ముంబై: దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరిగిపోతుండడం, ఫలితంగా ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందోనన్న అనిశ్చితి ఇన్వెస్టర్లను అమ్మకాల వైపు నడిపించింది. దీంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం కూడా నష్టాల్లోనే ముగిశాయి. ముఖ్యంగా భారత బ్యాంకింగ్ రంగం పట్ల మూడీస్ తన దృక్పథాన్ని నెగెటివ్‌కు తగ్గించడం పెద్ద ప్రభావాన్నే చూపించింది. బ్యాంకు స్టాక్స్‌లో అమ్మకాలకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. ఈ ప్రభావంతో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 170 పాయింట్లు కోల్పోయి (2.06%) 8,084 వద్ద క్లోజయింది.
బీఎస్‌ఈ సెన్సెక్స్ 674 పాయింట్లు నష్టపోయి (2.39%) 27,591 వద్ద ముగిసింది. విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను తరలించుకుపోతుండడం, ఫలితంగా డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో విడత 76 స్థాయికి జారిపోవడం.. ఇన్వెస్టర్లను కొనుగోళ్ల విషయమై వేచిచూసే ధోరణి అనుసరించేలా చేసినట్టు ట్రేడర్లు అభిప్రాయపడ్డారు. ఈ వారం మొత్తం మీద సెన్సెక్స్ 2,225 పాయింట్లు (7.46%), నిఫ్టీ 576 పాయింట్లు (6.65%) చొప్పున నష్టపోయాయి. ఈ వారంలో చివరి రెండు రోజుల్లో నష్టాల కారణంగా బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.4,82,033 కోట్ల మేర తరిగిపోయి రూ.1,08,66,723 కోట్లకు పడింది.
అమ్మకాలకు దారితీసిన అంశాలు
► కరోనా వైరస్ ప్రభావం కారణంగా భారత బ్యాంకింగ్ రంగంలో నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) పెరిగిపోవచ్చన్న అంచనాతో ఈ రంగం అవుట్‌లుక్‌ను స్థిరం నుంచి ప్రతికూలానికి మారుస్తూ మూడీస్ నిర్ణయం తీసుకుంది.
► కరోనా పాజిటివ్ కేసుల్లో భారీ పెరుగుదలతో ఆర్థిక మాంద్యం వస్తుందన్న ఆందోళన నెలకొంది.
► కరోనా వైరస్ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై 4.1 ట్రిలియన్ డాలర్ల భారాన్ని మోపుతుందని ఆసియా అభివృద్ధి బ్యాంకు పేర్కొంది.
► డాలరుతో రూపాయి విలువ శుక్రవారం 53 పైసలు నష్టపోయి 76.13 వద్ద క్లోజయింది.
బ్యాంకు స్టాక్స్ బేర్...
మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ భారత బ్యాంకింగ్ రంగ రేటింగ్‌ను నెగెటివ్‌కు మార్చడం, అందులోనూ కొన్ని బ్యాంకుల రేటింగ్‌లను తగ్గించడం ఆయా స్టాక్స్‌కు ప్రతికూలంగా మారింది. అత్యధికంగా ఆర్‌బీఎల్ బ్యాంకు 15.5 శాతం, బంధన్ బ్యాంకు 13 శాతం చొప్పున నష్టపోయాయి. సూచీల్లోని బ్యాంకు స్టాక్స్ అయిన.. యాక్సిస్ బ్యాంకు 9 శాతం, ఇండస్‌ఇండ్ బ్యాంకు 8.5 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 8 శాతం, ఎస్‌బీఐ 6 శాతం చొప్పున పడిపోయాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకులు 2 శాతం చొప్పున నష్టపోయాయి.
కరెన్సీ మార్కెట్ల పనివేళలు తగ్గింపు
ముంబై: లౌక్‌డౌన్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటూ డెట్ మార్కెట్, కరెన్సీ మార్కెట్ల ట్రేడింగ్ వేళలను వచ్చే మంగళవారం (ఈ నెల 7వ తేదీ) నుంచి కుదిస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి ఈ మార్కెట్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తున్నాయి. ఈ నెల 7 నుంచి ఉదయం 10 గంటలకు మార్కెట్లు ప్రారంభం అయి, మధ్యాహ్నం 2 గంటలకు ముగుస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment