
ఆర్‌కామ్‌కు డిసెంబర్ వరకు గడువు
అప్పటి వరకు రుణ చెల్లింపులు వాయిదా
⇔ అంగీకరించిన బ్యాంకర్లు
⇔ సెప్టెంబర్ నాటికి రూ.25వేల కోట్ల చెల్లింపులు
⇔ అంతర్జాతీయ వ్యాపార విక్రయాన్ని పరిశీలిస్తాం
⇔ అడాగ్ చైర్మన్ అనిల్ అంబానీ
ముంబై: గత కొన్ని రోజులుగా ప్రతికూల పరిణామాలను ఎదుర్కొంటున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్)కు కాస్తంత ఊరట లభించింది. రుణాల చెల్లింపులకు ఏడు నెలల గడువు లభించింది. వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రూ.45,000 కోట్ల రుణ బకాయిలకు సంబంధించి వాయిదాల్ని సకాలంలో చెల్లించడంలో విఫలమైన ఆర్‌కామ్ రేటింగ్‌ను క్రెడిట్ రేటింగ్ సంస్థలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి తగ్గిస్తుండడంతో సంస్థ చైర్మన్ అనిల్ అంబానీ స్వయంగా రంగంలోకి దిగారు. పరిస్థితి చేయిదాటి పోకుండా చూసేందుకు రుణాలిచ్చిన బ్యాంకర్లతో శుక్రవారం ముంబైలో సమావేశమై చర్చలు జరిపారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనిల్ అంబానీ వివరాలు వెల్ల డించారు.
దేశ, విదేశీ రుణదాతలు వ్యూహాత్మక పునరుద్ధరణ ప్రణాళికకు అంగీకరించారని, రూ.45,000 కోట్ల రుణాలకు సంబంధించి చెల్లింపులకు గాను ఈ ఏడాది డిసెంబర్ వరకు ఏడు నెలల గడువు ఇచ్చినట్టు తెలిపారు. సెప్టెంబర్ నాటికి రూ.20,000 కోట్లకు రుణ భారాన్ని తగ్గించుకుంటామన్నారు. ‘‘రుణాలిచ్చిన సంస్థలు కంపెనీ సాధించిన ప్రగతిని పరిగణనలోకి తీసుకున్నాయి. నూతనంగా వైర్‌లెస్ కంపెనీ ఎయిర్‌కామ్‌ను విడిగా ఏర్పాటుచేయడం, ఎయిర్‌సెల్‌తో ఒప్పందం, ఇన్‌ఫ్రాటెల్‌లో వాటాను కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్ సంస్థకు విక్రయించడడం వంటివన్నీ ఇందులో భాగం. ఈ రెండు లావాదేవీల ద్వారా వచ్చే నిధులతో రూ.25,000 కోట్ల మేర రుణాలను తీర్చేస్తాం. మొత్తం రుణంలో 60 శాతానికి సమానం’’ అని అనిల్ అంబానీ వివరించారు. మిగిలిన రూ.20,000 కోట్ల రుణం సంగతేంటన్న ప్రశ్నకు... అంతర్జాతీయ వ్యాపార విక్రయాన్నీ పరిశీలిస్తామని ఆయన చెప్పారు.
సోదరుడితో సత్సంబంధాలే
సోదరుడు ముకేశ్ అంబానీతో తన సంబంధాలు సహృద్భావంగానే ఉన్నాయని అనిల్ అంబానీ స్పష్టం చేశారు. దీనికి వ్యతిరేకంగా వినిపించే వదంతులన్నీ అర్థంలేనివిగా కొట్టి పడేశారు. ‘‘నా సోదరుడితో నా అనుబంధం సహజంగానే ఉంది. అర్థవంతంగా, పూర్తి గౌరవంగా ఉంటుంది. ఈ విషయంలో ఊహాగానాలు అనవసరం’’ అని అనిల్ అంబానీ తెలిపారు. తండ్రి ధీరూభాయి అంబానీ మరణం తర్వాత దశాబ్దం క్రితం అంబానీ సోదరులు రిలయన్స్ సామ్రాజ్యాన్ని పంచుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఆర్‌కామ్, రిలయన్స్ జియో మధ్య సంబంధాలపై ఎదురైన ప్రశ్నకు... రెండూ వేర్వేరు సంస్థలని, అవి అలానే కొనసాగుతాయని అనిల్ అంబానీ చెప్పారు. ‘‘స్పెక్ట్రం, ఫైబర్, ఇంట్రా సర్కిల్ రోమింగ్, టవర్లు, మరికొన్ని అంశాల్లో వ్యూహాత్మక సహకారం ఉంటుంది. దీనివల్ల వ్యయాలు తగ్గుతాయి’’ అని పేర్కొన్నారు.