ గ్రూప్ ద్వారా గ్లామర్ ప్రపంచ వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టారు. ఫిలిమ్ ప్రాసెసింగ్, ప్రొడక్షన్, పంపిణీ రంగాల్లోని యాడ్ ల్యాబ్స్ సంస్థ కొనుగోలుతో ఆరంభంలో భారీగానే విస్తరించారు. 2008 నాటికి దాదాపు 700 స్క్రీన్స్‌తో దేశంలోనే అతి పెద్ద మల్టీప్లెక్స్ ఆపరేటర్‌గా అనిల్ ఎదిగారు. కానీ 2014 నాటికి ఈ మీడియా వైభవం తగ్గిపోయింది. రుణాల భారం తగ్గించుకోవడానికి వందల కొద్దీ స్క్రీన్స్‌ను తెగనమ్ముకోవాల్సి వచ్చింది. సంబంధం లేని గ్లామర్ బిజినెస్‌లోకి దూకి అనిల్ దానిపై దృష్టి పెట్టడం వల్ల ప్రధాన గ్రూప్ కంపెనీల పనితీరు దెబ్బతిన్నదనే విమర్శలూ ఉన్నాయి. అసెట్స్ అమ్మకాలకు ఆటంకాలు.. మరోపక్క, అప్పుల భారాలను తగ్గించుకోవడానికి అనిల్ అంబానీ పెద్ద ఎత్తున అసెట్స్‌ను విక్రయిస్తున్నారు. ఇప్పటికే సిమెంట్, టెలికం టవర్స్ మొదలైన వాటిని అమ్మేశారు. కానీ.. ఒక్కో వ్యాపార విభాగంలో ఒక్కో సమస్య కారణంగా అసెట్స్ విక్రయం పూర్తి స్థాయిలో ముందుకు జరగడం లేదు. రూ. 1,00,000 కోట్లు.. 2018 మార్చి ఆఖరు నాటికి అడాగ్ రుణభారం ఇది. ఏటా వడ్డీల కిందే రూ. 10,000 కోట్లు. రూ. 4,00,000 కోట్లు.. గరిష్ట స్థాయిలో అడాగ్ గ్రూప్‌లోని 5 ప్రధాన సంస్థల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్. ప్రస్తుతం రూ. 50 వేల కోట్ల కన్నా తక్కువకి పడిపోయింది. రక్షణ... బ్యాక్ ఫైర్! ఉన్న సమస్యలు సరిపోవన్నట్లు.. అనిల్ అంబానీ 2016లో పిపావవ్ మెరైన్ అండ్ ఆఫ్‌షోర్ (రిలయన్స్ నేవల్గా పేరు మారింది) యాజమాన్య వాటాలను కొనుక్కున్నారు. ఇది భారతీయ నేవీ కోసం యుద్ధనౌకల నిర్మాణం, మరమ్మతుల సర్వీసులు అందిస్తుంది. సమస్యల్లో ఉన్న ఇన్ఫ్రా నుంచి పుష్కలమైన అవకాశాలున్న డిఫెన్స్ వైపుగా వెడితే అడాగ్‌ను కాపాడుకోవచ్చని అనిల్ భావించారు. కానీ, ఈ ప్రయోగమూ దెబ్బతింది. అయినా.. అసలు భారీ నష్టాలు, అప్పులతో కుదేలైన ఈ సంస్థను ఎందుకు కొన్నారనేది ఎవరికీ అర్థం కాలేదు. రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించి ఫ్రాన్స్ కంపెనీ డస్సాల్ట్‌తో ఈ కంపెనీ జట్టు కట్టడంపై ప్రస్తుతం వివాదం నడుస్తోంది. అనిల్ అంబానీకి మేలు చేసేందుకు ప్రభుత్వమే ఈ రెండింటి మధ్య డీల్ కుదిర్చిందంటూ విపక్షాలు విమర్శల దాడి చేస్తున్నాయి. 45 బిలియన్ డాలర్ల వ్యత్యాసం.. ఫోర్బ్స్ మ్యాగజైన్ గణాంకాల ప్రకారం 2007లో అనిల్ సంపద 45 బిలియన్ డాలర్లు. అన్న ముకేశ్ సంపద 49 బిలియన్ డాలర్లు. ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి 2018కి వస్తే ఫోర్బ్స్ ఇండియా కుబేరుల లిస్టులో ముకేశ్ 47.3 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉండగా.. 2.44 బిలియన్ డాలర్ల సంపదతో అనిల్ 66వ స్థానానికి పడిపోయారు. అసలెక్కడ తేడా కొట్టింది..? కేవలం దశాబ్దం కాలంలో అనిల్ సామ్రాజ్యం కుప్పకూలడానికి దారి తీసిన కారణాలేంటి. డీల్ మేకర్‌గా, వ్యాపార నిర్వహణలో ఇన్వెస్టర్ల నమ్మకం చూరగొన్న అనిల్ అంబానీ గ్రాఫ్ ఎందుకిలా పడిపోయింది? 2008లో రికార్డు స్థాయిలో రిలయన్స్ పవర్ రూ.11,500 కోట్ల నిధుల కోసం ఐపీఓకు వచ్చినపుడు... అది రికార్డు స్థాయిలో 70 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయింది. మరలాంటప్పుడు.. ఎక్కడ తేడా కొట్టింది? నిర్వహణ లోపమా? సమర్థమంతమైన టీమ్ లేకపోవడం వల్లా? లేదా ఒకదానితో మరొక దానికి సంబంధం లేకుండా కుప్పతెప్పలుగా కంపెనీలు పెట్టేయడం వల్లా? లేదా ఎకాయెకిన ఆకాశానికి నిచ్చెనలేసేయాలన్న అత్యుత్సాహంతో దొరికిన చోటల్లా అడ్డగోలుగా అప్పులు చేసేసి.. రుణభారం పెంచేసుకోవడం వల్లా? వ్యాపార పరిస్థితులు పూర్తిగా దెబ్బతినడం వల్లా? తరచి చూస్తే సామ్రాజ్యాన్ని కుప్పకూల్చిన ప్రధాన కారణాల గురించి వెతుక్కుంటూ పోతే అంతు ఉండదన్నది పరిశీలకుల అభిప్రాయం. అయితే, అన్నింటికీ వ్యాపార పరిస్థితులు బాగా లేకపోవడం, దురదృష్టం అనుకోవడానికి ఉండదని.. ఆయన ప్రారంభించిన అనేక కంపెనీలే ఒకదాన్ని మరొకటి దెబ్బతీశాయని.. వాటాదారుల ప్రయోజనాలను ఘోరంగా దెబ్బతీశాయని విమర్శలు వస్తున్నాయి. కాస్తంత ఇబ్బందికరమైనదే అయినా.. సోషల్ మీడియా యాప్స్‌లో అన్నదమ్ములపై ఒక సెటైర్ కూడా ప్రచారంలోకి వచ్చింది. అన్న ముకేశ్ అంటే ’ము–క్యాష్’ (డబ్బుల మూట) అని, తమ్ముడు అనిల్ అంటే ’అ–నిల్’ (సున్నా) అంటూ వ్యంగ్యోక్తులు కూడా నడిచాయి. -
అడాగ్ గ్రూప్ టీవీ చానళ్లు జీ చేతికి
• రేడియో వ్యాపారంలో 49 శాతం వాటా కూడా • లావాదేవీ విలువ రూ. 1,900 కోట్లు న్యూఢిల్లీ: అనిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్‌నకు (అడాగ్) చెందిన టీవీ చానళ్లను సుభాష్ చంద్రకు చెందిన జీగ్రూప్ కొనుగోలు చేయనుంది. ఎంటర్టైన్మెంట్ టీవీ చానళ్లలో 100 శాతం వాటాతో పాటు రిలయన్స రేడియో వ్యాపారంలో 49 శాతం వాటాను కూడా అడాగ్ విక్రరుుస్తోంది. ఈ మేరకు ఇరు గ్రూప్‌ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఆయా కంపెనీల బోర్డులు ఈ ఒప్పందాన్ని ఆమోదించారుు. ఈ మొత్తం లావాదేవీ విలువ రూ.1,900 కోట్లు. జీగ్రూప్ కంపెనీ అరుున జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రెజైస్ తమ టీవీ వ్యాపారాన్ని పూర్తిగా కొనుగోలు చేసిందని, జీ మీడియా కార్పొరేషన్‌కు తమ రెడియో వ్యాపారంలో 49 శాతాన్ని విక్రరుుస్తున్నామని రిలయన్స క్యాపిటల్ ఒక ప్రకటనలో తెలియజేసింది. తమకు ప్రధానం కాని వ్యాపారాల నుంచి వైదొలగడం ద్వారా రుణభారాన్ని తగ్గించుకునే క్రమంలో ఈ విక్రయాలు జరిపినట్లు అడాగ్ తెలియజేసింది. హిందీలో బిగ్ మ్యాజిక్ పేరుతో ఒక కామెడీ చానల్, భోజ్‌పురి భాషలో బిగ్ గంగా పేరుతో ఒక ఎంటర్టైన్మెంట్ చానల్‌ను అడాగ్ గ్రూపు నిర్వహిస్తోంది. అలాగే ఈ సంస్థకు 45 ఎఫ్ఎం రెడియో స్టేషన్లు కూడా ఉండగా... మరో 14 కొత్త లెసైన్సుల్ని ఇటీవల వేలంలో దక్కించుకుంది. ఈ రేడియో వ్యాపారంలో రిలయన్స తనకున్న వాటాను కొత్తగా ఏర్పాటుచేసే ఒక సంస్థకు బదిలీ చేస్తుంది. ఈ కొత్త సంస్థలో జీ 49 శాతం వాటాను తీసుకుంటుంది. -
ఢిల్లీ సీబీఐ కోర్టుకు అనీల్ అంబానీ
న్యూఢిల్లీ : 2జీ కుంభకోణం కేసులో విచారణ నిమిత్తం రిలియన్స్ అడాగ్ అధ్యక్షుడు అనిల్ అంబానీ గురువారం ఉదయం సీబీఐ కోర్టుకు చేరుకున్నారు. సీబీఐ కోర్టు ముందు ఆయన సాక్షిగా హాజరు అవుతున్నారు. ఢిల్లీ హైకోర్టు ప్రాసిక్యూషన్ సాక్షులుగా రిలయన్స్ టెలికమ్యూనికేషన్స్ చైర్మన్ అనిల్ అంబానీ.. ఆయన భార్య టీనా అంబానీలను 2జీ స్పెక్ట్రమ్ కేసులో సాక్షులుగా హాజరు కావాలని సమన్లు జారీ అయిన విషయం తెలిసిందే. అనిల్ హాజరుకు సంబంధించిన మధ్యంతర ఆర్డరు ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ట్రయల్ కోర్టు దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించడంతో అనిల్ హాజరు అనివార్యంగా మారింది. అనిల్ సిబిఐ కోర్టు ముందు హాజరు కాకుండా ఉండేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని రిలయన్స్ టెలికాం లిమిటెడ్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే జస్టిస్ జిఎస్ సింఘ్వి సారధ్యంలోని బెంచ్ ఈ విషయంలో కల్పించుకునేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో అనిల్ తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాదులు ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. అనిల్‌తోపాటు ఆయన భార్య టీనా అంబానీ విచారణను వాయిదా వేయాలని కోరారు. అయితే న్యాయస్థానంలో వారికి ఎలాంటి ఉపశమనం లభించలేదు. దాంతో అనిల్ అంబానీ సతీమణి టీనా అంబానీ కూడా శుక్రవారం సీబీఐ కోర్టు ఎదుట హాజరు కానున్నారు.