ISD calling
-
కేంద్రం కీలక నిర్ణయం! కాల్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ కాల్స్ వివరాలన్నీ..!
న్యూఢిల్లీ: సాధారణ నెట్‌వర్క్‌లతో పాటు ఇంటర్నెట్ ద్వారా ఇంటర్నేషనల్ కాల్స్, శాటిలైట్ ఫోన్ కాల్స్, కాన్ఫరెన్స్ కాల్స్, మెసేజీల సర్వీసులను అందించే సంస్థలు కూడా ఇకపై ఆ వివరాలను రెండేళ్ల పాటు తప్పనిసరిగా నిల్వ చేయాల్సి రానుంది. టెలికం శాఖ ఈ మేరకు సర్క్యులర్లను జారీ చేసింది. భద్రతా కారణాల రీత్యా తర్వాత ఎప్పుడైనా అవసరమైతే వీటిని సమీక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. నిల్వ చేయాల్సిన కాల్ డేటా రికార్డుల పరిధిని ఇంటర్నెట్ కాల్స్‌కు కూడా పెంచుతూ ఏకీకృత లైసెన్సు(యూఎల్) నిబంధనలకు టెలికం శాఖ డిసెంబర్లో సవరణలు చేసింది. దీనికి కొనసాగింపుగా టెల్కోలతో పాటు వాయిస్ మెయిల్, ఆడియోటెక్స్, యూనిఫైడ్ మెసేజింగ్ సర్వీస్ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకునే సంస్థలకు కూడా వర్తించేలా తాజా నిబంధనలతో జనవరి 27న టెలికం విభాగం సర్క్యులర్లు జారీ చేసింది. శాటిలైట్ ఫోన్ సేవలు, డేటా సర్వీసులు అందించేందుకు లైసెన్సు పొందిన బీఎస్ఎన్ఎల్కు కూడా ఇదే తరహా సవరణను వర్తింపచేస్తూ మరో సర్క్యులర్ జారీ చేసింది. ఈ తరహా లైసెన్సులు తీసుకున్న టాటా కమ్యూనికేషన్స్, సిస్కోకు చెందిన వెబెక్స్, ఏటీఅండ్‌టీ గ్లోబల్ నెట్వర్క్ మొదలైన వాటికి ఈ సవరణలు వర్తించనున్నాయి. శాటిలైట్ ఫోన్ సర్వీసులు కాకుండా మిగతా అన్ని రకాల టెలికం సర్వీసులు అందించే భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ వంటి కంపెనీలను ఏకీకృత లైసెన్స్ హోల్డర్లుగా పరిగణిస్తారు. (చదవండి: భారత కంపెనీల జోరు..! బొక్కబోర్లపడ్డ చైనా..!) -
ఐఎస్డీ కాల్ రేట్లు తగ్గే చాన్స్...
న్యూఢిల్లీ: అంతర్జాతీయ కాల్ ధరలు తగ్గనున్నాయి. ఇంటర్నేషనల్ సబ్‌స్క్రైబర్ డయలింగ్(ఐఎస్డీ)కు సంబంధించి దేశీయ టెలికాం సంస్థలకు ఇంటర్నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్(ఐఎల్డీఓ)లు చెల్లించే యాక్సెస్ చార్జీలను ట్రాయ్ ఖరారు చేసింది. ఈ యాక్సెస్ చార్జీలు వైర్లెస్ సర్వీసులకు నిమిషానికి 40 పైసలు, వైర్‌లైన్ సర్వీసులకు నిమిషానికి రూ.1.20గా ట్రాయ్ నిర్ణయించింది. ఇప్పటివరకూ ఉన్న విధానంలో ఎవరైనా వినియోగదారులు ఐఎస్డీ కాల్స్ చేయాలనుకుంటే, ఐఎల్డీఓను సొంతంగా ఎంచుకోవడానికి లేదు. యాక్సెస్ ప్రొవైడర్స్‌పై ఆధారపడి ఉండాల్సి వచ్చేది. తాజా ట్రాయ్ నిబంధనల ప్రకారం, వినియోగదారులు కాలింగ్ కార్డ్స్‌ను ఏ ఐఎల్డీఓ నుంచైనా కొనుగోలు చేయవచ్చు. లాంగ్ డిస్టెన్స్ సెక్టర్లో ఉన్న పోటీ కారణంగా వినియోగదారులకు తక్కువ ధరలకే ఈ కార్డ్స్ లభిస్తాయని అంచనా. కాలింగ్ కార్డ్ సర్వీసులకు సంబంధించి ఆదాయాన్ని పంచుకునే ఒప్పందంపై ట్రాయ్ గత నవంబర్లోనే ఒక సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. తుది నిబంధనలను మంగళవారం వెల్లడించింది. ఐఎస్డీ సర్వీసులందించడానికి 27 ఐఎల్డీఓలు, ఎస్టీడీ సర్వీసులందజేయడానికి 34 నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్స్ రంగంలో ఉన్నాయి. వీటిలో కొన్ని ఎయిర్టెల్, ఆర్‌కామ్, వొడాఫోన్, బీఎస్ఎన్ఎల్కు చెందినవి. ఇంటర్నేషనల్ లాంగ్ డిస్టెన్స్, నేషనల్ లాంగ్ డిస్టెన్స్ టెలికాం సేవలందిచేందుకు లెసైన్స్ ఉన్న కంపెనీలకు నేరుగా కస్టమర్లకే కాలింగ్ కార్డ్స్ జారీ చేయడానికి కేంద్రం అనుమతినిచ్చింది. పోటీని పెంచి తక్కువ ధరలకే సేవలందేలా చేయడమే ఈ చర్యల ప్రధానోద్దేశం.