ఐఎస్‌డీ కాల్ రేట్లు తగ్గే చాన్స్...
న్యూఢిల్లీ: అంతర్జాతీయ కాల్ ధరలు తగ్గనున్నాయి. ఇంటర్నేషనల్ సబ్‌స్క్రైబర్ డయలింగ్(ఐఎస్‌డీ)కు సంబంధించి దేశీయ టెలికాం సంస్థలకు ఇంటర్నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్(ఐఎల్‌డీఓ)లు చెల్లించే యాక్సెస్ చార్జీలను ట్రాయ్ ఖరారు చేసింది. ఈ యాక్సెస్ చార్జీలు వైర్‌లెస్ సర్వీసులకు నిమిషానికి 40 పైసలు, వైర్‌లైన్ సర్వీసులకు నిమిషానికి రూ.1.20గా ట్రాయ్ నిర్ణయించింది.
ఇప్పటివరకూ ఉన్న విధానంలో ఎవరైనా వినియోగదారులు ఐఎస్‌డీ కాల్స్ చేయాలనుకుంటే, ఐఎల్‌డీఓను సొంతంగా ఎంచుకోవడానికి లేదు. యాక్సెస్ ప్రొవైడర్స్‌పై ఆధారపడి ఉండాల్సి వచ్చేది. తాజా ట్రాయ్ నిబంధనల ప్రకారం, వినియోగదారులు కాలింగ్ కార్డ్స్‌ను ఏ ఐఎల్‌డీఓ నుంచైనా కొనుగోలు చేయవచ్చు. లాంగ్ డిస్టెన్స్ సెక్టర్‌లో ఉన్న పోటీ కారణంగా వినియోగదారులకు తక్కువ ధరలకే ఈ కార్డ్స్ లభిస్తాయని అంచనా. కాలింగ్ కార్డ్ సర్వీసులకు సంబంధించి ఆదాయాన్ని పంచుకునే ఒప్పందంపై ట్రాయ్ గత నవంబర్‌లోనే ఒక సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. తుది నిబంధనలను మంగళవారం వెల్లడించింది.
ఐఎస్‌డీ సర్వీసులందించడానికి 27 ఐఎల్‌డీఓలు, ఎస్‌టీడీ సర్వీసులందజేయడానికి 34 నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్స్ రంగంలో ఉన్నాయి. వీటిలో కొన్ని ఎయిర్‌టెల్, ఆర్‌కామ్, వొడాఫోన్, బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెందినవి. ఇంటర్నేషనల్ లాంగ్ డిస్టెన్స్, నేషనల్ లాంగ్ డిస్టెన్స్ టెలికాం సేవలందిచేందుకు లెసైన్స్ ఉన్న కంపెనీలకు నేరుగా కస్టమర్లకే కాలింగ్ కార్డ్స్ జారీ చేయడానికి కేంద్రం అనుమతినిచ్చింది. పోటీని పెంచి తక్కువ ధరలకే సేవలందేలా చేయడమే ఈ చర్యల ప్రధానోద్దేశం.