ఆర్‌కామ్ వైర్లెస్ డీమెర్జర్‌కు సెబీ ఆమోదం
ఓకే చెప్పిన బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు
న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్) కంపెనీ వైర్లెస్ కార్యకలాపాల డీమెర్జర్‌కు క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం లభించింది. అంతే కాకుండా ఈ డీమెర్జర్‌కు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల ఆమోదాలు కూడా లభించాయి. ఈ డీమెర్జర్ స్కీమ్‌కు ఆమోదం తెలపాలంటూ తాజాగా ఆర్‌కామ్, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ), ముంబై ధర్మాసనానికి దరఖాస్తు చేసింది. ఆర్‌కామ్ తన వైర్లెస్ వ్యాపారాన్ని ఎయిర్‌సెల్‌తో కలసి ఏర్పాటు చేస్తున్న జాయింట్ వెంచర్ కంపెనీ, ఎయిర్‌సెల్ లిమిటెడ్ అండ్ డిష్‌నెట్ వైర్లెస్ లిమిటెడ్‌కు బదిలీ చేస్తోంది.
ఈ కంపెనీలో ఆర్‌కామ్‌కు, ఎయిర్‌సెల్ వాటాదారులు(మ్యాక్సిస్ కమ్యూనికేషన్స్ బెర్హద్)కు చెరో 50% వాటా ఉంటుంది. డైరెక్టర్ల బోర్డ్, కమిటీల్లో సమాన ప్రాతినిధ్యం ఉంటుంది. వైర్లెస్ టెలికం వ్యాపారాన్ని ఎయిర్‌సెల్ కంపెనీలో విలీనం చేయనున్నామని గత ఏడాది సెప్టెంబర్, 14న ఆర్‌కామ్ వెల్లడించింది. రూ.65,000 కోట్ల ఆస్తులతో రూ.35,000 కోట్ల నెట్‌వర్త్‌తో దేశంలో నాలుగో అతి పెద్ద టెల్కోగా విలీన సంస్థ అవతరిస్తుంది. ఈ వార్తలతో ఆర్‌కామ్ షేర్ 1.5% లాభంతో రూ.36.80 వద్ద ముగిసింది.