RCom shares
-
అన్న చేతికి తమ్ముడు : దూసుకెళ్తున్న రిలయన్స్
ముంబై : రిలయన్స్ కమ్యూనికేషన్ షేర్లు భారీగా దూసుకెళ్తున్నాయి. తమ్ముడు అనిల్ అంబానీ చెందిన ఆర్‌కామ్ వైర్లెస్ ఆస్తులను అన్న ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో దక్కించుకోబోతున్నట్టు ప్రకటించగానే, ఆర్‌కామ్ షేర్లు మరింత దూకుడుగా ట్రేడవుతున్నాయి. శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలో ఆర్‌కామ్ షేర్లు దాదాపు 35 శాతం పైకి ఎగిశాయి. అంతేకాక గత మూడు వారాల్లో ఆర్‌కామ్ షేరు 280 శాతం లాభాలు పండించింది. ఇటు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు కూడా స్వల్పంగా 0.6 శాతం లాభపడ్డాయి. ఇరు కంపెనీలు ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలను వెల్లడించనప్పటికీ, ఈ డీల్ విలువ రూ.24,000 -25,000 కోట్ల శ్రేణిలో ఉండొచ్చని బ్యాంకింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఆస్తుల విక్రయం రూ.45,000 కోట్ల రుణ భారంతో కుదేలైన ఆర్‌కామ్‌కు కొంత ఊరట లభించనుంది. ఈ డీల్ వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య పూర్తయ్యే అవకాశాలున్నాయని అంచనాలు వెలువడుతున్నాయి. నాలుగు కేటగిరీలు స్పెక్ట్రమ్, మొబైల్ టవర్లు, ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్, మీడియా కన్వర్జన్స్ నోడ్స్ను (ఎంసీఎన్) ఆర్‌కామ్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ దక్కించుకోబోతుంది. ఈ మేరకు ఒక నిశ్చయాత్మకమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని రిలయన్స్ జియో తెలిపింది. డీల్ ప్రకారం జియో దక్కించుకోబోతున్న ఆర్‌కామ్ ఆస్తులు 800/900/1800/2100 మెగాహెడ్జ్ బ్యాండ్స్‌లో 122.4 మెగాహెడ్జ్ 4జీ స్పెక్ట్రమ్ 43వేలకు పైగా టవర్లు సుమారు 1,78,000 ఆర్కేఎం ఫైబర్ 248 మీడియా కన్వర్జన్స్ నోడ్స్ -
భారీగా పడిపోతున్న ఆర్‌కామ్
ముంబై : అసలకే నష్టాలతో ముప్పుతిప్పలు పడుతున్న రిలయన్స్ కమ్యూనికేషన్, మార్కెట్లోనూ అతలాకుతలమవుతోంది. ఎయిర్‌సెల్‌తో విలీన చర్చలు వీగిపోవడంతో, అనిల్ అంబానీకి చెందిన ఈ రిలయన్స్ కమ్యూనికేషన్ షేర్లు 52 వారాల కనిష్టంలోకి పడిపోయాయి. ఓ వైపు మార్కెట్లు దూసుకుపోతుండగా.. ఆర్‌కామ్ మాత్రం తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోంది. మంగళవారం ఇంట్రాడేలో ఆర్‌కామ్ స్టాక్స్ 10 శాతానికి పైగా కిందకి పడిపోయాయి. ప్రస్తుతం ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి రూ.17.35 వద్ద ఆర్‌కామ్ షేర్లు నమోదవుతున్నాయి. ఆర్‌కామ్-ఎయిర్‌సెల్ విలీన కథ కంచికి చేరడంతో నేటి మార్కెట్లో ఆర్‌కామ్ షేర్లకు ఈ పరిస్థితి తలెత్తింది. ఆర్‌కామ్, ఎయిర్‌సెల్ మొబైల్ వ్యాపారం విలీన ప్రతిపాదన పరస్పర ఆమోదం పొందడంలో విఫలం చెందిందని ఆర్‌కామ్ తన ప్రకటనలో తెలిపింది. విలీనం విషయమై గతేడాది సెప్టెంబర్‌లో ఈ రెండు కంపెనీలు ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ విలీనం ద్వారా రూ.45,000 కోట్ల రుణ భారాన్ని గణనీయంగా తగ్గించుకోవాలని ఆర్‌కామ్ భావించింది. ప్రస్తుతం ఈ విలీనం వీగిపోవడంతో, ఆర్‌కామ్ రుణాలను తీర్చడానికి ప్రత్యామ్నాయ అవకాశాలను పరిశీలించాల్సి వస్తోంది. కాగ, నేటి ట్రేడింగ్‌లో మార్కెట్లు మంచి లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రారంభంలోనే 300 పాయింట్లు ఎగిసిన మార్కెట్లు, ప్రస్తుతం సెన్సెక్స్ 192 పాయింట్ల లాభంలో 31,476 వద్ద, నిఫ్టీ 56 పాయింట్ల లాభంలో 9844 వద్ద ట్రేడవుతోంది. -
మరోసారి కుప్పకూలిన ఆర్ కామ్
రిలయన్స్ కమ్యూనికేషన్ షేర్లు మరో సారి కుప్పకూలాయి. రేటింగ్ ఏజెన్సీలు ఫిచ్, మూడీస్ మంగళవారం మళ్లీ కంపెనీ క్రెడిట్ రేటింగ్ ను తగ్గించడంతో బుధవారం కంపెనీ షేర్లకు భారీగా దెబ్బకొట్టింది. నేటి ట్రేడింగ్ లో 4 శాతం పైగా పడిపోయిన ఆర్ కామ్ షేర్లు, కనిష్టంగా రూ.19 వద్ద నమోదయ్యాయి. మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్ లో కంపెనీ రూ.948 కోట్ల నష్టాలను ప్రకటించిన దగ్గర్నుంచి ఆర్ కామ్ 24 శాతం మేర పడిపోయింది. అన్న ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ జియో దెబ్బకు ఆర్ కామ్ కోలుకోలేని నష్టాలను ఎదుర్కొంటోంది. ముందటి ఆర్థిక సంవత్సరంలో 79 కోట్ల లాభాలను ఆర్ కామ్ నమోదుచేయగా.. ముగిసిన ఈ ఏడాదిలో భారీ నష్టాలను మూటగట్టుకుంది. రుణభారం నుంచి గట్టెక్కడానికి బ్యాంకర్లు తమకు ఏడు నెలల సమయమిచ్చారని రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ చెప్పడంతో, ఆర్ కామ్ షేర్లు సోమవారం ట్రేడింగ్ లో 4.6 శాతం మేర లాభపడ్డాయి. కానీ పెరుగుతున్న రుణాలపై మళ్లీ ఆందోళనలు రేకెత్తడంతో సోమవారం వచ్చిన లాభాలు తుడిచిపెట్టుకుపోయాయి. మంగళవారం రోజు ఫిచ్, మూడీస్ లు మరోసారి కంపెనీ రేటింగ్ ను డౌన్ గ్రేడింగ్ చేశాయి. ఫిచ్ ఈ సంస్థను కనిష్ట కేటగిరిలోకి డౌన్ గ్రేడ్ చేయగా.. మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసు రెండో కనిష్ట కేటగిరీలోకి డౌన్ గ్రేడ్ చేసింది. కంపెనీ అవుట్ లుక్ నెగిటివ్ గా ఉందంటూ మూడీస్ తన ప్రకటనలో పేర్కొంది. వారం క్రితమే మూడీస్ ఆర్ కామ్ రేటింగ్ ను బీ2 నుంచి సీఏఏ1 కు తగ్గించింది. ఫిచ్, మూడీస్ మాత్రమే కాక, ఐక్రా, కేర్ లు కూడా కంపెనీ రేటింగ్స్ ను సవరించాయి. ఈ ఏడాది మార్చి 31 వరకు ఆర్ కామ్ నికర రుణం రూ.45వేల కోట్లకు పెరిగింది.