![Ericsson seeks jail for RCom Chairman Anil Ambani unless Dues Cleared - Sakshi](/styles/webp/s3/article_images/2019/01/4/Anil%20ambani.gif.webp?itok=4VdcBNTX)
సాక్షి, న్యూఢిల్లీ : రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఛైర్మన్ అనిల్ అంబానీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. అనిల్ అంబానీని నిర్బంధించాలని కోరుతూ స్వీడన్‌కు చెందిన టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ అప్పులు చెల్లించకుండా విదేశాలకు పారిపోకుండా చూడాలని సుప్రీంను కోరింది.
ఆర్‌కాం ఛైర్మన్ అనిల్ అంబానీని జైలుకు పంపి, విదేశాలకు పారిపోకుండా అడ్డుకోవాలని ఎరిక్సన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తద్వారా రూ.550 కోట్ల బాకీని వడ్డీతో సహా చెల్లించేలా చూడాలంటూ గురువారం రెండవ పిటిషన్ దాఖలు చేసింది. అలాగే రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ టెలికాం లిమిటెడ్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్ అనిల్ సహా ఈ కంపెనీలకు చెందిన ఇతర అధికారులు దేశం విడిచిపోకుండా నివారించేలా హోం మంత్రిత్వశాఖ ద్వారా చర్యలు తీసుకోవాలని కోరింది. అంతేకాదు గడువులోపు బాకీ చెల్లించకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకుగాను అనిల్ అంబానీని జైలుకు పంపాలని డిమాండ్ చేసింది.
చాలాకాలంగా ఆర్‌కాం చెల్లింపుల కోసం ఎదురుచూస్తున్నాం..550 కోట్ల రూపాయల చెల్లింపునకు అంబానీ కోర్టులో వ్యక్తిగత హామీ ఇచ్చారు, కానీ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం ఇది రెండవసారి. ఈ నేపథ్యంలో ఆర్‌కాంపై దివాలా చర్యలు చేపట్టాలని ఎరిక్సన్ సీనియర్ అడ్వకేట్ అనిల్ ఖేర్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment