అనిల్‌ అంబానీ పని అయిపోయిందా..? | Anil Ambani will have to raise the debt | Sakshi
Sakshi News home page

అనిల్‌ అంబానీ పని అయిపోయిందా..?

Published Tue, Feb 5 2019 5:19 AM | Last Updated on Tue, Feb 5 2019 12:44 PM

Anil Ambani will have to raise the debt - Sakshi

అన్నదమ్ములిద్దరూ దాదాపు ఒకే దగ్గర జర్నీ ప్రారంభించారు. కానీ ఒకరు ఆకాశామే హద్దుగా ఎదుగుతుంటే.. మరొకరు అధఃపాతాళం లోతుల్లోకి జారిపోతున్నారు. దేశంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో నువ్వా, నేనా అన్నట్లుగా ఒకప్పుడు అన్న ముకేశ్‌ అంబానీతో పోటీపడిన అనిల్‌ అంబానీ ప్రస్తుతం ఆ లిస్టులో ఎక్కడో కిందికి పడిపోయారు. అన్న ముకేశ్‌ అంబానీ 47 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా రాజ్యమేలుతుండగా.. 2 బిలియన్‌ డాలర్లకు పడిపోయిన సంపదతో తమ్ముడు అనిల్‌ అంబానీ కనీసం దేశీ కుబేరుల లిస్టులోనూ చోటు కోసం తంటాలు పడే పరిస్థితికి తగ్గిపోయారు. దశాబ్ద కాలంలో అన్న ముకేశ్‌ అంబానీ సారథ్యంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ విలువ రూ.లక్ష కోట్ల నుంచి రూ. 8 లక్షల కోట్లకు ఎగిసినప్పటికీ... అడ్డదిడ్డంగా ఎడాపెడా కంపెనీలు ఏర్పాటు చేస్తూ, సంబంధంలేని రంగాల్లోకి దూరేస్తూ.. అప్పులు పెంచుకుంటూ పోయిన అనిల్‌ అంబానీ సారథ్యంలోని అడాగ్‌ గ్రూప్‌ విలువ వేల కోట్ల స్థాయికి పడిపోయింది.

పదేళ్ల క్రితం రూ. 1.7 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌తో అగ్రశ్రేణి సంస్థగా వెలుగొందిన ఫ్లాగ్‌ షిప్‌ కంపెనీ రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) ప్రస్తుతం దాదాపు రూ. 50,000 కోట్ల పైచిలుకు రుణాల భారంతో కుదేలై.. దివాలా తీసింది. గ్రూప్‌లోని మిగతా కంపెనీలు నానా తంటాలు పడుతున్నాయి. ఆర్‌కామ్‌ దివాలా ప్రకటనతో సోమవారం అడాగ్‌ గ్రూప్‌ సంస్థల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. గ్రూప్‌లో కీలకమైన అయిదు సంస్థల మార్కెట్‌ విలువ ఒక్క రోజే ఏకంగా రూ.5,831 కోట్ల మేర పడిపోయింది.  ఈ నేపథ్యంలో సంక్షోభంలో చిక్కుకున్న అనిల్, అడాగ్‌ గ్రూప్‌ కంపెనీలు, కారణాలపై ‘సాక్షి’ బిజినెస్‌ విభాగం అందిస్తున్న ప్రత్యేక కథనమిది...  

సరి సమానంగా విభజన...
వ్యవస్థాపకుడు ధీరూభాయ్‌ అంబానీ మరణానంతరం సోదరులిద్దరి మధ్య ఆధిపత్య పోరు పెరిగిపోవటంతో 2005లో దాదాపు రూ.90,000 కోట్ల రిలయన్స్‌ సామ్రాజ్యం రెండుగా చీలిపోయింది. ఇందులో ముడిచమురు కంపెనీ అన్న ముకేశ్‌కు రాగా.. టెలికం, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఇన్‌ఫ్రా, పవర్‌ వంటి కీలక సంస్థలు అనిల్‌ చేతికి దక్కాయి. అవిభాజ్య గ్రూప్‌లో అనిల్‌ అంబానీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా (సీఎఫ్‌ఓ)  వ్యవహరించేవారు. వ్యాపార భారాన్ని భుజాలపై మోయడం కన్నా.. డీల్స్‌ కుదర్చడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు. కాకపోతే విభజన తరవాత భారీ సామ్రాజ్యాన్ని నిర్వహించాల్సిన బాధ్యత మీద పడటంతో.. ఆయన సామర్థ్యాలకు పరీక్ష మొదలైంది. సవాళ్లూ ఒక్కొక్కటిగా ఎదురవటం మొదలెట్టాయి. వ్యాపార విస్తరణ కాంక్షతో సంబంధం లేని రంగాల్లోకి కూడా చొచ్చుకుపోయారు అనిల్‌. చివరకు అప్పుల భారం పేరుకుపోయిన ఆర్‌కామ్‌ రూపంలో సంక్షోభం బయటపడింది. వచ్చే ఆదాయాలు వడ్డీలు కట్టడానికి కూడా సరిపోని పరిస్థితుల్లోకి గ్రూప్‌ దిగజారిపోయింది. ముంబైలో తొలి మెట్రో లైన్‌ నిర్మించిన రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ... గతేడాది ఆగస్టులో బాండ్లను చెల్లించలేక చేతులెత్తేసింది. 2008లో రికార్డ్‌ ఐపీవోకి వచ్చిన రిలయన్స్‌ పవర్‌ షేరు.. అప్పట్నుంచీ పడుతూనే ఉంది. కాస్త లాభసాటిగా ఉండే ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ విభాగం రిలయన్స్‌ క్యాపిటల్‌కి కూడా కష్టాలు తప్పలేదు. మొత్తానికి సంక్షోభంలోకి పడిపోయిన కొన్ని గ్రూప్‌ కంపెనీలను చూస్తే..

ఆర్‌కామ్‌: కాల్‌ డిస్కనెక్ట్‌..
2010లో 17% మార్కెట్‌ వాటాతో దేశీ టెలికంలో ఆర్‌కామ్‌ రెండో స్థానంలో ఉండేది. 2016లో అన్న ముకేశ్‌ ఎంట్రీ తర్వాత ఇది పదవ స్థానానికి పడిపోయి.. టాప్‌ కంపెనీల లిస్టు నుంచి తప్పుకుంది. ఒకప్పుడు రూ.1.7 లక్షల కోట్ల మార్కెట్‌ విలువతో అగ్రస్థానంలో వెలుగొందిన ఆర్‌కామ్‌ ఇప్పుడు రూ.45 వేల కోట్ల పైచిలుకు రుణ భారంలో ఉంది. చివరికి ప్రధానమైన మొబైల్‌ వ్యాపారాన్ని అన్న కంపెనీకే అమ్మేసినా.. స్పెక్ట్రం బాకీల వివాదంతో డీల్‌ ముందుకు సాగడం లేదు. బాకీలు ఎగ్గొట్టినందుకు కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలంటూ ఎరిక్సన్‌ వంటి కంపెనీలు కోర్టులను ఆశ్రయించాయి. 1.8 బిలియన్‌ డాలర్ల విదేశీ రుణాన్ని వసూలు చేసుకునేం దుకు చైనా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ కూడా దివాలా పిటిషన్‌ వేసింది.

సినిమా... అట్టర్‌ ఫ్లాప్‌
ఒకప్పటి సినీతార టీనా మునీమ్‌ను వివాహం చేసుకున్న అనిల్‌ అంబానీ .. తన అడాగ్‌ గ్రూప్‌ ద్వారా గ్లామర్‌ ప్రపంచ వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టారు. ఫిలిమ్‌ ప్రాసెసింగ్, ప్రొడక్షన్, పంపిణీ రంగాల్లోని యాడ్‌ ల్యాబ్స్‌ సంస్థ కొనుగోలుతో ఆరంభంలో భారీగానే విస్తరించారు. 2008 నాటికి దాదాపు 700 స్క్రీన్స్‌తో దేశంలోనే అతి పెద్ద మల్టీప్లెక్స్‌ ఆపరేటర్‌గా అనిల్‌ ఎదిగారు. కానీ 2014 నాటికి ఈ మీడియా వైభవం తగ్గిపోయింది. రుణాల భారం తగ్గించుకోవడానికి వందల కొద్దీ స్క్రీన్స్‌ను తెగనమ్ముకోవాల్సి వచ్చింది. సంబంధం లేని గ్లామర్‌ బిజినెస్‌లోకి దూకి అనిల్‌ దానిపై దృష్టి పెట్టడం వల్ల ప్రధాన గ్రూప్‌ కంపెనీల పనితీరు దెబ్బతిన్నదనే విమర్శలూ ఉన్నాయి.

అసెట్స్‌ అమ్మకాలకు ఆటంకాలు..
మరోపక్క, అప్పుల భారాలను తగ్గించుకోవడానికి అనిల్‌ అంబానీ పెద్ద ఎత్తున అసెట్స్‌ను విక్రయిస్తున్నారు. ఇప్పటికే సిమెంట్, టెలికం టవర్స్‌ మొదలైన వాటిని అమ్మేశారు. కానీ.. ఒక్కో వ్యాపార విభాగంలో ఒక్కో సమస్య కారణంగా అసెట్స్‌ విక్రయం పూర్తి స్థాయిలో ముందుకు జరగడం లేదు.

రూ. 1,00,000 కోట్లు..
2018 మార్చి ఆఖరు నాటికి అడాగ్‌ రుణభారం ఇది. ఏటా వడ్డీల కిందే రూ. 10,000 కోట్లు.  

రూ. 4,00,000 కోట్లు..
గరిష్ట స్థాయిలో అడాగ్‌ గ్రూప్‌లోని 5 ప్రధాన సంస్థల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌. ప్రస్తుతం రూ. 50 వేల కోట్ల కన్నా తక్కువకి పడిపోయింది.

రక్షణ... బ్యాక్‌ ఫైర్‌!
ఉన్న సమస్యలు సరిపోవన్నట్లు.. అనిల్‌ అంబానీ 2016లో పిపావవ్‌ మెరైన్‌ అండ్‌ ఆఫ్‌షోర్‌ (రిలయన్స్‌ నేవల్‌గా పేరు మారింది) యాజమాన్య వాటాలను కొనుక్కున్నారు. ఇది భారతీయ నేవీ కోసం యుద్ధనౌకల నిర్మాణం, మరమ్మతుల సర్వీసులు అందిస్తుంది. సమస్యల్లో ఉన్న ఇన్‌ఫ్రా నుంచి పుష్కలమైన అవకాశాలున్న డిఫెన్స్‌ వైపుగా వెడితే అడాగ్‌ను కాపాడుకోవచ్చని అనిల్‌ భావించారు. కానీ, ఈ ప్రయోగమూ దెబ్బతింది. అయినా.. అసలు భారీ నష్టాలు, అప్పులతో కుదేలైన ఈ సంస్థను ఎందుకు కొన్నారనేది ఎవరికీ అర్థం కాలేదు. రాఫెల్‌ యుద్ధ విమానాలకు సంబంధించి ఫ్రాన్స్‌ కంపెనీ డస్సాల్ట్‌తో ఈ కంపెనీ జట్టు కట్టడంపై ప్రస్తుతం వివాదం నడుస్తోంది. అనిల్‌ అంబానీకి మేలు చేసేందుకు ప్రభుత్వమే ఈ రెండింటి మధ్య డీల్‌ కుదిర్చిందంటూ విపక్షాలు విమర్శల దాడి చేస్తున్నాయి.

45 బిలియన్‌ డాలర్ల వ్యత్యాసం..
ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ గణాంకాల ప్రకారం 2007లో అనిల్‌ సంపద 45 బిలియన్‌ డాలర్లు. అన్న ముకేశ్‌ సంపద 49 బిలియన్‌ డాలర్లు. ఫాస్ట్‌ ఫార్వర్డ్‌ చేసి 2018కి వస్తే ఫోర్బ్స్‌ ఇండియా కుబేరుల లిస్టులో ముకేశ్‌ 47.3 బిలియన్‌ డాలర్లతో అగ్రస్థానంలో ఉండగా.. 2.44 బిలియన్‌ డాలర్ల సంపదతో అనిల్‌ 66వ స్థానానికి పడిపోయారు.

అసలెక్కడ తేడా కొట్టింది..?
కేవలం దశాబ్దం కాలంలో అనిల్‌ సామ్రాజ్యం కుప్పకూలడానికి దారి తీసిన కారణాలేంటి. డీల్‌ మేకర్‌గా, వ్యాపార నిర్వహణలో ఇన్వెస్టర్ల నమ్మకం చూరగొన్న అనిల్‌ అంబానీ గ్రాఫ్‌ ఎందుకిలా పడిపోయింది? 2008లో రికార్డు స్థాయిలో రిలయన్స్‌ పవర్‌ రూ.11,500 కోట్ల నిధుల కోసం ఐపీఓకు వచ్చినపుడు... అది రికార్డు స్థాయిలో 70 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయింది. మరలాంటప్పుడు.. ఎక్కడ తేడా కొట్టింది? నిర్వహణ లోపమా? సమర్థమంతమైన టీమ్‌ లేకపోవడం వల్లా? లేదా ఒకదానితో మరొక దానికి సంబంధం లేకుండా కుప్పతెప్పలుగా కంపెనీలు పెట్టేయడం వల్లా? లేదా ఎకాయెకిన ఆకాశానికి నిచ్చెనలేసేయాలన్న అత్యుత్సాహంతో దొరికిన చోటల్లా అడ్డగోలుగా అప్పులు చేసేసి.. రుణభారం పెంచేసుకోవడం వల్లా? వ్యాపార పరిస్థితులు పూర్తిగా దెబ్బతినడం వల్లా? తరచి చూస్తే సామ్రాజ్యాన్ని కుప్పకూల్చిన ప్రధాన కారణాల గురించి వెతుక్కుంటూ పోతే అంతు ఉండదన్నది పరిశీలకుల అభిప్రాయం.

అయితే, అన్నింటికీ వ్యాపార పరిస్థితులు బాగా లేకపోవడం, దురదృష్టం అనుకోవడానికి ఉండదని.. ఆయన ప్రారంభించిన అనేక కంపెనీలే ఒకదాన్ని మరొకటి దెబ్బతీశాయని.. వాటాదారుల ప్రయోజనాలను ఘోరంగా దెబ్బతీశాయని విమర్శలు వస్తున్నాయి. కాస్తంత ఇబ్బందికరమైనదే అయినా.. సోషల్‌ మీడియా యాప్స్‌లో అన్నదమ్ములపై ఒక సెటైర్‌ కూడా ప్రచారంలోకి వచ్చింది. అన్న ముకేశ్‌ అంటే ’ము–క్యాష్‌’ (డబ్బుల మూట) అని, తమ్ముడు అనిల్‌ అంటే ’అ–నిల్‌’ (సున్నా) అంటూ వ్యంగ్యోక్తులు కూడా నడిచాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement