జియోకు పోటీ : ప్లాన్స్ పై ఆర్కామ్ డిస్కౌంట్ ఆఫర్
జియోకు పోటీ : ఆర్కామ్ ఏడాదంతా డిస్కౌంట్
Published Fri, Jun 16 2017 3:30 PM | Last Updated on Tue, Sep 5 2017 1:47 PM
న్యూఢిల్లీ : అన్న ముఖేష్ అంబానీ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో దెబ్బకు తమ్ముడు అనిల్ అంబానీ టెలికాం రిలయన్స్ కమ్యూనికేషన్(ఆర్కామ్) భారీగా అప్పులో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ నష్టాల్లోంచి బయటపడటానికి ఓ వైపు నుంచి వ్యూహాత్మక ప్లాన్స్ అమలు చేస్తూనే.. మరోవైపు నుంచి కొత్త వినియోగదారులను ఆకట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆర్కామ్ తమ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ పై ఏడాది పాటు డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది. ఎంపికచేసిన పోస్టు పెయిడ్ ప్లాన్స్ పై 28 శాతం డిస్కౌంట్ ఇస్తామని తెలిపింది. ఈ కొత్త ఆర్కామ్ ప్లాన్స్ ఢిల్లీ, ముంబై, కర్నాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ లోని 4జీ యూజర్లకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ కొత్త ఆఫర్స్ తో 1జీబీ 4జీ డేటా అతి తక్కువకు రూ.11.1కే అందుబాటులోకి రానుంది. ఈ డిస్కౌంటెడ్ ఆర్కామ్ ప్లాన్స్ కూడా ఎవరైతే కంపెనీ పోర్టల్ rcom-eshop.com ద్వారా సబ్ స్క్రైబ్ అవుతారో వారికి మాత్రమేనని తెలిపింది. ఎంపికచేసిన నెలవారీ ప్లాన్స్ లో ఈ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.
డిస్కౌంట్ తర్వాత నెలవారీ ప్లాన్స్ రూ.333, రూ.499కు అందుబాటులోకి వచ్చాయి. సబ్ స్క్రైబర్ కు ఈ డిస్కౌంటెడ్ ధరలు 12 నెలల పాటు ఆఫర్ చేయనున్నామని, డిస్కౌంట్ విలువ ఏడాదికి రూ.2400గా కంపెనీ పేర్కొంది. రిలయన్స్ జియో రూ.509 ప్లాన్ కు పోటీగా రూ.499 ప్లాన్ ను ఆర్కామ్ ఆఫర్ చేస్తోంది. దీనికింద 30జీబీ 3జీ,4జీ,2జీ డేటా, హోమ్ సర్కిల్ లో అపరిమిత వాయిస్ కాల్స్, 3000 ఉచిత ఎస్ఎంఎస్ లు, ఉచిత ఇన్ కమింగ్, అవుట్ గోయింగ్ రోమింగ్ కాల్స్ అందుబాటులో ఉంటున్నాయి. రూ.333 ప్లాన్ ను జియో రూ.309 ప్యాక్ కు పోటీగా తీసుకొచ్చింది. ఈ ప్లాన్ లో కూడా 30జీబీ 4జీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్ లు, ఉచిత ఇన్ కమింగ్ రోమింగ్ కాల్స్, 1000 అవుట్ గోయింగ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ ను ఆఫర్ చేస్తోంది. అవుట్ గోయింగ్ కాల్స్ పరిమితి దాటితే నిమిషానికి 50 పైసలు వసూలు చేయనుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్లతో తన నెట్ వర్క్ లోకి కొత్త సబ్ స్క్రైబర్లను ఆకట్టుకోవడానికి ఆర్కామ్ ప్రయత్నిస్తోంది. వొడాఫోన్, ఎయిర్ టెల్, జియోల నుంచి వచ్చే పోటీని కూడా అధిగమించాలని చూస్తోంది.
Advertisement
Advertisement