Maxis
-
అగమ్యగోచరంగా 5000 మంది ఉద్యోగులు
న్యూఢిల్లీ : రుణభారంతో మూత పడే దిశగా వెళ్లిన ఎయిర్‌సెల్ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 5000 మందికి పైగా ఉద్యోగులకు ఈ కంపెనీ వార్నింగ్ ఇచ్చింది. తీవ్ర పోటీకర వాతావరణంలో నిధులు సమకూరడం క్లిష్టతరంగా మారిందని, ఈ క్రమంలో ఉద్యోగులు ప్రమాదకర పరిస్థితుల్లో పడబోతున్నట్టు కంపెనీ హెచ్చరించింది. కొన్ని రోజుల నుంచి నిధులు సమకూరడం లేదని, ప్రస్తుతం వ్యాపార కార్యకలాపాల నుంచే నిధులు రాబడుతున్నామని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కైజాద్ హేర్జీ చెప్పారు. మాతృ సంస్థ మ్యాక్సిస్‌కు చెందిన ఈ కంపెనీకి ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న పోటీకర వాతావరణం తీవ్రంగా దెబ్బకొడుతోందని, రెవెన్యూలు, లాభాలు అన్నీ కొట్టుకుపోతున్నాయన్నారు. వచ్చే రోజుల్లో మరింత క్లిష్టతరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రాబోతున్న క్లిష్టకర పరిస్థితుల్లో కంపెనీ పరిస్థితిని రివ్యూ చేయడానికి బోర్డు రీగ్రూప్ అవబోతుంది. పలువురు డైరెక్టర్లు కంపెనీ నుంచి వైదొలగడంతో, వారి స్థానంలో కంపెనీ బోర్డు సందీప్ వాట్స్, ప్రకాశ్ మిశ్రా, లక్ష్మి సుబ్రహ్మణ్యంను నియమించింది. వాటాదారులతో కూడా బోర్డు చర్చలు జరుపుతోంది. సుమారు రూ. 15,500 కోట్ల రుణాలు పేరుకుపోవడంతో కంపెనీ త్వరలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముందు దివాలా పిటిషన్ దాఖలు చేయనున్నట్టు కూడా రిపోర్టులు వస్తున్నాయి. తమ ఆర్థిక పరిస్థితితో లక్ష కొద్దీ కస్టమర్లు ప్రభావితమవుతారని హేర్జీ పేర్కొన్నారు. కంపెనీకి ప్రస్తుతం 85 మిలియన్ మంది కస్టమర్లున్నారు. ఆరు సర్కిళ్లలో సర్వీసులను కంపెనీ ఇటీవలే ఆపివేసింది. కాగ టెలికం రంగంలో సంచలనం సృష్టిస్తూ.. 2016 సెప్టెంబర్‌లో చౌక చార్జీలతో రిలయన్స్ జియో ఎంట్రీ ఇచ్చాక.. మూతబడుతున్న కంపెనీల్లో ఎయిర్‌సెల్ నాలుగోది కానుంది. జియో రాకతో టెలికం పరిశ్రమ ఆదాయాలు సగానికి పడిపోగా.. టారిఫ్‌లు సైతం గణనీయంగా క్షీణించాయి. -
ఆర్‌కామ్-ఎయిర్‌సెల్ విలీనానికి ఓకే
ఒప్పందంపై ఇరు కంపెనీల సంతకాలు • దేశీ టెలికంలో అతిపెద్ద డీల్ • విలీన సంస్థలో ఆర్‌కామ్,మ్యాక్సిస్లకు చెరిసగం వాటా • రూ.65,000 కోట్ల విలువైన కంపెనీ ఆవిర్భావం • దేశీయంగా నాలుగో స్థానం న్యూఢిల్లీ: దేశీ టెలికం రంగంలో అతిపెద్దడీల్ సాకారమైంది. అనిల్ అంబానీ అడాగ్ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్), ఎయిర్‌సెల్‌ల విలీన ఒప్పందం ఎట్టకేలకు కుదిరింది. వైర్లెస్ మొబైల్ సర్వీసుల కార్యకలాపాలను విలీనం చేస్తున్నట్లు ఇరు కంపెనీలు బుధవారం ప్రకటించాయి. ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు చేసినట్లు వెల్లడించాయి.తద్వారా రూ.65,000 కోట్ల విలువైన సంస్థగా ఆవిర్భవిస్తున్నట్లు వెల్లడించాయి. అంతేకాదు ఈ డీల్ పూర్తయితే.. వినియోగదారులు, ఆదాయం పరంగా ప్రతిపాదిత విలీన సంస్థ భారత్‌లో నాలుగో అతిపెద్ద టెలికం ఆపరేటర్‌గా నిలుస్తుంది. ఆదాయ పరంగా 12 ప్రధాన సర్కిళ్లలో మూడో స్థానానికి చేరుతామని ఆర్‌కామ్, ఎంసీబీలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. విలీనం ఇలా... ప్రతిపాదిత విలీనం ద్వారా ఆవిర్భవించే కొత్త సంస్థలో ఆర్‌కామ్‌కు... ఎయిర్‌సెల్ ప్రస్తుత యాజమాన్య సంస్థ, మలేసియాకు చెందిన మాక్సిస్ కమ్యూనికేషన్స్ బెర్హాద్(ఎంసీబీ)కు చెరో 50 శాతం చొప్పున వాటాలు ఉంటాయి. డెరైక్టర్ల బోర్డులో ఇరు కంపెనీలకు సమాన ప్రాతినిథ్యం లభిస్తుంది. ఇరు కంపెనీలు తమకున్న రుణాల్లో రూ.14,000 కోట్లను విలీనం తర్వాత ఏర్పాడే కొత్త సంస్థకు బదలాయిస్తాయి. దీంతో కొత్త కంపెనీ మొత్తం రుణ భారం రూ.28,000 కోట్లుగా ఉంటుంది. స్పెక్ట్రం చెల్లింపుల కోసం వెచ్చించాల్సిన రూ.6 వేల కోట్లు దీనికి అదనం. కాగా, ఈ లావాదేవీ పూర్తయితే, ఆర్‌కామ్ రుణభారంలో రూ.20 వేల కోట్ల మేర తగ్గనుంది(ప్రస్తుత రుణాల్లో దాదాపు 40 శాతం). అదేవిధంగా ఎయిర్‌సెల్ రుణ భారం కూడా రూ.4 వేల కోట్లు దిగిరానుంది. కొత్తగా ఏర్పడే విలీన సంస్థ ఆస్తులు రూ.65,000 కోట్లుగా, నెట్‌వర్త్ రూ.35,000 కోట్లుగా ఉంటుందని అంచనా. ఇక ఆర్‌కామ్ తన డేటా సెంటర్స్, ఆప్టిక్ ఫైబర్, ఇతర టెలికం ఇన్ఫ్రాతో పాటు దేశీ-గ్లోబల్ ఎంటర్ప్రైజ్ విభాగంలో వ్యాపారాలను ఈ విలీనంలో చేర్చలేదు. వాటిని తమ బ్రాండ్‌తోనే యథాతథంగా కొనసాగిస్తుంది. అదేవిధంగా రియల్టీ ఆస్తులు కూడా ప్రస్తుత ఆర్‌కామ్ చెంతనే ఉంటాయి. కాగా, రష్యాకు చెందిన సిస్టెమా శ్యామ్ టెలికం(ఎస్ఎస్టీఎల్/ఎంటీఎస్) వైర్లెస్ బిజినెస్‌ను ఆర్‌కామ్ ఇప్పటికే విలీనంచేసుకున్న సంగతి తెలిసిందే. ఎంటీఎస్కు ఆర్‌కామ్‌లో 10 శాతం వాటా కొనసాగుతుంది. బోర్డులో మాత్రం ప్రాతినిథ్యం ఉండదు. కాగా, విలీనం తర్వాత భవిష్యత్తు విస్తరణ కోసం ఆర్‌కామ్, ఎంసీబీలు కొత్త సంస్థలో అదనపు ఈక్విటీ నిధులను వెచ్చించేందుకు కట్టుబడి ఉంటాయని సంయుక్త ప్రకటన పేర్కొంది. విలీన లావాదేవీ మొత్తం వచ్చే ఏడాది పూర్తయ్యే అవకాశం ఉంది. గురువారం బీఎస్ఈలో ఆర్‌కామ్ షేరు ధర 3 శాతం లాభంతో రూ.51 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిశాఖ డీల్ ప్రకటించారు. 19% స్పెక్ట్రం.. 19 కోట్ల యూజర్లు.. తాజా డీల్‌తో దేశంలో అత్యధిక స్పెక్ట్రం కలిగిన కంపెనీగా కూడా విలీన సంస్థ ఆవిర్భవిస్తుంది. 800; 900; 1,800; 2,100 మెగాహెర్ట్జ్ బ్యాండ్లలో కలిపి దేశీ టెలికం పరిశ్రమకు ఉన్న మొత్తం స్పెక్ట్రంలో 19 శాతం దీనికి ఉంటుంది. తద్వారా 2జీ, 3జీ, 4జీ సేవలను దేశవ్యాప్తంగా అందించేందుకు వీలవుతుంది. ప్రస్తుతం ఆర్‌కామ్‌కు 11 కోట్ల మంది మొబైల్ యూజర్లు ఉన్నా రు. సబ్స్క్రయిబర్ల పరంగా నాలుగో స్థానంలో ఉంది. ఇక 8.4 కోట్ల మంది యూజర్లతో ఎయిర్‌సెల్ ఐదో స్థానంలో నిలుస్తోంది. ఆర్‌కామ్ మార్కెట్ షేర్ 9.8 శాతం కాగా, ఎయిర్‌సెల్ వాటా 8.5 శాతం. ఇక ఆర్‌కామ్‌లో ఇదివరకు విలీనమైన సిస్టెమా(ఎంటీఎస్) మార్కెట్ వాటా 0.7 శాతంగా ఉంది. ఎయిర్‌సెల్(ఎంసీబీ)తో భాగస్వామ్యం ద్వారా భారత్ టెలికం రంగంలో అతిపెద్ద విలీనాన్ని సాకారం చేయగలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికే సిస్టెమా(ఎస్ఎస్టీఎల్)ను ఆర్‌కామ్ చేజిక్కించుకుంది. ఇప్పుడు ఎయిర్‌సెల్‌తో విలీనం ద్వారా ఎంసీబీతో 50:50 జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ లావాదేవీ ద్వారా ఆర్‌కామ్, ఎంసీబీ వాటాదారులకు దీర్ఘకాలంలో మరింత మెరుగైన విలువను సృష్టించనున్నాం. - అనిల్ అంబానీ, అడాగ్ గ్రూప్ చైర్మన్ భారత్‌లో పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామనేందుకు ఆర్‌కామ్‌తో విలీనం డీల్ మరో నిదర్శనం. 2006లో మేం ఎయిర్‌సెల్‌ను కొనుగోలు చేసినప్పటినుంచి ఇక్కడ రూ.35,000 కోట్లకు పైగానే పెట్టుబడులను వెచ్చించాం. ఇది ఒక్క టెలికం రంగంలోనే కాకుండా.. భారత్‌కు ఇప్పటివరకూ వచ్చిన అతిపెద్ద విదేశీ పెట్టుబడుల్లో ఇది ఒకటిగా నిలుస్తోంది. - మ్యాక్సిస్ కమ్యూనికేషన్స్ బెర్హాద్(ఎంసీబీ) -
మారన్‌కు 742 కోట్ల ముడుపులు
* ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసు చార్జిషీట్లో సీబీఐ ఆరోపణ * ఎయిర్‌సెల్ చీఫ్‌పై ఒత్తిడి చేసి ఆ సంస్థను అమ్ముకునేలా చేశారని వెల్లడి * నిందితులుగా మారన్ సోదరులు సహా ఎనిమిది మంది వ్యక్తులు, సంస్థలు న్యూఢిల్లీ: మలేసియాకు చెందిన మాక్సిస్‌కు ఎయిర్‌సెల్ కంపెనీని అమ్మేసేలా ఆ సంస్థ యాజమాని శివరామకృష్ణన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు అప్పట్లో టెలికం మంత్రిగా ఉన్న దయానిధి మారన్‌కు రూ. 742 కోట్ల ముడుపులు అందాయని సీబీఐ ఆరోపించింది. ఇందులో భాగంగా ఆయన తన అధికారాన్ని ఉపయోగించి దేశవ్యాప్తంగా ఎయిర్‌సెల్ వ్యాపారాలను తొక్కిపెట్టారంది. టూజీ స్పెక్ట్రం స్కాం దర్యాప్తులో వెల్లడైన ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసులో సీబీఐ శుక్రవారం చార్జిషీటు దాఖలు చేసింది. ఇందులో దయానిధి మారన్‌తోపాటు ఆయన సోదరుడు కళానిధి మారన్, సన్డెరైక్ట్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్, మాక్సిస్ కమ్యూనికేషన్ సంస్థ, దాని యజమాని టి.ఆనందకృష్ణన్‌తో పాటు మరో రెండు సంస్థలను నిందితులుగా పేర్కొంది. వీరిపై ఐపీసీ 120బీతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద ఆరోపణలు చేస్తూ... 2జీ కేసులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఓపీ సైనీకి చార్జిషీటును అందజేసింది. 72 పేజీల ఈ చార్జిషీట్లో ఎనిమిది మంది వ్యక్తులు, సంస్థలను నిందితులుగా 151 మందిని సాక్షులుగా చేర్చింది. ఎయిర్‌సెల్ సంస్థ వ్యాపార అవకాశాలను దెబ్బతీసేందుకు మారన్ ప్రయత్నించారని అందులో సీబీఐ పేర్కొంది. ఆ సంస్థకు వివిధ సర్కిళ్లలో లెసైన్సుల మంజూరు, వాటాల మార్పు తదితర అంశాలకు సంబంధించిన ఫైళ్లను.. వివిధ విభాగాల నుంచి అనుమతులు వచ్చినా కూడా కావాలనే ఎనిమిది నెలలకు పైగా పెండింగ్‌లో పెట్టారని వెల్లడించింది. చివరిగా ఎయిర్‌సెల్‌ను మాక్సిస్ సంస్థకు విక్రయించుకునేలా చేశారని.. ఈ విక్రయం జరిగిన వెంటనే లెసైన్సులు, అనుమతులన్నీ జారీ చేశారని తెలిపింది. దీనికి ప్రతిగా మారన్ కుటుంబానికి చెందిన సన్ డెరైక్ట్, సౌత్ ఆసియాల్లోకి మాక్సిస్ సంస్థ వివిధ సంస్థల పేరిట పెట్టుబడుల రూపేణా రూ. 742 కోట్లను ముడుపులుగా అందజేసిందని పేర్కొంది. ఇంకా ఈ కేసుకు సంబంధించి పలు సంస్థలు, వ్యక్తుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించింది. -
‘మారన్‌లపై చార్జిషీట్ నమోదు చేయొచ్చు!’
న్యూఢిల్లీ: ‘ఎయిర్‌సెల్, మాక్సిస్’ ఒప్పందానికి సంబంధించిన కేసులో కేంద్ర టెలికం మాజీ మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధిల మారన్‌లపై చార్జిషీట్ దాఖలు చేసేందుకు అవసరమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని అటార్నీ జనరల్(ఏజీ) ముకుల్ రోహత్గీ అభిప్రాయపడ్డారు. రోహత్గీ నుంచి సోమవారం ఉదయం ఆ అభిప్రాయం అందిందని, దాన్ని సీబీఐ పరిశీలిస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే, ఏజీ అభిప్రాయాన్ని కచ్చితంగా పాటించాల్సిన అవసరం సీబీఐకి లేదన్నాయి. మారన్ సోదరులపై చార్జిషీట్ దాఖలు చేసే విషయంలో దర్యాప్తు బృందానికి, సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హాకు మధ్య భిన్నాభిప్రాయాలు రావడంతో.. ఆ అంశాన్ని ఏజీకి నివేదించారు. చార్జిషీట్‌కు అవసరమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని దర్యాప్తు బృందం పేర్కొనగా.. సాక్ష్యాధారాల్లోని లోపాలను సిన్హా ఎత్తిచూపారు.