పడిన కెరటం తప్పకలేస్తుంది. అలాగే పరాజయం పాలైన ప్రతిఒక్కరికీ తమదైన రోజు తప్పక వస్తుంది. ఒకప్పుడు ప్రపంచంలోనే ఆరో అత్యంత సంపన్నుడైన అనిల్ అంబానీ వరుస వైఫల్యాలతో నష్టాలు, అప్పులతో చీకటి రోజులను చవిచూశారు. ఇప్పుడాయనకు మంచి రోజులు వచ్చాయి. ఒక్కో కంపెనీ అప్పుల ఊబిలోంచి బయట పడుతోంది. వ్యాపార సామ్రాజ్యం తిరిగి పుంజుకుంటోంది.
టాప్ టెన్ సంపన్నుడు
ఆసియాలోనే అపర కుబేరుడైన ముఖేష్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీ కూడా 2008లో 42 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో ప్రపంచంలోనే ఆరో అత్యంత సంపన్నుడిగా ఉండేవారు. తర్వాత ఆయన అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ రూ.24,000 కోట్ల విలువైన బాండ్లను చెల్లించలేక రిలయన్స్ క్యాపిటల్ 2021లో దివాళా తీసే వరకూ వచ్చేశారు.
వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న అనిల్ అంబానీని చూసి చాలా మంది ఇక ఆయన పుంజుకోలేడనే అభిప్రాయానికి వచ్చేశారు. కానీ ఎన్ని వైఫల్యాలు ఎదురైనా దృఢనిశ్చయంతో ముందుకు సాగిన అనిల్ అంబానీ అద్భుతమైన పునరాగమనం చేస్తున్నారు.
కలిసొచ్చిన సెప్టెంబర్
ఈ ఏడాది సెప్టెంబర్ నెల రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి అనుకూలమైనదిగా మారుతోంది. ఎందుకంటే 18 నుంచి 21 తేదీల మధ్య కేవలం మూడు రోజుల్లోనే గ్రూప్ తమ అప్పులు దాదాపు తీరిపోయినట్లు ప్రకటించింది. దీర్ఘకాలిక నిధుల సేకరణ ప్రణాళికలను కూడా అమలు చేస్తోంది. రిలయన్స్ పవర్ భారీ ఆర్డర్‌ను అందుకుంది. దాని షేర్లను పెంచుకుంది. ఇక రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రుణ రహితం దిశగా వేగంగా కదులుతోంది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) నుండి అనుకూలమైన వార్తలను అందుకుంది.
ఇదీ చదవండి: అనిల్ అంబానీకి ఇక అన్నీ మంచి రోజులేనా?
అనిల్ అంబానీకి పెద్ద ఊరటగా కంపెనీ దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభమైన తర్వాత చేసిన అంచనా ఆధారంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్‌పై బకాయిలను క్లెయిమ్ చేయాలని రాష్ట్ర పన్ను శాఖ దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్‌సీఎల్‌ఏటీ పక్కన పెట్టిందని వార్తా సంస్థ తాజాగా నివేదించింది.
అనిల్ అంబానీ నెట్‌వర్త్
తన నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ కంపెనీల పురోగతితో అనిల్ అంబానీ నెట్‌వర్త్ కూడా పుంజుకుంటోంది. నిధుల చేరిక ఫలితంగా ఇటీవలి ఫైలింగ్‌ల ప్రకారం.. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నికర విలువ రూ. 9,000 కోట్ల నుండి రూ. 12,000 కోట్లకు పెరుగుతుందని అంచనా వేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా 2023 ఫిబ్రవరిలో నివేదించినదాని ప్రకారం.. అనిల్ అంబానీ మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ. 20,000 కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment