Downgrade
-
మార్కెట్లపై ‘ఫిచ్’ పంచ్
ముంబై: ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ అమెరికా రుణ రేటింగ్‌ను తగ్గించడంతో బుధవారం ఈక్విటీ మార్కెట్లు బేర్మన్నాయి. దేశీయ బెంచ్ మార్క్ సూచీలు ఒక శాతానికి పైగా కుప్పకూలాయి. ఫలితంగా దలాల్ స్ట్రీట్‌లో రూ.3.46 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఉదయం సెన్సెక్స్ 395 పాయింట్ల నష్టంతో 66,064 వద్ద, నిఫ్టీ 79 పాయింట్లు పతనమై 19,655 వద్ద మొదలయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిణామాల ప్రభావంతో రోజంతా నష్టాల్లో కదలాడాయి. విస్తృత స్థాయిలో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఆయా రంగాల సూచీలు గరిష్టంగా రెండున్నర శాతం వరకు క్షీణించాయి. ఒక దశలో సెన్సెక్స్ 1027 పాయింట్లు నష్టపోయి 65,432 వద్ద, నిఫ్టీ 311 పాయింట్లు క్షీణించి 19,423 వద్ద ఇంట్రాడే కనిష్టానికి దిగివచ్చాయి. చివర్లో కనిష్ట స్థాయిల వద్ద స్వల్ప కొనుగోళ్ల మద్దతు లభించింది. ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 677 పాయింట్లు నష్టపోయి 65,783 వద్ద ముగిసింది. నిఫ్టీ 207 పాయింట్లు పతనమై 19,527 వద్ద స్థిరపడింది. ముఖ్యంగా బ్యాంకింగ్, మెటల్, ఆటో షేర్లలో పెద్ద ఎత్తున విక్రయాలు తలెత్తాయి. దీంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలూ ఒకశాతానికి పైగా పతనమయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1878 కోట్లను, సంస్థాగత ఇన్వెస్టర్లు స్వల్పంగా రూ.2 కోట్లను షేర్లను విక్రయించారు. రూపాయి ఆరునెలల్లో అతిపెద్ద పతనం రూపాయి విలువ ఆరు నెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది. డాలర్ మారకంలో 45 పైసలు కరిగిపోయి 82.67 వద్ద స్థిరపడింది. దేశీయ ఈక్విటీ మార్కెట్ భారీ పతనం, విదేశీ ఇన్వెస్టర్లు నిధుల ఉపసంహరణలు ఇందుకు కారణమయ్యాయి. ఫారెక్స్ మార్కెట్లో ఉదయం 82.38 వద్ద మొదలైంది. ట్రేడింగ్ ఆద్యంతం అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇంట్రాడే కనిష్ట స్థాయి(82.67) వద్ద ముగిసింది. ‘ప్రపంచ మార్కెట్లో రిస్క్ తీసుకునే సామర్థ్యం తగ్గిపోవడంతో పాటు ఆసియా కరెన్సీల బలహీన ట్రేడింగ్‌తో రూపాయి భారీగా నష్టపోయింది. అంతర్జాతీయ కరెన్సీ విలువల్లో డాలర్ బలపడటమూ దేశీయ కరెన్సీపై ఒత్తిడి పెంచింది’ అని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. ఒక్క రోజులో రూ.3.46 లక్షల కోట్ల నష్టం సెన్సెక్స్ ఒక శాతానికి పైగా క్షీణించడంతో దలాల్ స్ట్రీట్‌లో రూ.3.46 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్) రూ.303 లక్షల కోట్లకు దిగివచి్చంది. నష్టాలు ఎందుకంటే ► ‘గత 20 ఏళ్లలో అమెరికా అప్పుల కుప్పగా మారింది. పాలనా వ్యవస్థలో స్థిరమైన క్షీణత కనిపిస్తుంది. యూఎస్ రుణ రేటింగ్‌ను ఏఏఏ నుంచి ఏఏప్లస్ రేటింగ్‌కు తగ్గిస్తున్నాము’ అని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ తెలిపింది. ఈ ప్రకటన ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించింది. ► ఫిచ్ రేటింగ్ కుదింపుతో పెట్టుబడులు ఈక్విటీ మార్కెట్ల నుంచి బాండ్లలోకి మళ్లాయి. అమెరికా పదేళ్ల కాలపరిమిత బాండ్లపై రాబడి ఏకంగా 4% పెరిగింది. ► యూరో జోన్, చైనా జూలై పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నిరాశపరచడంతో అంతర్జాతీయ వృద్ధి భయాలు వెంటాడాయి. ఈ పరిణామాలతో ఆసియా, యూరప్ మార్కెట్లు 2–1% క్షీణించాయి. ఈ ప్రతికూల ప్రభావం దేశీయ మార్కెట్‌పై పడింది. ► దేశీయంగా గడిచిన నాలుగు నెలల్లో సూచీలు 13% ర్యాలీ చేయడంతో గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. జాతీయ, అంతర్జాతీయ ప్రతికూల పరిణామాల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ మార్కెట్లో పెట్టుబడుల ఉపసంహరణకు మొగ్గుచూపారు. -
విమాన టికెట్ డౌన్‌గ్రేడ్ చేస్తే రీయింబర్స్మెంట్
న్యూఢిల్లీ: ప్రయాణికులు బుక్ చేసుకున్న టికెట్లను ఎయిర్‌లైన్స్ ఏకపక్షంగా డౌన్‌గ్రేడ్ చేస్తుండటంపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో విమానయాన రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ కొత్త నిబంధనలు రూపొందించింది. వీటి ప్రకారం టికెట్‌ను డౌన్‌గ్రేడ్ చేస్తే, దేశీ రూట్లలో ప్రయాణాలకు సంబంధించి టికెట్ ఖర్చులో 75 శాతం మొత్తాన్ని ప్యాసింజర్లకు ఎయిర్‌లైన్స్ చెల్లించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ రూట్ల విషయంలో ప్రయాణ దూరాన్ని బట్టి టికెట్ ఖర్చుల్లో 30–75 శాతం వరకు (పన్నులు సహా) రీయింబర్స్ చేయాలి. ఇవి ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వస్తాయని డీజీసీఏ సీనియర్ అధికారి బుధవారం తెలిపారు. ప్యాసింజర్లు నిర్దిష్ట తరగతిలో ప్రయాణించేందుకు బుక్ చేసుకున్న టికెట్‌ను విమానయాన సంస్థలు వివిధ కారణాలతో దిగువ తరగతికి డౌన్‌గ్రేడ్ చేస్తున్న ఉదంతాలు ఇటీవల పెరిగిన సంగతి తెలిసిందే. -
2023లో ప్రపంచ ఎకానమీ ఒడిదుడుకులు!
న్యూఢిల్లీ: గ్లోబల్ ఎకానమీలో ప్రస్తుతం తీవ్ర ఒత్తిడి పరిస్థితులు నెలకొన్నాయని ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యుడు సన్యాల్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఏజెన్సీలు ప్రపంచ ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి సంఖ్యలను పదేపదే డౌన్గ్రేడ్లు చేస్తున్నాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో వచ్చే 2023 సంవత్సరం కూడా కష్టతరమైనదని చెప్పడానికి స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయని విశ్లేషించారు. ఎకానమీకి సంబంధించి ఆయన ఇచ్చిన ఒక తాజా ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు... ► వాణిజ్యలోటు (ఎగుమతులు–దిగుమతుల విలువ మధ్య నికర వ్యత్యాసం) భారీగా పెరిగిపోకుండా చర్యలు అవసరమే. ఒకే దేశంలో వాణిజ్యలోటు తీవ్రంగా పెరిగిపోకుండా పలు చర్యలు తీసుకోవడం జరుగుతోంది. మనకు కావాల్సిన ఉత్తులను వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోంది. (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య చైనాతో వాణిజ్యలోటు 51.1 బిలియన్ డాలర్లకు తాకిన నేపథ్యంలో సన్యాల్ ఈ వ్యాఖ్యలు చేశారు) ► భారతదేశ మొత్తం సరుకు వాణిజ్య లోటు పెరిగిన మాట వాస్తవమే. అయితే దేశీయ ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకోవడం, మిగిలిన ప్రపంచం మందగించడం దీనికి కారణం. ► ఇక భారత్ నుంచి ఎగుమతుల పెంపునకూ వ్యూహ రచన జరుగుతోంది. ఇక్కడ మనం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) స్కీమ్‌నూ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. పీఎల్ఐ పథకం లక్ష్యం– దేశీయ తయారీని ప్రపంచవ్యాప్త పోటీ వేదికపై నిలబెట్టడం, తయారీ రంగంలో ప్రపంచ ఛాంపియన్లను సృష్టించడం, ఎగుమతులను పెంచడం, ఉద్యోగ అవకాశాలను కల్పించడం. ► తూర్పు యూరప్‌లో ఇబ్బందులు, చైనాలో కోవిడ్ కేసుల విజృంభన వంటి అంశాలు భారత్‌సహా ప్రపంచంలోని పలు ఎకానమీలపై ప్రతికూలత చూపే అవకాశం ఉంది. అయితే సవాళ్లను తట్టుకుని నిలబడగలిగే స్థితిలో భారత్ ఉంది. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ వ్యవస్థగా కొనసాగుతోంది. 2023–24లో కూడా ఇదే హోదా కొనసాగిస్తుందన్న విశ్వాసం ఉంది. ► కాగా, కోవిడ్ తిరిగి తీవ్రమయ్యే అవకాశాలపై భారతదేశం అప్రమత్తంగా ఉండాలి. ► ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్ లోటు (దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) వంటి స్థూల ఆర్థిక స్థిరత్వ అంశాలపై జాగరూకత అవసరం. ► తక్షణం కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక భారత్ ఎకానమీ అవుట్‌లుక్ స్థిరంగా ఉంది. పాత పెన్షన్ పథకాల పునరుద్ధరణ సరికాదు..! ఉద్యోగుల వంతు జమతో (కాంట్రిబ్యూషన్) సంబంధంలేని పాత పెన్షన్ పథకాలు (ఓపీఎస్).. భవిష్యత్ తరాలపై దాడి వంటిదేనని సన్యాల్ పేర్కొన్నారు. కొన్ని ప్రతిపక్ష పాలక రాష్ట్రాల నుంచి వచ్చిన ‘పాత పెన్షన్ పథకాలను పునరుద్ధరణ డిమాండ్’ సరైంది కాదని స్పష్టం చేశారు. గత రెండు దశాబ్దాలుగా చాలా కష్టాలతో అమల్లోకి తెచ్చిన పెన్షన్ సంస్కరణలను తిరిగి వెనక్కు మళ్లించే విషయంలో జాగరూకత అవసరమన్నారు. పెన్షన్ మొ త్తాన్ని ప్రభుత్వమే ఇవ్వడానికి సంబంధించిన పాత పెన్షన్ పథకాలను 2003లో ఎన్డీఏ ప్రభుత్వం నిలిపివేసింది. 2004 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైన ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. కొత్త కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) కింద ఉద్యోగులు తమ ప్రాథమిక (బేసిస్) వేతనంలో 10 శాతం పెన్షన్‌కు జమ చేయాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం 14 శాతం జమ చేస్తుంది. -
టికెట్ డౌన్‌గ్రేడ్ చేస్తే పరిహారం చెల్లించాలి
న్యూఢిల్లీ: విమానయాన సంస్థలు ఇకపై ప్రయాణికుల టికెట్లను ఇష్టానుసారంగా డౌన్‌గ్రేడ్ చేస్తే పరిహారం చెల్లించుకోవాల్సి రానుంది. పన్నులు సహా టికెట్ పూర్తి విలువను ప్యాసింజర్‌కి తిరిగి ఇవ్వడంతో పాటు సదరు ప్రయాణికులను తదుపరి అందుబాటులో ఉన్న తరగతిలో ఉచితంగా తీసుకెళ్లాల్సి రానుంది. ఇందుకు సంబంధించి ప్రయాణికుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రస్తుత నిబంధనలను సవరించే పనిలో ఉంది. సంబంధిత వర్గాలతో సంప్రదింపులు ముగిశాక తుది నిబంధనలను జారీ చేయనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఇవి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని డీజీసీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఒక తరగతిలో బుక్ చేసుకున్న టికెట్లను విమానయాన సంస్థలు ఇష్టారీతిగా కింది తరగతికి డౌన్‌గ్రేడ్ చేస్తున్నాయంటూ తరచుగా ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో డీజీసీఏ ఈ మేరకు చర్యలు చేపట్టింది. విమాన సేవలను వేగవంతంగా విస్తరించాల్సి వస్తుండటం, ప్యాసింజర్ ట్రాఫిక్ భారీగా పెరిగిపోవడం వంటి అంశాల వల్ల కొన్ని సందర్భాల్లో ఎయిర్‌లైన్స్ ఇలా చేయాల్సి వస్తోంది. ‘ఉదాహరణకు ప్రయాణికులు .. ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ లేదా ప్రీమియం ఎకానమీలో టికెట్ బుక్ చేసుకుని ఉండవచ్చు. అయితే, సీట్లు అందుబాటులో లేకపోవడం లేదా విమానాన్ని మార్చాల్సి రావడం వంటి కారణాల వల్ల చెకిన్ సమయంలో వారి టికెట్లను దిగువ తరగతికి డౌన్‌గ్రేడ్ చేసే పరిస్థితి ఉంటోంది. అయితే, ఇలా డౌన్‌గ్రేడ్ చేస్తే ప్రయాణికులకు ఎయిర్‌లైన్ టికెట్ పూర్తి విలువ రీఫండ్ చేయడంతో పాటు తదుపరి అందుబాటులో ఉన్న తరగతిలో ఉచితంగా తీసుకెళ్లేలా ప్రతిపాదిత సవరణ ఉపయోగపడుతుంది‘ అని డీజీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత నిబంధనలు ఇలా.. బోర్డింగ్‌ను నిరాకరించినా, ఫ్లయిట్ రద్దయినా విమాన ప్రయాణికులకు పరిహారం లభించేలా ప్రస్తుతం నిబంధనలు ఉన్నాయి. బుకింగ్ కన్ఫర్మ్ అయినా బోర్డింగ్‌ను నిరాకరిస్తే, ప్రత్యామ్నాయంగా సదరు విమానం బైల్దేరే షెడ్యూల్ తర్వాత గంట వ్యవధిలోగా మరో ఫ్లయిట్లో సీటు కల్పించగలిగితే ఎలాంటి పరిహారం చెల్లించనక్కర్లేదు. అదే 24 గంటల వరకూ పడితే వన్ వే ఛార్జీ, ఇంధన చార్జీలకు 200 శాతం అధికంగా పరిహారం చెల్లించాలి. గరిష్టంగా రూ. 10,000 పరిమితి ఉంటుంది. ఒకవేళ 24 గంటలు దాటేశాక సీటు కల్పిస్తే రూ. 20,000 గరిష్ట పరిమితికి లోబడి 400 శాతం వరకూ పరిహారం చెల్లించాలి. వీటితో పాటు ఫ్లయిట్ రద్దవడం తదితర అంశాలకు సంబంధించి వివిధ మార్గదర్శకాలు ఉన్నాయి. -
గోల్డ్‌మన్ శాక్స్..బ్యాంక్ షేర్ల రేటింగ్
దేశీ బ్యాంకుల ఆర్జనలు సగటున 40 శాతం వరకూ తగ్గే వీలున్నదంటూ విదేశీ రీసెర్చ్ దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ తాజాగా పేర్కొంది. ప్రొవిజన్లు పెరగడం, రుణ చెల్లింపుల వాయిదాలు, నిర్వహణ లాభాలు క్షీణించడం వంటి ప్రతికూలతలు బ్యాంకింగ్ రంగంపై ప్రభావం చూపవచ్చని అంచనా వేసింది. దీనిలో భాగంగా ప్రయివేట్ రంగ దిగ్గజ బ్యాంకుల రేటింగ్స్‌ను సవరించింది. యాక్సిస్ బ్యాంక్‌కు గోల్డ్‌మన్ శాక్స్ గతంలో ఇచ్చిన న్యూట్రల్ రేటింగ్‌ను తాజాగా విక్రయించవచ్చు(సెల్)కు సవరించింది. టార్గెట్ ధరను రూ. 417 నుంచి రూ. 323కు కోత పెట్టింది. రుణ నాణ్యతకు ఎదురయ్యే సవాళ్లు, నిర్వహణ లాభం నీరసించడం వంటి అంశాలు యాక్సిస్‌ను దెబ్బతీసే వీలున్నట్లు పేర్కొంది. టార్గెట్ కుదింపు మార్టిగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ కౌంటర్‌కు ఇంతక్రితం ఇచ్చిన బయ్ రేటింగ్‌ను న్యూట్రల్‌కు గోల్డ్‌మన్ శాక్స్ సవరించింది. ఫలితంగా ఈ షేరు టార్గెట్ ధరను 16 శాతం కుదించి రూ. 1625కు చేర్చింది. గృహ రుణ బిజినెస్ మందగించడం, బాండ్ మార్కెట్లో క్రెడిట్ స్ప్రెడ్స్ పెరుగుతుండటం వంటి అంశాలు కంపెనీపై ప్రభావం చూపనున్నట్లు అభిప్రాయపడింది. ఇక ఐసీఐసీఐ బ్యాంక్‌కు బయ్ రేటింగ్‌ను కొనసాగిస్తున్నప్పటికీ కవరేజీ జాబితా నుంచి తొలగిస్తున్నట్లు తెలియజేసింది. ఎన్బీఎఫ్సీలు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటక్ మహీంద్రా, బంధన్ బ్యాంకులకు బయ్ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది. అయితే ఈ కౌంటర్ల టార్గెట్ ధరలను స్వల్పంగా తగ్గించింది. హెచ్‌ఢీఎఫ్‌సీ బ్యాంక్ ప్రస్తుత టార్గెట్ రూ. 1142కాగా.. బంధన్ బ్యాంక్‌కు రూ. 275ను నిర్ణయించింది. ఈ బాటలో ఎన్బీఎఫ్సీ విభాగంలో.. బజాజ్ ఫైనాన్స్, ఆవాస్ ఫైనాన్షియర్స్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, ఎల్అండ్టీ ఫైనాన్స్ కంపెనీలకు ప్రాదాన్యత ఇస్తున్నట్లు తెలియజేసింది. అయితే మరోవైపు ఐడీఎఫ్సీ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎంఅండ్ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్, పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు ‘సెల్’ రేటింగ్‌ను ప్రకటించింది. ఈ కంపెనీల ఫండమెంటల్స్ బలహీనపడుతున్నట్లు అభిప్రాయపడింది. 25-75 శాతం ప్రయివేట్ బ్యాంక్స్, ఎన్‌బీఎఫ్‌సీల లోన్ బుక్స్‌లో 25-75 శాతం వరకూ రుణ చెల్లింపుల మారటోరియం పరిధిలోనికి వచ్చే వీలున్నట్లు గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది. ఇతర దేశాలలో ఇది 10 శాతంవరకూ ఉన్నట్లు తెలియజేసింది. దీంతో ఇది రిటైల్ రుణ నాణ్యతకు సవాళ్లు విసరవచ్చని అభిప్రాయపడింది. ప్రధానంగా రుణ వాయిదాలతో రిటైల్ విభాగం ప్రభావితంకావచ్చని తెలియజేసింది. 420 బిలియన్ డాలర్ల రిటైల్ రుణ విభాగంలో మూడు వంతులకు సమానమైన అంటే 268 బిలియన్ డాలర్ల రుణాలు రెడ్ జోన్లలో ఉన్నట్లు పేర్కొంది. మారటోరియం బుక్స్‌లో సగటున 20 శాతం స్లిప్పేజెస్ నమోదుకావచ్చని అంచనా వేస్తోంది. గత ఆరేళ్లతో పోలిస్తే ఇది 5 రెట్లు అధికమని తెలియజేసింది. నిర్వహణ లాభాలు 40 శాతం వరకూ తగ్గవచ్చని, ఫీజు ఆదాయం నీరసించవచ్చని భావిస్తోంది. దీంతో మార్జిన్లపై ఒత్తిడి ఏర్పడే వీలున్నట్లు వివరించింది. -
భారత్‌కు సావరిన్ రేటింగ్ కట్
న్యూఢిల్లీ: భారత్‌కు ఇస్తున్న సార్వభౌమ స్థాయి (సావరిన్ రేటింగ్)ని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తగ్గించింది. ఇప్పటి వరకూ ఈ రేటింగ్ ‘బీఏఏ2’ అయితే దీనిని ‘బీఏఏ3’కి తగ్గిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఇక భారత్ రేటింగ్ అవుట్‌లుక్‌ను కూడా నెగటివ్‌లోనే కొనసాగించనున్నట్లు పేర్కొంది. డౌన్‌గ్రేడ్‌కు ప్రధాన కారణాలు... ► కోవిడ్–19 మహమ్మారి భారత్ ఆర్థిక పరిస్థితులను దెబ్బతీసింది. అయితే రేటింగ్ డౌన్‌గ్రేడ్‌కు ఇది ఒక్కటే కారణం కాదు. ► తీసుకుంటున్న పలు విధాన నిర్ణయాల అమల్లో పలు సవాళ్లు ఎదురుకానున్నాయి. ► ఆయా అంశాల నేపథ్యంలో వృద్ధిరేటు సుదీర్ఘకాలం అట్టడుగునే కొనసాగనుంది. ► ఇక ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యపరమైన ఒత్తిడులు కూడా ఎదురుకానున్నాయి. తక్కువ ఆదాయం–వ్యయాలు పెరగడం వంటి అంశాల నేపథ్యంలో ఇందుకు సంబంధించి నికర వ్యత్యాసం... ద్రవ్యలోటు మరింతగా కట్టుతప్పే అవకాశం ఉంది. ► ఫైనాన్షియల్ సెక్టార్లో ఒత్తిడి నెలకొనే అవకాశాలు సుస్పష్టం. 2020–21లో జీడీపీ 4 శాతం క్షీణత కోవిడ్–19 సృష్టించిన నష్టంసహా పలు కారణాల వల్ల 2020–21 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఆర్థిక వ్యవస్థ 4 శాతం క్షీణ రేటును నమోదుచేసుకునే అవకాశం ఉందని మూడీస్ పేర్కొంది. నిజానికి కోవిడ్ మహమ్మారి దాడికి ముందే భారత ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిన విషయాన్ని కూడా మూడీస్ ప్రస్తావించింది. పెరగనున్న రుణ భారం: దీర్ఘకాలం వృద్ధి రేటు దిగువస్థాయిలోనే కొనసాగే పరిస్థితులు ఉండడం వల్ల రుణ భారం తగ్గించుకోవడం ప్రభుత్వానికి కొంత క్లిష్టంగా మారే వీలుంది. కరోనాకు ముందు 2019–20లో భారత్ ప్రభుత్వం రుణ నిష్పత్తి జీడీపీలో 72% ఉంటే, ఇది ఈ ఆర్థిక సంవత్సరం 84%కి పెరిగే అవకాశం ఉంది. అయితే రుణ భారాన్ని తగ్గించుకోవడం స్వల్పకాలంలో సాధ్యమయ్యే అవకాశంలేదు. బీఏఏ– రేటెడ్ దేశాలతో పోల్చితే భారత్‌పై అధిక వడ్డీరేటు భారం ఉంది. బీఏఏ స్టేబుల్ దేశాలతో పోల్చితే మూడు రెట్లు ఈ భారం అధికంగా ఉందని మూడీస్ పేర్కొంది. ప్రైవేటు రంగంలో పొదుపులు, ప్రభుత్వ డెట్ మెచ్యూరిటీలు దీర్ఘకాలంలో ఉండడం రుణ భారం, వడ్డీ చెల్లింపుల విషయం లో కొంత సానుకూల విషయం. ఏమిటి ఈ రేటింగ్..? ఒక దేశ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయన్న అంశంపై అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థలు రేటింగ్ ఇస్తుంటాయి. ఎస్అండ్పీ, ఫిచ్, మూడీస్ ఇందులో ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు. ఆయా దిగ్గజ సంస్థలు ఇచ్చే రేటింగ్ ప్రాతిపదికనే ఒక దేశం అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించగలుగుతుంది. దేశ సీనియర్ ఆర్థిక శాఖ అధికారులు సైతం దేశానికి సంబంధించి ఆర్థిక పరిస్థితులను అధికారికంగా రేటింగ్ సంస్థల ప్రతినిధులకు వివరించి, రేటింగ్ పెంచవలసినదిగా కోరతారంటే, ఆయా సంస్థలు ఇచ్చే సావరిన్ రేటింగ్ ఒక దేశం పెట్టుబడులను ఆకర్షించడంలో ఎంతగా దోహదపడుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మూడీస్ ఇచ్చిన రేటింగ్ ‘బీఏఏ3’ నెగటివ్ అవుట్‌లుక్ కూడా ఇప్పటికీ ‘ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్’ పరిధిలోకే వస్తుందన్న విషయం గమనార్హం. అయితే ‘జంక్’ గ్రేడ్‌కు ఇది ఒక మెట్టు ఎక్కువ. మిగిలిన రెండు సంస్థలు ప్రస్తుతం భారత్‌కు మూడీస్ ఇస్తున్న రేటింగ్ ‘బీఏఏ3 నెగటివ్’కు సరిసమానమైనవే కావడం గమనార్హం. 2017, నవంబర్‌లో మూడీస్ రేటింగ్ అప్‌గ్రేడ్ చేసినా, అటు తర్వాత రెండు దఫాల్లో క్రమంగా తగ్గిస్తూ వచ్చింది. కరెన్సీకీ కోత భారత ప్రభుత్వ ఫారిన్ కరెన్సీ అండ్ లోకల్ కరెన్సీ దీర్ఘకాలిక జారీ రేటింగ్స్‌ను కూడా మూడీస్ ‘బీఏఏ2 నుంచి బీఏఏ 3’కి తగ్గించింది. అలాగే భారత్ లోకల్ కరెన్సీ సీనియర్ అన్సెక్యూర్డ్ రేటింగ్స్‌నూ ‘బీఏఏ2 నుంచి బీఏఏ 3’కి కుదించింది. ఇక షార్ట్‌టర్మ్ లోకల్ కరెన్సీ రేటింగ్‌ను ‘పీ–2 నుంచి పీ–3’కి తగ్గించింది. వీటికి సంబంధించి అవుట్‌లుక్‌ను నెగటివ్‌గా పేర్కొంది. ఊహించిందే... భారత్‌కు సంబంధించి ఫిచ్, ఎస్‌అండ్‌పీలు బీఏఏ3 నెగటివ్‌కు సరిసమానమైన రేటింగ్స్ కొనసాగిస్తున్నందువల్ల మూడీస్ కూడా ఈ మేరకు సర్దుబాటు చేస్తుందని మార్కెట్ మొదటి నుంచీ ఊహిస్తూ వస్తోంది. అయితే ఈ రేటింగ్ కూడా భారత్‌కు ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ హోదానే ఇస్తోంది. దీనివల్ల బాండ్, రూపాయి మార్కెట్లో భారీ మార్పు ఏదీ ఉండబోదని మేము భావిస్తున్నాం. – కే. హరిహర్, ట్రెజరర్, ఫస్ట్‌రాండ్ బ్యాంక్ -
ఐఎంఎఫ్ : పాతాళానికి వృద్ధి రేటు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో భారత వృద్ధి రేటు అంచనాలను పలు రేటింగ్ సంస్థలు, దేశీ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు కుదిస్తున్న క్రమంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) షాకింగ్ అంచనాలతో ముందుకొచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో భారత్ వృద్ధి రేటు కేవలం 1.9 శాతానికి పరిమితమవుతుందని ఐఎంఎఫ్ వెల్లడించింది. 1991 చెల్లింపుల సంక్షోభం తర్వాత భారత్ వృద్ధి రేటు ఇంతటి కనిష్టస్ధాయికి చేరుతుందనే అంచనా వెలువడటం ఇదే తొలిసారి. వృద్ధి రేటు దిగజారినా ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్ధల్లో భారత్ ఒకటని ఐఎంఎఫ్ పేర్కొంది. మరోవైపు అగ్రదేశాల్లో ఈ ఏడాది అమెరికా (-5.9), జపాన్ (-5.2), బ్రిటన్ (-6.5), జర్మనీ (-7.1), ఫ్రాన్స్ (-7.2), ఇటలీ (-9.1), స్పెయిన్ -8 శాతం నెగెటివ్ వృద్ధి రేటు నమోదు చేస్తాయని ఐఎంఎఫ్ నివేదిక పేర్కొంది. ఇక చైనా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.2 శాతం జీడీపీ వృద్ధి సాధిస్తుందని తెలిపింది. భారత్, చైనాలు మాత్రమే సానుకూల వృద్ధి రేటును సాధిస్తాయని వెల్లడించింది. కరోనా మహమ్మారి ప్రభావంతో పాశ్చాత్య దేశాల వృద్ధి రేటు మైనస్‌లోకి జారుకుంటుందని పలు సంస్ధలు అంచనా వేస్తున్నాయి. చదవండి : మహమ్మారితో మహా సంక్షోభం : ఐఎంఎఫ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్ధపై మహమ్మారి విధ్వంసంతో 1991లో సరళీకరణ అనంతరం భారత్‌లో తొలిసారిగా వృద్ధి రేటు కనిష్టస్ధాయికి పడిపోతుందని ప్రపంచ బ్యాంక్ సైతం వెల్లడించింది. దక్షిణాసియా ఆర్థిక దృక్కోణం నివేదికలో భారత్ 2020-21లో 1.5 శాతం నుంచి 2.8 శాతం మేరకు వృద్ధి రేటు సాధిస్తుందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. మార్చి 31తో ముగిసిన గడిచిన ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధిరేటు 4.8 శాతం నుంచి 5 శాతం మధ్య ఉండవచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఈ ఏడాది అంతర్జాతీయ వృద్ధి రేటు -3 శాతంగా ఉంటుందని తాము అంచనా వేస్తున్నామని, మహమ్మారి వ్యాప్తితో స్వల్పకాలంలోనే వృద్ధి రేటును అనూహ్యంగా తగ్గించామని ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థికవేత్త, ఇండో-అమెరికన్ గీతా గోపీనాథ్ పేర్కొన్నారు. -
బ్యాంకింగ్ బోర్లా!
న్యూఢిల్లీ: భారత బ్యాంకింగ్ రంగ దృక్పథాన్ని స్థిరం నుంచి ప్రతికూలానికి (నెగెటివ్) మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తగ్గించేసింది. కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన అవరోధాలతో వృద్ధి మందగిస్తుందని.. దీంతో బ్యాంకుల ఆస్తుల నాణ్యత తగ్గిపోవచ్చని ఈ సంస్థ అంచనా వేసింది. కార్పొరేట్, సూక్ష్మ, మధ్య తరహా సంస్థలు, రిటైల్ విభాగంలోని మొండిబాకీలు పెరగవచ్చని.. ఫలితంగా బ్యాంకుల లాభాలు, నిధులపై ఒత్తిళ్లు పెరిగిపోతాయని మూడీస్ నివేదికలో పేర్కొంది. ‘‘ఉన్నట్టుండి ఆర్థిక కార్యకలాపాలు ఒకేసారి ఆగిపోవడంతో నిరుద్యోగం పెరుగుతుంది. ఇది గృహాలు, కంపెనీల ఆదాయాలు తగ్గిపోయేందుకు దారితీస్తుంది. దీంతో చెల్లింపుల్లో జాప్యం పెరిగిపోయేందుకు కారణమవుతుంది. ఎన్బీఎఫ్సీ సంస్థల్లో నిధుల ఒత్తిళ్లు బ్యాంకుల రిస్క్‌ను పెంచుతుంది. ఎందుకంటే ఎన్బీఎఫ్సీ రంగానికి బ్యాంకుల ఎక్స్పోజర్ (రుణ పోర్ట్‌ఫోలియో) ఎక్కువగా ఉంది’’ అని మూడీస్ వెల్లడించింది. ఈ అంశాలు బ్యాంకుల లాభదాయకతను దెబ్బతీయడంతోపాటు రుణ వృద్ధికి విఘాతం కలిగిస్తాయని అంచనా వేసింది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో నిధుల లభ్యత స్థిరంగా ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. యస్ బ్యాంకు డిఫాల్ట్‌తో రిస్క్ తీసుకోవడానికి కస్టమర్లు వెనుకాడడం చిన్న ప్రైవేటు బ్యాంకులకు నిధుల ఒత్తిళ్లు పెరగవచ్చని అంచనా వేసింది. ఈ బ్యాంకుల పట్ల నెగెటివ్.. ఇండస్ ఇండ్ బ్యాంకు రేటింగ్స్‌ను డౌన్‌గ్రేడ్ చేసేందుకు పరిశీలనలో పెడుతున్నట్టు మూడీస్ ప్రకటించింది. ఇండస్ ఇండ్ బ్యాంకు పోర్ట్‌ఫోలియో ఎక్కువగా వాహన రుణాలు, సూక్ష్మ రుణాలు కావడంతో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులతో బ్యాంకుపై ఎక్కువ ప్రభావం ఉండొచ్చని మూడీస్ పేర్కొంది. అలాగే, ప్రస్తుత సవాళ్లతో కూడిన వాతావరణంలో ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు రేటింగ్లను డౌన్‌గ్రేడ్ చేసింది. యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకుల రేటింగ్‌ను స్థిరం (స్టేబుల్) నుంచి నెగెటివ్‌కు తగ్గించింది. ఐడీబీఐ బ్యాంకు రేటింగ్‌ను పాజిటివ్ నుంచి స్టెబుల్‌కు డౌన్‌గ్రేడ్ చేసింది. అయితే, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకుల గ్లోబల్ రేటింగ్స్‌లో మార్పులు చేయలేదు. లౌక్‌డౌన్ కారణంగా రుణ గ్రహీతల వేతనాలకు ఇబ్బందులు ఎదురైతే అది రిటైల్, క్రెడిట్‌కార్డు రుణాల చెల్లింపులపై ప్రభావం చూపిస్తుందని అంచనా వేసింది. ఈ రంగాలపై ఎక్కువ ప్రభావం.. ఎయిర్‌లైన్స్, ఆటోమొబైల్ ఓఈఎం కంపెనీలు, ఆటో విడిభాగాల సరఫరా కంపెనీలు, ఆయిల్ అండ్ గ్యాస్ తయారీదారులు, గేమింగ్, గ్లోబల్ షిప్పింగ్, విచక్షణా రహిత రిటైల్ వినియోగం, ఆతిథ్య రంగాలు కరోనా వైరస్ కారణంగా ఎక్కువ ప్రతికూలతలను చవిచూసే రంగాలుగా మూడీస్ పేర్కొంది. -
వొడాఫోన్ ఐడియాకు మరోషాక్
సాక్షి,న్యూఢిల్లీ: ఏజీఆర్ వివాదంతో కష్టాల్లో చిక్కుకున్న టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియాకు మరో చిక్కొచ్చి పడింది. ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ తాజాగా వొడాఫోన్ ఐడియా డౌన్ రేటింగ్‌ను కొనసాగించింది. సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్) బకాయిలను చెల్లించాల్సిన అవకాశం ఉన్నందున కంపెనీ ఆర్ధిక రిస్క్ ప్రొఫైల్‌లో గణనీయమైన క్షీణత ఉంటుందని అంచనా వేసింది. ఏజీఆర్ వివాదానికి ముందు బీబీబీగా ఇచ్చిన ర్యాంకును బీబీబీ మైనస్‌కు తగ్గించింది. వొడాఫోన్ మొబైల్ సర్వీసెస్ లిమిటెడ్ రూ. 3,500 కోట్ల నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్లపై క్రిసిల్ తన రేటింగ్‌ను తగ్గించిందని తెలిపింది. వొడాఫోన్ ఐడియా ప్రభుత్వానికి రూ .53,038 కోట్లు చెల్లించాల్సి వుంది. కాగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిలను జనవరి 23నాటికి చెల్లించాల్సిందేనంటూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దేశీయ టెలికాం కంపెనీలు ఇబ్బందుల్లో పడ్డాయి. దీంతో ఈ గడువులోగా బకాయిలు చెల్లించలేమన్న టెల్కోలు ఈ తీర్పును సమీక్షించాల్సిందిగా కోరుతూ సుప్రీంలో టెల్కోలు పిటిషన్‌ను దాఖలు చేశాయి. దీన్ని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు వచ్చే వారం వాదనలు విననుంది. ఈ క్రమంలో సుప్రీం కోర్టు నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేదాకా బలవంతంగా బాకీల వసూలుకు చర్యలు తీసుకోరాదని టెలికం శాఖ(డాట్) నిర్ణయించింది. లైసెన్సింగ్ ఫైనాన్స్ పాలసీ వింగ్ ఈ మేరకు అన్ని విభాగాలకు ఆదేశాలు పంపించింది. చదవండి : ఏజీఆర్ బకాయిలపై టెల్కోలకు ఊరట, జియో ఏజీఆర్ బకాయిలు చెల్లింపు -
యస్ బ్యాంకు షేరు ఎందుకు కుప్పకూలింది?
సాక్షి, ముంబై: ప్రయివేటు రంగ బ్యాంకు యస్ బ్యాంకుకు మరోసారి భారీ అమ్మకాల సెగ తగిలింది. దీంతో గురువారం 52 వారాల కనిస్టానికి పతనమైంది. ప్రధానంగా ప్రమోటర్ గ్రూప్ కంపెనీకి చెందిన మార్పిడికి వీలుకాని డిబెంచర్ల(ఎన్సీడీల) రేటింగ్‌ను..కేర్ డౌన్‌గ్రేడ్ చేసిన వార్తలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో ఆ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఫలితంగా అయిదు నెలల్లో ఎన్నడూ లేనంతగా అతిభారీ పతనాన్ని నమోదు చేసింది. ప్రమోటర్ గ్రూప్‌లోని మోర్గాన్ క్రెడిట్స్ రూ. 800 కోట్ల జారీ అనంతరం ఎన్సీడీల రేటింగ్‌ను ఏ- నుంచి కేర్ రేటింగ్స్ తాజాగా బీబీబీకు సవరించినట్లు యస్ బ్యాంక్ పేర్కొంది. యస్ బ్యాంక్‌లో మోర్గాన్ క్రెడిట్స్ 3.03 శాతం వాటాను కలిగి ఉంది. బ్యాంకు షేర్ల ధరలు పతనమైన నేపథ్యంలో ఎంసీపీఎల్, తదితర ప్రమోటర్ల వద్ద గల వాటా విలువ పడిపోవడంతో రేటింగ్ డౌన్‌గ్రేడ్ చేపట్టినట్లు కేర్ రేటింగ్స్ తెలియజేసింది. ఈ నేపథ్యంలో యస్ బ్యాంక్ షేరు ఇంట్రాడేలో ఎన్ఎస్ఈలో 17 శాతం కుప్పకూలి రూ. 54 వద్ద ముగిసింది. -
ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ రేటింగ్స్ కోత
ముంబై: గృహ రుణాల సంస్థ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ (ఐబీహెచ్) దీర్ఘకాలిక కార్పొరేట్ రేటింగ్‌ను బీఏ1 నుంచి బీఏ2కి తగ్గిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ వెల్లడించింది. అలాగే భవిష్యత్ అంచనాలను కూడా ’స్థిర’ స్థాయి నుంచి ’నెగటివ్’ స్థాయికి తగ్గించినట్లు తెలిపింది. దేశీయంగా ఐబీహెచ్‌తో పాటు ఇతరత్రా ఫైనాన్స్ సంస్థలు.. నిధుల లభ్యత, నిధుల సమీకరణ వ్యయాలపరంగా ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను ఈ డౌన్‌గ్రేడ్ సూచిస్తుందని మూడీస్ పేర్కొంది. -
పీఎన్బీ రేటింగ్ డౌన్‌గ్రేడ్: మూడీస్
ముంబై: కుంభకోణం, భారీ నష్టాలతో సతమతమవుతున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) రేటింగ్‌ను మూడీస్ డౌన్‌గ్రేడ్ చేసింది. లాభదాయకతపై తీవ్ర ప్రతికూల ప్రభావాల కారణంగా బీఏ/ఎన్పీ రేటింగ్ నుంచి బీఏఏ3/పీ–3కి డౌన్‌గ్రేడ్ చేసినట్లు పేర్కొంది. ఇతరత్రా వనరుల మద్దతు లేకుండా నిలదొక్కుకోగలిగే సామర్థ్యానికి సంబంధించిన బేస్‌లైన్ క్రెడిట్ అసెస్మెంట్ను (బీసీఏ) కూడా తగ్గించింది. అయితే, అవుట్‌లుక్ మాత్రం స్థిరంగానే కొనసాగిస్తున్నట్లు మూడీస్ పేర్కొంది. వచ్చే ఏడాది మార్చి ఆఖరు నాటికి బాసెల్ నిబంధనలకు తగ్గట్లుగా కనీస మూలధనం ఉండాలన్నా... పీఎన్బీ బయటి నుంచి సుమారు రూ. 12,000–13,000 కోట్లు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అయితే, ప్రభుత్వం నుంచి కొంత మొత్తం లభించడంతో పాటు ఇతరత్రా రియల్టీ ఆస్తులు, అనుబంధ సంస్థ పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్‌లో పాక్షికంగా వాటాలను విక్రయించడం ద్వారా సమకూర్చుకున్నా.. స్కామ్ బైటపడక పూర్వం ఉన్న స్థాయికి మూలధనం పెరగకపోవచ్చని రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. -
స్కాం సెగ: పీఎన్బీ మూడీస్ రేటింగ్ డౌన్
సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంక్‌నకు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సెగ మరో రూపంలో తాకింది. ఊహించినట్టుగానే బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద కుంభకోణంగా నిలిచిన పీఎన్బీ స్కాం నేపథ్యంలో రేటింగ్ సంస్థ పీఎన్బీకి గట్టి షాక్ ఇచ్చింది. రూ.11,400 కోట్ల భారీ కుంభకోణం.. పీఎన్బీ అంతర్గత రిస్కు మేనేజ్మెంట్ వ్యవస్థ, నియంత్రణ సంస్థ పర్యవేక్షణపై సందేహాలు నేపథ్యంలో రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఈ నిర్ణయం తీసుకుంది. రేటింగ్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్ల సర్వీసెస్ పీఎన్బీ రేటింగ్‌ను భారీగా తగ్గించింది. బ్యాంకు మూలధనంపై మోదీ కుంభకోణం ప్రభావం ప్రతికూలంగా ఉండనుందని అంచనా వేసింది. ఈ క్రమంలోనే లోకల్, విదేశీ కరెన్సీ డిపాజిట్ రేటింగ్‌ను డౌన్ గ్రేడ్ చేసింది. దీన్ని బీఏ1కు డౌన్‌గ్రేడ్ చేసింది. అలాగే బ్యాంకు ఎన్‌పీని బీఏఏ 3 నుంచి పీ-3కి తగ్గించింది. అంతేకాదు బ్యాంకు క్రెడిట్ అంచనా (బీసీఏ) ను తగ్గించింది. బీసీఏ బీఏ 3నుంచి బీ 1 కు తగ్గించామని మూడీస్ ఒక ప్రకటనలో తెలిపింది. -
పీఎన్బీకి రేటింగ్ డౌన్‌గ్రేడ్ గండం
ముంబై: భారీ కుంభకోణం నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేసే అవకాశాలున్నాయని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు మూడీస్, ఫిచ్ హెచ్చరించాయి. భారీ నష్టాలు, బ్యాంకు నికర విలువ కరిగిపోవడం తదితర అంశాలను ఇందుకు కారణంగా పేర్కొన్నాయి. రూ.11,400 కోట్ల భారీ కుంభకోణం.. పీఎన్బీ అంతర్గత రిస్కు మేనేజ్మెంట్ వ్యవస్థ, నియంత్రణ సంస్థ పర్యవేక్షణపై సందేహాలు రేకెత్తించిన నేపథ్యంలో రేటింగ్ ఏజెన్సీల హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రేటింగ్ డౌన్గ్రేడ్కి సంబంధించి... ప్రధానంగా మోసపూరిత లావాదేవీలు చోటు చేసుకున్న తరుణం, ఆర్థిక ప్రభావ పరిమాణం, బ్యాంకు మూలధన పరిస్థితులను మెరుగుపర్చేందుకు యాజమాన్యం తీసుకున్న చర్యలు, బ్యాంకుపై నియంత్రణ సంస్థ తీసుకున్న చర్యలను పరిగణనలోకి తీసుకోనున్నట్లు మూడీస్ ఒక నివేదికలో పేర్కొంది. మరోవైపు, డౌన్‌గ్రేడ్ అవకాశాలను సూచిస్తూ.. బ్యాంకు వయబిలిటీ రేటింగ్‌కు నెగటివ్ వాచ్ ఇచ్చినట్లు ఫిచ్ సంస్థ తెలిపింది. రుణాలను తిరిగి చెల్లించడంలో ఆర్థిక సంస్థ సామర్థ్యాన్ని లెక్కించేందుకు ఫిచ్ వయబిలిటీ రేటింగ్‌ను పరిగణనలోకి తీసుకుంటుంది. -
భారీగా క్షీణించిన ఇన్ఫోసిస్ షేరు!
హైదరాబాద్: సిటీ గ్రూప్ డౌన్ గ్రేడ్ చేయడంతో ఐటీ కంపెనీ షేర్లు భారీగా నష్టపోయాయి. భారత స్టాక్ మార్కెట్ లో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ లిమిటెడ్ తోపాటు టెక్ మహీంద్ర, మైండ్ ట్రీ, టీసీఎస్, విప్రో కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. బుధవారం మార్కెట్ లో ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర గ్రూప్ 5 శాతం, మైండ్ ట్రీ, టీసీఎస్, విప్రో 3 శాతానికి పైగా శాతం నష్టపోయాయి. ఇన్ఫోసిస్ కంపెనీ షేరు 5 శాతంతో 173 రూపాయలు క్షీణించి 3,658 వద్ద ట్రేడ్ అవుతోంది. ఐటీ రంగాలకు చెందిన కంపెనీ షేర్లు భారీగా క్షీణించడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ 36 పాయింట్ల నష్టంతో 26234 వద్ద, నిఫ్టీ 11 పాయింట్లు క్షీణించి 7841 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.