గట్టెక్కడానికి ఆర్కామ్ మరో ప్లాన్
గట్టెక్కడానికి ఆర్కామ్ మరో ప్లాన్
Published Mon, Jun 19 2017 6:54 PM | Last Updated on Tue, Sep 5 2017 1:59 PM
న్యూఢిల్లీ: అన్న ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో దెబ్బకు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సంక్షోభంలో ఉన్న ఆర్కాం, ఢిల్లీలోని తన కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టినట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 3.18 లక్షల చదరపు అడుగుల గల ఈ ఆఫీసును ఆర్కామ్ అమ్ముతున్నట్టు వార్తలొస్తున్నాయి. ముంబై, ఢిల్లీలోని క్యాంపస్ లను విక్రయించి, రుణాలు తిరిగి చెల్లించాలని ఆర్కామ్ అంతకముందే భావించింది. వీటి విలువను కూడా లెక్కగట్టే ప్రక్రియను చేపట్టింది. ప్రస్తుతం ఢిల్లీలోని కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టినట్టు తెలుస్తోంది.
అప్పులు విపరీతంగా పెరిగిపోవడంతో ఇటీవలే రిలయన్స్ గ్రూప్ అధినేతగా ఉన్న అనిల్ అంబానీ ఈ ఆర్థిక సంవత్సరం చివరి దాకా ఎలాంటి వేతనం తీసుకోకూడదని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మరో నిర్ణయం ఆర్కామ్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాక గుదిబండలా మారిన ఈ అప్పుల నుంచి గట్టెక్కడానికి ఆర్కామ్ కు బ్యాంకులు డిసెంబర్ దాకా సమయమిచ్చినట్టు ఈ నెల మొదట్లో జరిగిన మీడియా సమావేశంలో అనిల్ అంబానీ చెప్పారు. రుణాన్ని తగ్గించుకునే ప్రణాళికలను బ్యాంకర్లు ఆమోదించారని కూడా చెప్పారు. ఎయిర్ సెల్ విలీనం, బ్రూక్ ఫీల్డ్ కు టవర్ ఆస్తుల విక్రయం ద్వారా 60 శాతం తగ్గిస్తామని రిలయన్స్ గ్రూప్ చైర్మన్ తెలిపారు. కాగ, దాదాపు రూ.45 వేల కోట్ల రూపాయలను ఆర్కామ్ లెండర్లకు బాకీ పడింది.
Advertisement
Advertisement