ఎయిర్ సెల్ (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : రుణభారంతో మూత పడే దిశగా వెళ్లిన ఎయిర్‌సెల్ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 5000 మందికి పైగా ఉద్యోగులకు ఈ కంపెనీ వార్నింగ్ ఇచ్చింది. తీవ్ర పోటీకర వాతావరణంలో నిధులు సమకూరడం క్లిష్టతరంగా మారిందని, ఈ క్రమంలో ఉద్యోగులు ప్రమాదకర పరిస్థితుల్లో పడబోతున్నట్టు కంపెనీ హెచ్చరించింది. కొన్ని రోజుల నుంచి నిధులు సమకూరడం లేదని, ప్రస్తుతం వ్యాపార కార్యకలాపాల నుంచే నిధులు రాబడుతున్నామని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కైజాద్ హేర్జీ చెప్పారు. మాతృ సంస్థ మ్యాక్సిస్‌కు చెందిన ఈ కంపెనీకి ప్రస్తుతం మార్కెట్‌లో నెలకొన్న పోటీకర వాతావరణం తీవ్రంగా దెబ్బకొడుతోందని, రెవెన్యూలు, లాభాలు అన్నీ కొట్టుకుపోతున్నాయన్నారు. వచ్చే రోజుల్లో మరింత క్లిష్టతరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రాబోతున్న క్లిష్టకర పరిస్థితుల్లో కంపెనీ పరిస్థితిని రివ్యూ చేయడానికి బోర్డు రీగ్రూప్ అవబోతుంది.
పలువురు డైరెక్టర్లు కంపెనీ నుంచి వైదొలగడంతో, వారి స్థానంలో కంపెనీ బోర్డు సందీప్ వాట్స్, ప్రకాశ్ మిశ్రా, లక్ష్మి సుబ్రహ్మణ్యంను నియమించింది. వాటాదారులతో కూడా బోర్డు చర్చలు జరుపుతోంది. సుమారు రూ. 15,500 కోట్ల రుణాలు పేరుకుపోవడంతో కంపెనీ త్వరలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ముందు దివాలా పిటిషన్ దాఖలు చేయనున్నట్టు కూడా రిపోర్టులు వస్తున్నాయి. తమ ఆర్థిక పరిస్థితితో లక్ష కొద్దీ కస్టమర్లు ప్రభావితమవుతారని హేర్జీ పేర్కొన్నారు. కంపెనీకి ప్రస్తుతం 85 మిలియన్ మంది కస్టమర్లున్నారు. ఆరు సర్కిళ్లలో సర్వీసులను కంపెనీ ఇటీవలే ఆపివేసింది. కాగ టెలికం రంగంలో సంచలనం సృష్టిస్తూ.. 2016 సెప్టెంబర్‌లో చౌక చార్జీలతో రిలయన్స్ జియో ఎంట్రీ ఇచ్చాక.. మూతబడుతున్న కంపెనీల్లో ఎయిర్‌సెల్ నాలుగోది కానుంది. జియో రాకతో టెలికం పరిశ్రమ ఆదాయాలు సగానికి పడిపోగా.. టారిఫ్‌లు సైతం గణనీయంగా క్షీణించాయి.
Comments
Please login to add a commentAdd a comment