
న్యూఢిల్లీ: టెలికం రంగంలో ఇటీవల వరుస కొనుగోళ్లతో దూసుకుపోతున్న భారతి ఎయిర్‌టెల్ .. తాజాగా మరో టెల్కో రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) స్పెక్ట్రంపై దృష్టి సారించింది. 4జీ సేవలకు ఉపయోగపడే 850 మెగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రంతో పాటు ఆర్‌కామ్‌కి చెందిన కొన్ని పరికరాలను కూడా కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్‌కామ్ నుంచి కొంత స్పెక్ట్రం, కొన్ని పరికరాల కొనుగోలుపై తాము ఆసక్తి వ్యక్తం చేసినట్లు ఎయిర్‌టెల్ వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో రిలయన్స్ జియోతో ఎయిర్‌టెల్ పోటీపడనుంది.
దాదాపు రూ. 45,000 కోట్ల మేర రుణభారం పేరుకుపోయిన ఆర్‌కామ్ మొబైల్ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. బకాయిల్లో కొంత మొత్తమైనా రాబట్టుకునేందుకు రుణదాతలు ఆర్‌కామ్‌కి చెందిన అసెట్స్‌ను విక్రయించేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్‌కామ్ టవర్లను కొనుగోలు చేసేందుకు ఇతర టవర్ సంస్థలైన ఇండస్, భారతి ఇన్‌ఫ్రాటెల్, బ్రూక్‌ఫీల్డ్ మొదలైనవి పోటీపడుతున్నట్లు సమాచారం.
ఎయిర్‌టెల్ జోరు..
టెలికం రంగంలో పోటీ తీవ్రమయిన నేపథ్యంలో మరింత స్పెక్ట్రంను చేజిక్కించుకునేందుకు ఎయిర్‌టెల్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. స్పెక్ట్రం హోల్డింగ్‌కి సంబంధించి రిలయన్స్ జియో, త్వరలో విలీనం కాబోయే వొడాఫోన్–ఐడియాలతో దీటుగా నిల్చే దిశగా ఇటీవల కొనుగోళ్ల జోరు పెంచింది. ఈమధ్యే టెలినార్ కార్యకలాపాలను కొనుగోలు చేసిన ఎయిర్‌టెల్.. అటు టాటా టెలీసర్వీసెస్ మొబైల్ కార్యకలాపాలు కూడా విలీనం చేసుకోనుంది. టెలినార్‌తో నగదు రహిత లావాదేవీ ద్వారా ఎయిర్‌టెల్‌కు అదనంగా 4.4 కోట్ల మంది యూజర్లతో పాటు 1,800 మెగాహెట్జ్ బ్యాండ్‌లో 43.4 మెగాహెర్జ్ మేర స్పెక్ట్రం కూడా లభించింది.
అలాగే నగదు, రుణబదిలీ ప్రసక్తి లేని టాటా టెలీ డీల్ ద్వారా ఎయిర్‌టెల్‌కి 19 సర్కిళ్లలో కన్జూమర్ మొబైల్ బిజినెస్ దక్కుతోంది. 4జీకి ప్రధానంగా ఉపయోగపడే 1,800.. 2,100, 850 మెగాహెట్జ్ బ్యాండ్స్‌లో స్పెక్ట్రం కూడా లభిస్తోంది. రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఎయిర్‌సెల్ నుంచి 8 సర్కిళ్లలో 2,300 మెగాహెట్జ్ స్పెక్ట్రంను కొనుగోలు చేసేందుకు కూడా గతేడాదే డీల్ కుదుర్చుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో టికోనా డిజిటల్ కొనుగోలు ద్వారా ఆ సంస్థకి 5 సర్కిళ్లలో ఉన్న 4జీ స్పెక్ట్రం కూడా ఎయిర్‌టెల్ దక్కించుకుంది.
మిగిలేది మూడు కంపెనీలే: సునీల్ మిట్టల్
మరో ఏడాది, రెండేళ్లలో టెలికం రంగంలో మూడే సంస్థలు మిగులుతాయని భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. టెలికంలో సంక్షోభం ఇంకా ఎన్నాళ్లు కొనసాగవచ్చన్న ప్రశ్నకు.. ‘‘కొత్తగా వచ్చిన ఆపరేటరు సయోధ్య సంకేతాలిచ్చేదాకా ఇది కొనసాగుతుంది. అదంతా ఆయనపైనే ఆధారపడి ఉంది. ఆయనకు ఆర్థిక బలం ఉంది... కానీ నంబర్ వన్ స్థానంలోనే ఉండాలని మేమూ కృతనిశ్చయంతో ఉన్నాం. బహుశా 2018 మార్చి లేదా 2019 మార్చి నాటికి.. టెలికం రంగం మూడు సంస్థలకు పరిమితం కావొచ్చు’’ అని సునీల్ పేర్కొన్నారు.
ఇక టాటా టెలీ, టెలినార్ కార్యకలాపాల కొనుగోలుతో వాటి మార్కెట్ వాటాలో తమకు సగభాగం దక్కినట్లు అనుకున్నా కూడా.. తమ నంబర్ వన్ హోదా పదిలంగానే ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో ఐడియా–వొడాఫోన్ డీల్‌తో ఎయిర్‌టెల్ అగ్రస్థానం కోల్పోయే అవకాశాలు లేవన్నారు. 4జీ పైనా, ఎయిర్‌టెల్ బ్యాంక్, మ్యూజిక్ మొదలైన వాటిల్లో పెట్టుబడులు తమకు తోడ్పడగలవని తెలిపారు. మార్జిన్లు, ఆదాయాలు తగ్గిన ప్రస్తుత పరిస్థితుల్లో కూడా తాము ఎంతో కొంత వృద్ధి సాధిస్తూనే ఉన్నామన్నారు. ఆర్‌కామ్ కస్టమర్లలో 45% యూజర్లు ఎయిర్‌టెల్‌కి మారుతున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment