ఆర్‌కామ్ చేతికి ‘సిస్టెమా’ | RCom acquires Sistema's India unit in all-stock deal | Sakshi
Sakshi News home page

ఆర్‌కామ్ చేతికి ‘సిస్టెమా’

Published Tue, Nov 3 2015 12:34 AM | Last Updated on Sun, Sep 3 2017 11:54 AM

ఆర్‌కామ్ చేతికి ‘సిస్టెమా’

ఆర్‌కామ్ చేతికి ‘సిస్టెమా’

ఒప్పందం విలువ దాదాపు రూ. 4,500 కోట్లు
* స్టాక్, స్పెక్ట్రమ్ ఫీజు చెల్లింపు రూపంలో డీల్
న్యూఢిల్లీ: దేశీయంగా నాలుగో అతి పెద్ద టెలికం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్) .. తాజాగా సిస్టెమా శ్యామ్ టెలీసర్వీసెస్‌ను (ఎస్‌ఎస్‌టీఎల్) కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. ఈ ఒప్పంద విలువ దాదాపు 690 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 4,500 కోట్లు)గా ఉంటుందని పరిశ్రమవర్గాల అంచనా.  స్టాక్ మార్పిడి,  రూపంలో ఈ డీల్ ఉంటుందని ఆర్‌కామ్ సోమవారం తెలిపింది.

దీని ప్రకారం సిస్టెమా శ్యామ్ టెలీసర్వీసెస్ (ఎస్‌ఎస్‌టీఎల్)కు ఆర్‌కామ్‌లో 10 శాతం వాటాలు దక్కుతాయి. డీల్ పూర్తి కావడానికి ముందు తనకున్న దాదాపు 500 మిలియన్ డాలర్ల రుణాలను తీర్చేసేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రం ఎస్‌ఎస్‌టీఎల్ ద్వారా వచ్చే స్పెక్ట్రమ్‌కు సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన వాయిదాలను ఏటా రూ. 392 కోట్లు చొప్పున పదేళ్ల పాటు ఆర్‌కామ్ కడుతుంది. సిస్టెమా శ్యామ్ ప్రస్తుతం తొమ్మిది సర్కిల్స్‌లో ఎంటీఎస్ బ్రాండ్ కింద సర్వీసులు అందిస్తోంది.

అనేక సవాళ్లు ఉన్నప్పటికీ దేశీ టెలికం రంగం పురోగమిస్తోందనడానికి రెండు సంస్థల విలీన మే నిదర్శనమని సిస్టెమా ప్రెసిడెంట్ మిఖాయిల్ షమోలిన్ పేర్కొన్నారు. విలీనంతో రెండు కంపెనీలకు పరస్పర ప్రయోజనం చేకూరగలదని ఆర్‌కామ్ సీఈవో గుర్‌దీప్ సింగ్ చెప్పారు. వచ్చే ఏడాది రెండో త్రైమాసికంలో డీల్ పూర్తి కాగలదని అంచనా.
 
ఆర్‌కామ్‌కు ప్రయోజనాలు..
ఈ ఒప్పందంతో ఆర్‌కామ్ ఖాతాలో సుమారు 90 లక్షల కస్టమర్లు, దాదాపు రూ. 1,500 కోట్ల వార్షికాదాయాలు దఖలుపడతాయి. తద్వారా సంస్థ మొత్తం యూజర్ల సంఖ్య 11.8 కోట్లకు చేరుతుంది. అలాగే, 4జీ సేవలకు ఉపయోగపడే 850 మెగాహెట్జ్‌బ్యాండ్ స్పెక్ట్రం కూడా ఆర్‌కామ్‌కు లభిస్తుంది. భారీ ఆదాయాన్నిచ్చే ఢిల్లీ, గుజరాత్ తదితర 8 సర్కిల్స్‌లో సంస్థ లెసైన్సు కాలం సైతం 12 సంవత్సరాల మేర 2021 నుంచి 2033 దాకా పెరుగుతుంది. ఇక డీల్ ముగిసిన తర్వాత ఎస్‌ఎస్‌టీఎల్‌లోని మైనారిటీ ఇన్వెస్టర్లు.. తమ షేర్లకు బదులుగా ప్రో-రేటా ప్రాతిపదికన ఆర్‌కామ్ షేర్లను పొందే వెసులుబాటు ఉంటుంది.

ఎస్‌ఎస్‌టీఎల్‌లో రష్యాకు చెందిన ఏఎఫ్‌కే సిస్టెమాకు 56.68 శాతం, రష్యా ప్రభుత్వానికి 17.14%, భారతీయ సంస్థ శ్యామ్ గ్రూప్‌నకు 23.98% వాటాలు ఉన్నాయి. మిగతా వాటాలు చిన్న ఇన్వెస్టర్ల వద్ద ఉన్నాయి. ఎస్‌ఎస్‌టీఎల్ రుణభారం, ఇతరత్రా చెల్లించాల్సినవి సుమారు రూ. 3,200 కోట్ల మేర ఉండగా, ఆర్‌కామ్ రుణ భారం రూ. 32,000 కోట్లుగా ఉంది. 2014-15లో ఆర్‌కామ్ ఆదాయాలు రూ. 21,423 కోట్లు కాగా, నికర లాభం రూ. 620 కోట్లు. అన్‌లిస్టెడ్ కంపెనీ అయిన ఎస్‌ఎస్‌టీఎల్ 2014 ఆదాయాలు రూ. 1,347 కోట్లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement