న్యూఢిల్లీ: పదే పదే నిబంధనలను ఉల్లంఘిస్తోందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ (సీఆర్‌ఏ) బ్రిక్‌వర్క్ రేటింగ్స్ ఇండియాపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొరడా ఝుళిపించింది. సంస్థ లైసెన్సును రద్దు చేసింది. ఆరు నెలల్లోగా కార్యకలాపాలాన్నీ నిలిపివేయాలని ఆదేశించింది. కొత్తగా క్లయింట్లను తీసుకోరాదంటూ నిషేధం విధించింది. ఒక క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీపై సెబీ ఇంత తీవ్ర చర్యలు తీసుకోవడం బహుశా ఇదే తొలిసారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
రేటింగ్స్ ఇచ్చే క్రమంలో నిర్దేశిత ప్రక్రియలు పాటించడంలోనూ, మదింపు విషయంలో సరిగ్గా వ్యవహరించడంలోనూ బ్రిక్‌వర్క్ విఫలమైందని సెబీ తన ఆదేశాల్లో పేర్కొంది. అంతే కాకుండా కంపెనీలకు తాను ఇచ్చిన రేటింగ్స్‌ను సమర్ధించుకునేందుకు అవసరమైన రికార్డులను భద్రపర్చుకోవడంలోనూ సంస్థ విఫలమైందని వ్యాఖ్యానించింది. ‘ఒక సీఆర్‌ఏగా బ్రిక్‌వర్క్ తన విధులను నిర్వర్తించడానికి సంబంధించి నైపుణ్యాలను ఉపయోగించుకోవడంలోనూ, జాగ్రత్తలు తీసుకోవడంలోను విఫలమైంది.
ఇన్వెస్టర్లకు భద్రత కల్పించడంతో పాటు క్రమబద్ధంగా సెక్యూరిటీల మార్కెట్‌లను అభివృద్ధి చేయాలన్న నిబంధనల లక్ష్యాలకు తూట్లు పొడించింది‘ అని సెబీ ఆక్షేపించింది. అనేక దఫాలుగా తనిఖీలు చేసి, దిద్దుబాటు చర్యలను సూచిస్తూ, జరిమానాలు విధిస్తూ ఉన్నప్పటికీ బ్రిక్‌వర్క్ తన వైఖరిని ఏమాత్రం మార్చుకోలేదని పేర్కొంది. ‘ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్ వ్యవస్థను కాపాడేందుకు నియంత్రణ సంస్థపరంగా కఠినమైన చర్యలు అవసరమని భావిస్తున్నాను‘ అని ఉత్తర్వుల్లో సెబీ హోల్‌టైమ్ సభ్యుడు అశ్వని భాటియా పేర్కొన్నారు.
పదే పదే ఉల్లంఘనలు ..
2014 ఏప్రిల్ నుంచి 2015 సెప్టెంబర్, 2017 ఏప్రిల్–2018 సెప్టెంబర్ మధ్య బ్రిక్‌వర్క్‌లో సెబీ తనిఖీలు నిర్వహించింది. ఆయా సందర్భాల్లో పలు ఉల్లంఘనలు ఉన్నట్లు గుర్తించింది. వాటిపై విడిగా విచారణ జరిపింది. ఆ తర్వాత 2020 జనవరిలో ఆర్‌బీఐతో కలిసి 2018 అక్టోబర్–2019 నవంబర్ మధ్యకాలానికి సంబంధించి బ్రిక్‌వర్క్ రికార్డులను తనిఖీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా ఆర్‌బీఐతో కలిసి 2019 డిసెంబర్–2022 జనవరి మధ్య కాలానికి సంబంధించిన రికార్డులు, పత్రాలను తనిఖీ చేసింది. వీటన్నింటిలోనూ దాదాపు ఒకే తరహా ఉల్లంఘనలు బైటపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment