
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. తన కంపెనీల్లో రుణ భారాన్ని తగ్గించుకుని తిరిగి ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించారు. ఆయన ఆధ్వర్యంలోని రిలయన్స్ పవర్ అయితే ఇటీవల పూర్తిగా రుణరహితంగా మారింది. అయినప్పటికీ ఆయనకు కొన్ని కష్టాలు తప్పడం లేదు.
కంపెనీ నుండి నిధుల మళ్లింపు వ్యవహారానికి సంబంధించి తాజాగా మార్కెట్ రెగ్యులేటర్ సెబీ.. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ ప్రమోటర్ సంస్థతో సహా ఆరు సంస్థలకు డిమాండ్ నోటీసులు పంపింది. రూ. 154.50 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. గత ఆగస్టులో సెబీ విధించిన జరిమానాను చెల్లించడంలో ఈ సంస్థలు విఫలమవడంతో తాజాగా డిమాండ్ నోటీసులు వచ్చాయి.
15 రోజుల్లో చెల్లించాలి
ఈసారి 15 రోజుల్లోగా చెల్లించకపోతే ఆస్తులు, బ్యాంక్ ఖాతాలను అటాచ్ చేస్తామని సెబీ ఈ సంస్థలను హెచ్చరించింది. నోటీసులు అందుకున్న సంస్థల్లో క్రెస్ట్ లాజిస్టిక్స్ అండ్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ప్రస్తుతం సీఎల్‌ఈ ప్రైవేట్ లిమిటెడ్), రిలయన్స్ యునికార్న్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ ఎక్స్ఛేంజ్ నెక్స్ట్ లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ బిజినెస్ బ్రాడ్‌కాస్ట్ న్యూస్ హోల్డింగ్స్ లిమిటెడ్, రిలయన్స్ క్లీన్‌జెన్ లిమిటెడ్ ఉన్నాయి.
ఆరు వేర్వేరు నోటీసులలో ఈ ఆరు సంస్థలను ఒక్కొక్కటి రూ. 25.75 కోట్లు చెల్లించాలని మార్కెట్స్ నియంత్రణ సంస్థ ఆదేశించింది. ఇందులో వడ్డీతోపాటు 15 రోజులకూ రికవరీ ఖర్చులను జోడించింది. బకాయిలు చెల్లించని పక్షంలో, మార్కెట్ రెగ్యులేటర్ ఈ సంస్థల స్థిర, చరాస్తులను అటాచ్ చేసి విక్రయించడం ద్వారా మొత్తాన్ని రికవరీ చేస్తుంది. అంతేకాకుండా బ్యాంకు ఖాతాల అటాచ్‌మెంట్‌ను సైతం ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment