ఓ అసమర్ధుడి వ్యాపార యాత్ర... | Anil Ambani Loses Billionaire Tag As ADAG Shares Continue To Fall | Sakshi
Sakshi News home page

అయ్యో.. అ‘నిల్‌’!

Published Wed, Jun 19 2019 5:31 AM | Last Updated on Wed, Jun 19 2019 10:58 AM

Anil Ambani Loses Billionaire Tag As ADAG Shares Continue To Fall - Sakshi

న్యూఢిల్లీ: ఓడలు బళ్లు అవుతాయన్న సామెత... అడాగ్‌ గ్రూపునకు అతికినట్టు సరిపోతుంది. ఎందుకంటే 2008లో అడాగ్‌ గ్రూపు చైర్మన్‌ అనిల్‌ అంబానీ గ్రూపు విలువ 42 బిలియన్‌ డాలర్లు. అంటే సుమారు రూ.2.9 లక్షల కోట్లు. అప్పుడు ప్రపంచంలో అత్యంత సంపద కలిగిన వారిలో అనిల్‌ది 6వ స్థానం. కానీ ఆ తరువాతి 11 ఏళ్లలో అనిల్‌ అంబానీ ఎన్నెన్నో నిర్ణయాలు తీసుకున్నారు. ఉన్న కంపెనీల నుంచే కొత్త కంపెనీలను సృష్టించారు. విలువ పెంచుతానంటూ రకరకాల వ్యాపారాల్లోకి వచ్చారు.

పెరగటం మాట అటుంచి... ఆయన గ్రూపు విలువ అత్యంత దారుణ స్థాయికి పడిపోయి రూ.5,000 కోట్లకు పరిమితమయ్యింది. గడిచిన ఏడాదిన్నరగా అడాగ్‌ గ్రూపు షేర్లు పతనమవుతూనే ఉన్నాయి. సోమవారం ముగింపు ధరలతో చూసినపుడు అడాగ్‌ గ్రూపు మార్కెట్‌ విలువ రూ.6,196 కోట్లు. అయితే మంగళవారం సైతం గ్రూపు కంపెనీల షేర్లు భారీగా 10 నుంచి 20 శాతం మధ్య నష్టపోయాయి. ఈ ప్రకారం ఆయన సంపద రూ.5,000 కోట్లకు దిగినట్టు భావించాలి.

దీనికితోడు ప్రమోటర్లు తమ వాటాల్లో అత్యధిక భాగాన్ని తనఖా పెట్టి రుణాలు తీసుకున్నారు. షేర్లు ప్రతి రోజూ కొత్త కనిష్టాలకు పడిపోతుండటంతో రుణాలిచ్చిన సంస్థలు బహిరంగ మార్కెట్లో అడాగ్‌ గ్రూపు షేర్లను నిలువునా విక్రయించేస్తున్నాయి. ఈ రకంగా చూస్తే అడాగ్‌ గ్రూపు విలువ చూడటానికి రూ.5వేల కోట్లున్నప్పటికీ... ప్రమోటర్‌ అనిల్‌ అంబానీ తాకట్టు పెట్టకుండా ఉంచుకున్న వాటాల విలువ కేవలం రూ.500 కోట్లే ఉంటుందని అంచనా. అంటే 2008 నాటి సంపదలో 98 శాతాన్ని హారతి కర్పూరం చేసేశారు. అనిల్‌తో పాటు ఆయన గ్రూపు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు కూడా... దాదాపు 90 శాతం సంపదను కోల్పోయి కుదేలయ్యారు.

వారం రోజులు కూడా కాలేదు...
గడిచిన 14 నెలల కాలంలో రూ.35,000 కోట్ల మేర రుణాలను చెల్లించేశామని, భవిష్యత్తులో అన్ని రుణాలను సకాలంలో చెల్లిస్తామని అనిల్‌ అంబానీ సరిగ్గా వారం క్రితం ప్రకటించారు. కానీ, ఆ మరుసటి రోజే అంటే గత బుధవారం రిలయన్స్‌ క్యాపిటల్, రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ కంపెనీల ఆడిటింగ్‌ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రైస్‌ వాటర్‌ హౌస్‌ కూపర్స్‌ ప్రకటించింది. నిధుల మళ్లింపుపై ఆరోపణలు చేసింది. కోరిన సమాచారాన్ని అందించలేకపోయినట్టు పేర్కొంది. దీంతో అనిల్‌ గ్రూపు కంపెనీలపై మరిన్ని సందేహాలు తలెత్తాయి.

సమీప కాలంలో అడాగ్‌ గ్రూపు షేర్లు కోలుకోకపోవచ్చన్న అంచనాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపించారు. మంగళవారం రిలయన్స్‌ ఇన్‌ఫ్రా 19 శాతం నష్టపోయి రూ.45.80 వద్ద క్లోజవగా, రిలయన్స్‌ క్యాపిటల్‌ 11 శాతం నష్టంతో రూ.63.55 వద్ద ముగిసింది. రిలయన్స్‌ నావల్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ 17 శాతానికి పైగా నష్టపోయి రూ.4.65 వద్ద, రిలయన్స్‌ పవర్‌ 13 శాతానికి పైగా క్షీణించి రూ.4.57 వద్దకు పడిపోయాయి. రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ కూడా 10 శాతం నష్టంతో రూ.11.95కు చేరుకుంది. రిలయన్స్‌ నిప్పన్‌ అసెట్‌ మేనేజిమెంట్‌ (ఆర్‌నామ్‌) మాత్రం నష్టం లేకుండా రూ.220.80 వద్ద క్లోజయింది. అయితే ఆర్‌నామ్‌లో మొత్తం వాటాను జపాన్‌కు చెందిన నిప్పన్‌కు అడాగ్‌ గ్రూపు విక్రయించటం తెలిసిందే.  

వ్యాపారాల విక్రయం...
రిలయన్స్‌ క్యాపిటల్‌కు ఉన్న రూ.18,000 కోట్లకుపైగా రుణ భారాన్ని తగ్గించుకునే కార్యక్రమంలో భాగంగా ఆర్‌నామ్‌లో ఉన్న 42.88 శాతానికి వాటాను విక్రయించి బయటపడాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆర్‌నామ్‌లో 10.75 శాతం వాటాను రూ.1,450 కోట్లకు రిలయన్స్‌ క్యాపిటల్‌ ఓపెన్‌ మార్కెట్లో విక్రయించింది. మిగిలిన వాటాను జపాన్‌కు చెందిన భాగస్వామి నిప్పన్‌ లైఫ్‌ కొనుగోలు చేయనుంది. బిగ్‌ఎఫ్‌ఎం రేడియోలోనూ వాటాలను రేడియో మిర్చికి విక్రయించేందుకు అనిల్‌ డీల్‌ కుదుర్చుకున్నారు. వీటన్నిం టికంటే ముందే అత్యంత విలువైన ముంబైలోని విద్యుత్‌ ట్రాన్స్‌మిషన్‌ వ్యాపారాన్ని అదానీ గ్రూపునకు అమ్మేశారు.  మిగిలిన ఆస్తులు, ప్రాజెక్టులను విక్రయించి రుణ భారాన్ని దింపుకుని అస్సెట్‌ లైట్‌ విధానానికి మళ్లనున్నట్టు అనిల్‌ ఇప్పటికే ప్రకటించేశారు. మరి వ్యాపారాలను విక్రయానికి పెడితే రుణాలు తీర్చడానికి సరిపడా నిధులయినా వస్తాయా? అన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి.  

స్వయంకృతాపరాధం
అప్పట్లో ముకేశ్, అనిల్‌ ఇద్దరూ రిలయన్స్‌ సామ్రాజ్యాన్ని చెరిసగం పంచుకున్నారు. ప్రస్తుతం ముకేశ్‌ అంబానీ సంపద రూ.3.68 లక్షల కోట్లు. ఆయన గ్రూపు విలువైతే 7.5 లక్షల కోట్లపైమాటే. ఇక అనిల్‌ సంగతి చూస్తే ముకేశ్‌ సంపదలో 2 శాతం కూడా లేదు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రమోటర్‌గా ముకేశ్‌ అంబానీకి గత ఆర్థిక సంవత్సరంలో అందుకున్న డివిడెండ్‌ ఆదాయం రూ.14,500 కోట్లు. కానీ, అనిల్‌ కంపెనీల విలువ ముకేశ్‌ డివిడెండ్‌ ఆదాయం ముందు కూడా నిలబడలేని పరిస్థితి ఏర్పడింది.  

దీనికి దారితీసిన కారణాలేంటని ప్రశ్నించుకుంటే... ‘‘ఇది ఆశ, భయం వంటి సాధారణ కథ మాదిరే. రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ సంక్షోభానికి అధిక రుణాలే కారణం. పైగా సకాలంలో వ్యాపారం నుంచి బయటపడలేదు. ఫలితంగా గ్రూపు కంపెనీలపైనా ఈ ప్రభావం పడింది’’ అని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ భాసిన్‌ పేర్కొన్నారు. గ్రూపు 90 శాతం మార్కెట్‌ విలువను కోల్పోవడంతోపాటు వాటాదారుల నమ్మకాన్ని కూడా దెబ్బతీసిందన్నారు. వ్యాపారాలను తప్పుగా నిర్మించటం, తనఖా ఉంచిన షేర్ల విక్రయాలు వాటాదారులకు కష్టంగా మారినట్టు చెప్పారు. అధిక రుణాలకు తోడు, తక్కువ మార్జిన్లు, తక్కువ క్యాష్‌ఫ్లోతో కూడిన వ్యాపారాలే అనిల్‌ గ్రూపులో 80%‡ ఉన్నట్టు టార్గెట్‌ ఇన్వెస్టింగ్‌ వ్యవస్థాపకుడు సమీర్‌కల్రా పేర్కొన్నారు. ‘‘అడాగ్‌ గ్రూపు వ్యాపారాల్లో పవర్, యుటిలిటీలు, ఎన్‌బీఎఫ్‌ఎసీ  ఇప్పటికీ ఆకర్షణీయంగా ఉన్నాయి. అయితే, వీటిల్లో కొన్ని ఆస్తులను వేగంగా విక్రయించడంపైనే భవిష్య త్తు ఆధారపడి ఉంది’’ అని భాసిన్‌ పేర్కొన్నారు. రాను న్న బడ్జెట్‌ ఈ గ్రూపు పరిస్థితిని మార్చేది కావచ్చన్నారు. 


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement