భారీగా పడిపోతున్న ఆర్‌కామ్‌ | RCom shares hit lowest levels in intraday | Sakshi
Sakshi News home page

భారీగా పడిపోతున్న ఆర్‌కామ్‌

Published Tue, Oct 3 2017 2:13 PM | Last Updated on Tue, Jun 4 2019 6:47 PM

RCom shares hit lowest levels in intraday - Sakshi

ముంబై : అసలకే నష్టాలతో ముప్పుతిప్పలు పడుతున్న రిలయన్స్‌ కమ్యూనికేషన్‌‌, మార్కెట్‌లోనూ అతలాకుతలమవుతోంది. ఎయిర్‌సెల్‌తో విలీన చర్చలు వీగిపోవడంతో, అనిల్‌ అంబానీకి చెందిన ఈ రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ షేర్లు 52 వారాల కనిష్టంలోకి పడిపోయాయి. ఓ వైపు మార్కెట్లు దూసుకుపోతుండగా.. ఆర్‌కామ్‌ మాత్రం తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోంది. మంగళవారం ఇంట్రాడేలో ఆర్‌కామ్‌ స్టాక్స్‌ 10 శాతానికి పైగా కిందకి పడిపోయాయి. ప్రస్తుతం ఆల్‌టైమ్‌ కనిష్ట స్థాయి రూ.17.35 వద్ద ఆర్‌కామ్‌ షేర్లు నమోదవుతున్నాయి.  ఆర్‌కామ్‌-ఎయిర్‌సెల్‌ విలీన కథ కంచికి చేరడంతో నేటి మార్కెట్‌లో ఆర్‌కామ్‌ షేర్లకు ఈ పరిస్థితి తలెత్తింది. ఆర్‌కామ్, ఎయిర్‌సెల్‌ మొబైల్‌ వ్యాపారం విలీన ప్రతిపాదన పరస్పర ఆమోదం పొందడంలో విఫలం చెందిందని ఆర్‌కామ్‌ తన ప్రకటనలో తెలిపింది.

విలీనం విషయమై గతేడాది సెప్టెంబర్‌లో ఈ రెండు కంపెనీలు ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే.  వాస్తవానికి ఈ విలీనం ద్వారా రూ.45,000 కోట్ల రుణ భారాన్ని గణనీయంగా తగ్గించుకోవాలని ఆర్‌కామ్‌ భావించింది. ప్రస్తుతం ఈ విలీనం వీగిపోవడంతో, ఆర్‌కామ్‌ రుణాలను తీర్చడానికి ప్రత్యామ్నాయ అవకాశాలను పరిశీలించాల్సి వస్తోంది. కాగ, నేటి ట్రేడింగ్‌లో మార్కెట్లు మంచి లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రారంభంలోనే 300 పాయింట్లు ఎగిసిన మార్కెట్లు, ప్రస్తుతం సెన్సెక్స్‌ 192 పాయింట్ల లాభంలో 31,476 వద్ద​, నిఫ్టీ 56 పాయింట్ల లాభంలో 9844 వద్ద ట్రేడవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement