న్యూఢిల్లీ: భారత బ్యాంకింగ్ రంగ దృక్పథాన్ని స్థిరం నుంచి ప్రతికూలానికి (నెగెటివ్) మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తగ్గించేసింది. కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన అవరోధాలతో వృద్ధి మందగిస్తుందని.. దీంతో బ్యాంకుల ఆస్తుల నాణ్యత తగ్గిపోవచ్చని ఈ సంస్థ అంచనా వేసింది. కార్పొరేట్, సూక్ష్మ, మధ్య తరహా సంస్థలు, రిటైల్ విభాగంలోని మొండిబాకీలు పెరగవచ్చని.. ఫలితంగా బ్యాంకుల లాభాలు, నిధులపై ఒత్తిళ్లు పెరిగిపోతాయని మూడీస్ నివేదికలో పేర్కొంది. ‘‘ఉన్నట్టుండి ఆర్థిక కార్యకలాపాలు ఒకేసారి ఆగిపోవడంతో నిరుద్యోగం పెరుగుతుంది.
ఇది గృహాలు, కంపెనీల ఆదాయాలు తగ్గిపోయేందుకు దారితీస్తుంది. దీంతో చెల్లింపుల్లో జాప్యం పెరిగిపోయేందుకు కారణమవుతుంది. ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల్లో నిధుల ఒత్తిళ్లు బ్యాంకుల రిస్క్‌ను పెంచుతుంది. ఎందుకంటే ఎన్‌బీఎఫ్‌సీ రంగానికి బ్యాంకుల ఎక్స్‌పోజర్ (రుణ పోర్ట్‌ఫోలియో) ఎక్కువగా ఉంది’’ అని మూడీస్ వెల్లడించింది. ఈ అంశాలు బ్యాంకుల లాభదాయకతను దెబ్బతీయడంతోపాటు రుణ వృద్ధికి విఘాతం కలిగిస్తాయని అంచనా వేసింది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో నిధుల లభ్యత స్థిరంగా ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. యస్ బ్యాంకు డిఫాల్ట్‌తో రిస్క్ తీసుకోవడానికి కస్టమర్లు వెనుకాడడం చిన్న ప్రైవేటు బ్యాంకులకు నిధుల ఒత్తిళ్లు పెరగవచ్చని అంచనా వేసింది.
ఈ బ్యాంకుల పట్ల నెగెటివ్..
ఇండస్ ఇండ్ బ్యాంకు రేటింగ్స్‌ను డౌన్‌గ్రేడ్ చేసేందుకు పరిశీలనలో పెడుతున్నట్టు మూడీస్ ప్రకటించింది. ఇండస్ ఇండ్ బ్యాంకు పోర్ట్‌ఫోలియో ఎక్కువగా వాహన రుణాలు, సూక్ష్మ రుణాలు కావడంతో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులతో బ్యాంకుపై ఎక్కువ ప్రభావం ఉండొచ్చని మూడీస్ పేర్కొంది. అలాగే, ప్రస్తుత సవాళ్లతో కూడిన వాతావరణంలో ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు రేటింగ్‌లను డౌన్‌గ్రేడ్ చేసింది. యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకుల రేటింగ్‌ను స్థిరం (స్టేబుల్) నుంచి నెగెటివ్‌కు తగ్గించింది. ఐడీబీఐ బ్యాంకు రేటింగ్‌ను పాజిటివ్ నుంచి స్టెబుల్‌కు డౌన్‌గ్రేడ్ చేసింది. అయితే, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకుల గ్లోబల్ రేటింగ్స్‌లో మార్పులు చేయలేదు. లౌక్‌డౌన్ కారణంగా రుణ గ్రహీతల వేతనాలకు ఇబ్బందులు ఎదురైతే అది రిటైల్, క్రెడిట్‌కార్డు రుణాల చెల్లింపులపై ప్రభావం చూపిస్తుందని అంచనా వేసింది.
ఈ రంగాలపై ఎక్కువ ప్రభావం..
ఎయిర్‌లైన్స్, ఆటోమొబైల్ ఓఈఎం కంపెనీలు, ఆటో విడిభాగాల సరఫరా కంపెనీలు, ఆయిల్ అండ్ గ్యాస్ తయారీదారులు, గేమింగ్, గ్లోబల్ షిప్పింగ్, విచక్షణా రహిత రిటైల్ వినియోగం, ఆతిథ్య రంగాలు కరోనా వైరస్ కారణంగా ఎక్కువ ప్రతికూలతలను చవిచూసే రంగాలుగా మూడీస్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment