న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) అధినేత అనిల్ అంబానీపై దాదాపు రూ. 1,200 కోట్ల రుణాల ఎగవేతలకు సంబంధించి ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ వేసిన కేసులో మధ్యంతర పరిష్కార నిపుణుడి (ఆర్‌పీ)ని నియమిస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ఇచ్చిన ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు గురువారం స్టే ఇచ్చింది. అయితే ఈ కేసులో ఆయన ఆస్తులపై తీవ్ర ఆంక్షలు విధించింది. వాటిని బదలాయించడంగానీ లేక విక్రయించడంగానీ లేదా తాకట్టు పెట్టడంకానీ చేయరాదని స్పష్టం చేసింది. ఆస్తులకు సంబంధించి ఆయన ప్రయోజనాల్లో ఎటువంటి మార్పులూ జరగరాదని ఆదేశించింది.
జస్టిస్ విపిన్ సంఘీ, రజ్‌నీష్‌లతో కూడిన త్రిసభ్య ధర్మానసం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో తమ వాదనలు తెలియజేయాలని ఇన్సా ల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ), ఎస్‌బీఐలకు నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను అక్టోబర్ 6కు వాయిదావేస్తూ, ఆలోపు తమ వాదనలు తెలపాలని ప్రతివాదులకు ఆదేశాలు ఇచ్చింది. అయితే కంపెనీలపై ఈ లోపు తగిన న్యాయపరమైన చర్యలు కొనసాగుతాయని, ఐబీసీ పార్ట్ 3 కింద అంబానీ పిటిషన్ విషయంలో మాత్రమే స్టే విధిస్తున్నామని కోర్టు స్పష్టం చేసింది.
వివరాల్లోకి వెడితే.. అనిల్ అంబానీ గ్రూప్ (అడాగ్)లో భాగమైన ఆర్‌కామ్, రిలయన్స్ టెలికం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఆర్‌టీఐఎల్)కు 2016 ఆగస్టులో ఎస్‌బీఐ రుణ సదుపాయం కల్పించింది. ఆర్‌కామ్‌కు రూ. 565 కోట్లు, ఆర్‌టీఐఎల్‌కు రూ. 635 కోట్లు రుణంగా అందించింది. 2016 సెప్టెంబర్‌లో అనిల్ అంబానీ వ్యక్తిగత పూరీకత్తునిచ్చారు. అయితే, 2016 ఆగస్టు నుంచి వర్తింపజేస్తూ ఆర్‌కామ్, ఆర్‌ఐటీఎల్ ఖాతాలను 2017లో మొండిపద్దుల కింద బ్యాంకులు వర్గీకరించాయి. దీంతో అనిల్ అంబానీ ఇచ్చిన వ్యక్తిగత పూచీకత్తును 2018 జనవరిలో ఎస్‌బీఐ రుణ బాకీల కింద జప్తు చేసుకోవాలని నిర్ణయించింది.
తదుపరి అనిల్ అంబానీకి నోటీసులు కూడా జారీ చేసినప్పటికీ స్పందన రాలేదు. ఈలోగా ఆర్‌కామ్‌నకు ఇచ్చిన రూ. 5,447 కోట్లు వసూలు చేసుకునేందుకు చైనా బ్యాంకులకు బ్రిటన్ కోర్టుల నుంచి అనుమతులు లభించాయి. ఒకవేళ చైనా బ్యాంకులు కూడా అనిల్ అంబానీ ఇచ్చిన వ్యక్తిగత పూచీకత్తులపై చర్యలు ప్రారంభిస్తే పరిస్థితి సంక్లిష్టంగా మారుతుందని ఎస్‌బీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. దివాలా ప్రక్రియకు సమాంతరంగా గ్యారెంటర్‌పై కూడా విచారణ జరపవచ్చని నిబంధనల్లో స్పష్టంగా ఉందని తన వాదనల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో మధ్యంతర పరిష్కార నిపుణుడి (ఆర్‌పీ)ని నియమిస్తూ ఎన్‌సీఎల్‌టీ ఈ నెల 20న ఆదేశాలు ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment