ఆర్కామ్-ఎయిర్సెల్ విలీనానికి ఓకే | Anil Ambani's RCom Is Merging With Aircel To Become India's Third Largest Telecom Operator | Sakshi
Sakshi News home page

ఆర్కామ్-ఎయిర్సెల్ విలీనానికి ఓకే

Published Thu, Sep 15 2016 12:42 AM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM

ఆర్కామ్-ఎయిర్సెల్ విలీనానికి ఓకే

ఆర్కామ్-ఎయిర్సెల్ విలీనానికి ఓకే

ఒప్పందంపై ఇరు కంపెనీల సంతకాలు
దేశీ టెలికంలో అతిపెద్ద డీల్ 
విలీన సంస్థలో ఆర్‌కామ్,మ్యాక్సిస్‌లకు చెరిసగం వాటా 
రూ.65,000 కోట్ల విలువైన కంపెనీ ఆవిర్భావం   
దేశీయంగా నాలుగో స్థానం

న్యూఢిల్లీ: దేశీ టెలికం రంగంలో అతిపెద్దడీల్ సాకారమైంది. అనిల్ అంబానీ అడాగ్ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్), ఎయిర్‌సెల్‌ల విలీన ఒప్పందం ఎట్టకేలకు కుదిరింది. వైర్‌లెస్ మొబైల్ సర్వీసుల కార్యకలాపాలను విలీనం చేస్తున్నట్లు ఇరు కంపెనీలు బుధవారం ప్రకటించాయి. ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు చేసినట్లు వెల్లడించాయి.తద్వారా రూ.65,000 కోట్ల విలువైన సంస్థగా ఆవిర్భవిస్తున్నట్లు వెల్లడించాయి. అంతేకాదు ఈ డీల్ పూర్తయితే.. వినియోగదారులు, ఆదాయం పరంగా ప్రతిపాదిత విలీన సంస్థ భారత్‌లో నాలుగో అతిపెద్ద టెలికం ఆపరేటర్‌గా నిలుస్తుంది. ఆదాయ పరంగా 12 ప్రధాన సర్కిళ్లలో మూడో స్థానానికి చేరుతామని ఆర్‌కామ్, ఎంసీబీలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.

విలీనం ఇలా...
ప్రతిపాదిత విలీనం ద్వారా ఆవిర్భవించే కొత్త సంస్థలో ఆర్‌కామ్‌కు... ఎయిర్‌సెల్ ప్రస్తుత యాజమాన్య సంస్థ, మలేసియాకు చెందిన మాక్సిస్ కమ్యూనికేషన్స్ బెర్హాద్(ఎంసీబీ)కు చెరో 50 శాతం చొప్పున వాటాలు ఉంటాయి. డెరైక్టర్ల బోర్డులో ఇరు కంపెనీలకు సమాన ప్రాతినిథ్యం లభిస్తుంది. ఇరు కంపెనీలు తమకున్న రుణాల్లో రూ.14,000 కోట్లను విలీనం తర్వాత ఏర్పాడే కొత్త సంస్థకు బదలాయిస్తాయి. దీంతో కొత్త కంపెనీ మొత్తం రుణ భారం రూ.28,000 కోట్లుగా ఉంటుంది. స్పెక్ట్రం చెల్లింపుల కోసం వెచ్చించాల్సిన రూ.6 వేల కోట్లు దీనికి అదనం.  కాగా, ఈ లావాదేవీ పూర్తయితే, ఆర్‌కామ్ రుణభారంలో రూ.20 వేల కోట్ల మేర తగ్గనుంది(ప్రస్తుత రుణాల్లో దాదాపు 40 శాతం). అదేవిధంగా ఎయిర్‌సెల్ రుణ భారం కూడా రూ.4 వేల కోట్లు దిగిరానుంది.

కొత్తగా ఏర్పడే విలీన సంస్థ ఆస్తులు రూ.65,000 కోట్లుగా, నెట్‌వర్త్ రూ.35,000 కోట్లుగా ఉంటుందని అంచనా. ఇక ఆర్‌కామ్ తన డేటా సెంటర్స్, ఆప్టిక్ ఫైబర్, ఇతర టెలికం ఇన్‌ఫ్రాతో పాటు దేశీ-గ్లోబల్ ఎంటర్‌ప్రైజ్ విభాగంలో వ్యాపారాలను ఈ విలీనంలో చేర్చలేదు. వాటిని తమ బ్రాండ్‌తోనే యథాతథంగా కొనసాగిస్తుంది. అదేవిధంగా రియల్టీ ఆస్తులు కూడా ప్రస్తుత ఆర్‌కామ్ చెంతనే ఉంటాయి. కాగా, రష్యాకు చెందిన సిస్టెమా శ్యామ్ టెలికం(ఎస్‌ఎస్‌టీఎల్/ఎంటీఎస్) వైర్‌లెస్ బిజినెస్‌ను ఆర్‌కామ్ ఇప్పటికే విలీనంచేసుకున్న సంగతి తెలిసిందే. ఎంటీఎస్‌కు ఆర్‌కామ్‌లో 10 శాతం వాటా కొనసాగుతుంది. బోర్డులో మాత్రం ప్రాతినిథ్యం ఉండదు. కాగా, విలీనం తర్వాత భవిష్యత్తు విస్తరణ కోసం ఆర్‌కామ్, ఎంసీబీలు కొత్త సంస్థలో అదనపు ఈక్విటీ నిధులను వెచ్చించేందుకు కట్టుబడి ఉంటాయని సంయుక్త ప్రకటన పేర్కొంది. విలీన లావాదేవీ మొత్తం వచ్చే ఏడాది పూర్తయ్యే అవకాశం ఉంది. గురువారం బీఎస్‌ఈలో ఆర్‌కామ్ షేరు ధర 3 శాతం లాభంతో రూ.51 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిశాఖ డీల్ ప్రకటించారు.

19% స్పెక్ట్రం.. 19 కోట్ల యూజర్లు..
తాజా డీల్‌తో దేశంలో అత్యధిక స్పెక్ట్రం కలిగిన కంపెనీగా కూడా విలీన సంస్థ ఆవిర్భవిస్తుంది. 800; 900; 1,800; 2,100 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లలో కలిపి దేశీ టెలికం పరిశ్రమకు ఉన్న మొత్తం స్పెక్ట్రంలో 19 శాతం దీనికి ఉంటుంది. తద్వారా 2జీ, 3జీ, 4జీ సేవలను దేశవ్యాప్తంగా అందించేందుకు వీలవుతుంది. ప్రస్తుతం ఆర్‌కామ్‌కు 11 కోట్ల మంది మొబైల్ యూజర్లు ఉన్నా రు. సబ్‌స్క్రయిబర్ల పరంగా నాలుగో స్థానంలో ఉంది. ఇక 8.4 కోట్ల మంది యూజర్లతో ఎయిర్‌సెల్ ఐదో స్థానంలో నిలుస్తోంది. ఆర్‌కామ్ మార్కెట్ షేర్ 9.8 శాతం కాగా, ఎయిర్‌సెల్ వాటా 8.5 శాతం. ఇక ఆర్‌కామ్‌లో ఇదివరకు విలీనమైన సిస్టెమా(ఎంటీఎస్) మార్కెట్ వాటా 0.7 శాతంగా ఉంది.

ఎయిర్‌సెల్(ఎంసీబీ)తో భాగస్వామ్యం ద్వారా భారత్ టెలికం రంగంలో అతిపెద్ద విలీనాన్ని సాకారం చేయగలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికే సిస్టెమా(ఎస్‌ఎస్‌టీఎల్)ను ఆర్‌కామ్ చేజిక్కించుకుంది. ఇప్పుడు ఎయిర్‌సెల్‌తో విలీనం ద్వారా ఎంసీబీతో 50:50 జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ లావాదేవీ ద్వారా ఆర్‌కామ్, ఎంసీబీ వాటాదారులకు దీర్ఘకాలంలో మరింత మెరుగైన విలువను సృష్టించనున్నాం. - అనిల్ అంబానీ, అడాగ్ గ్రూప్ చైర్మన్

భారత్‌లో పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామనేందుకు ఆర్‌కామ్‌తో విలీనం డీల్ మరో నిదర్శనం. 2006లో మేం ఎయిర్‌సెల్‌ను కొనుగోలు చేసినప్పటినుంచి ఇక్కడ రూ.35,000 కోట్లకు పైగానే పెట్టుబడులను వెచ్చించాం. ఇది ఒక్క టెలికం రంగంలోనే కాకుండా.. భారత్‌కు ఇప్పటివరకూ వచ్చిన అతిపెద్ద విదేశీ పెట్టుబడుల్లో ఇది ఒకటిగా నిలుస్తోంది.  - మ్యాక్సిస్ కమ్యూనికేషన్స్ బెర్హాద్(ఎంసీబీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement