మారన్‌కు 742 కోట్ల ముడుపులు
* ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసు చార్జిషీట్‌లో సీబీఐ ఆరోపణ
* ఎయిర్‌సెల్ చీఫ్‌పై ఒత్తిడి చేసి ఆ సంస్థను అమ్ముకునేలా చేశారని వెల్లడి
* నిందితులుగా మారన్ సోదరులు సహా ఎనిమిది మంది వ్యక్తులు, సంస్థలు
న్యూఢిల్లీ: మలేసియాకు చెందిన మాక్సిస్‌కు ఎయిర్‌సెల్ కంపెనీని అమ్మేసేలా ఆ సంస్థ యాజమాని శివరామకృష్ణన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు అప్పట్లో టెలికం మంత్రిగా ఉన్న దయానిధి మారన్‌కు రూ. 742 కోట్ల ముడుపులు అందాయని సీబీఐ ఆరోపించింది. ఇందులో భాగంగా ఆయన తన అధికారాన్ని ఉపయోగించి దేశవ్యాప్తంగా ఎయిర్‌సెల్ వ్యాపారాలను తొక్కిపెట్టారంది. టూజీ స్పెక్ట్రం స్కాం దర్యాప్తులో వెల్లడైన ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసులో సీబీఐ శుక్రవారం చార్జిషీటు దాఖలు చేసింది.
ఇందులో దయానిధి మారన్‌తోపాటు ఆయన సోదరుడు కళానిధి మారన్, సన్‌డెరైక్ట్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్, మాక్సిస్ కమ్యూనికేషన్ సంస్థ, దాని యజమాని టి.ఆనందకృష్ణన్‌తో పాటు మరో రెండు సంస్థలను నిందితులుగా పేర్కొంది. వీరిపై ఐపీసీ 120బీతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద ఆరోపణలు చేస్తూ... 2జీ కేసులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఓపీ సైనీకి చార్జిషీటును అందజేసింది. 72 పేజీల ఈ చార్జిషీట్‌లో ఎనిమిది మంది వ్యక్తులు, సంస్థలను నిందితులుగా 151 మందిని సాక్షులుగా చేర్చింది. ఎయిర్‌సెల్ సంస్థ వ్యాపార అవకాశాలను దెబ్బతీసేందుకు మారన్ ప్రయత్నించారని అందులో సీబీఐ పేర్కొంది.
ఆ సంస్థకు వివిధ సర్కిళ్లలో లెసైన్సుల మంజూరు, వాటాల మార్పు తదితర అంశాలకు సంబంధించిన ఫైళ్లను.. వివిధ విభాగాల నుంచి అనుమతులు వచ్చినా కూడా కావాలనే ఎనిమిది నెలలకు పైగా పెండింగ్‌లో పెట్టారని వెల్లడించింది. చివరిగా ఎయిర్‌సెల్‌ను మాక్సిస్ సంస్థకు విక్రయించుకునేలా చేశారని.. ఈ విక్రయం జరిగిన వెంటనే లెసైన్సులు, అనుమతులన్నీ జారీ చేశారని తెలిపింది. దీనికి ప్రతిగా మారన్ కుటుంబానికి చెందిన సన్ డెరైక్ట్, సౌత్ ఆసియాల్లోకి మాక్సిస్ సంస్థ వివిధ సంస్థల పేరిట పెట్టుబడుల రూపేణా రూ. 742 కోట్లను ముడుపులుగా అందజేసిందని పేర్కొంది. ఇంకా ఈ కేసుకు సంబంధించి పలు సంస్థలు, వ్యక్తుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించింది.