2023 As A Difficult Period Given Current Stress In Global Economy - Sakshi
Sakshi News home page

2023లో ప్రపంచ ఎకానమీ ఒడిదుడుకులు!

Published Tue, Dec 27 2022 4:49 AM | Last Updated on Tue, Dec 27 2022 9:27 AM

2023 as a difficult period given current stress in global economy - Sakshi

న్యూఢిల్లీ: గ్లోబల్‌ ఎకానమీలో ప్రస్తుతం తీవ్ర ఒత్తిడి పరిస్థితులు నెలకొన్నాయని  ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యుడు సన్యాల్‌ పేర్కొన్నారు.  ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఏజెన్సీలు  ప్రపంచ ఉత్పత్తి (జీడీపీ)  వృద్ధి సంఖ్యలను పదేపదే డౌన్‌గ్రేడ్‌లు చేస్తున్నాయని అన్నారు.  ఈ పరిస్థితుల్లో  వచ్చే 2023 సంవత్సరం కూడా కష్టతరమైనదని చెప్పడానికి స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయని విశ్లేషించారు. ఎకానమీకి సంబంధించి ఆయన ఇచ్చిన ఒక తాజా ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు...

► వాణిజ్యలోటు (ఎగుమతులు–దిగుమతుల విలువ మధ్య నికర వ్యత్యాసం) భారీగా పెరిగిపోకుండా చర్యలు అవసరమే. ఒకే దేశంలో వాణిజ్యలోటు తీవ్రంగా పెరిగిపోకుండా పలు చర్యలు తీసుకోవడం జరుగుతోంది. మనకు కావాల్సిన ఉత్తులను వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోంది. (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ మధ్య చైనాతో వాణిజ్యలోటు 51.1 బిలియన్‌ డాలర్లకు తాకిన నేపథ్యంలో సన్యాల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు)
► భారతదేశ మొత్తం సరుకు వాణిజ్య లోటు పెరిగిన మాట వాస్తవమే.  అయితే దేశీయ ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకోవడం, మిగిలిన ప్రపంచం మందగించడం దీనికి కారణం.  
► ఇక భారత్‌ నుంచి ఎగుమతుల పెంపునకూ వ్యూహ రచన జరుగుతోంది. ఇక్కడ మనం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) స్కీమ్‌నూ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. పీఎల్‌ఐ పథకం లక్ష్యం– దేశీయ తయారీని ప్రపంచవ్యాప్త పోటీ వేదికపై నిలబెట్టడం,  తయారీ రంగంలో ప్రపంచ ఛాంపియన్‌లను సృష్టించడం, ఎగుమతులను పెంచడం, ఉద్యోగ అవకాశాలను కల్పించడం.  
► తూర్పు యూరప్‌లో ఇబ్బందులు, చైనాలో కోవిడ్‌ కేసుల విజృంభన వంటి అంశాలు భారత్‌సహా ప్రపంచంలోని పలు ఎకానమీలపై ప్రతికూలత చూపే అవకాశం ఉంది. అయితే సవాళ్లను తట్టుకుని నిలబడగలిగే స్థితిలో భారత్‌ ఉంది. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌ వ్యవస్థగా కొనసాగుతోంది. 2023–24లో కూడా ఇదే హోదా కొనసాగిస్తుందన్న విశ్వాసం ఉంది. 
► కాగా,  కోవిడ్‌ తిరిగి తీవ్రమయ్యే అవకాశాలపై  భారతదేశం అప్రమత్తంగా ఉండాలి.
► ద్రవ్యోల్బణం, కరెంట్‌ అకౌంట్‌ లోటు (దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) వంటి స్థూల ఆర్థిక స్థిరత్వ అంశాలపై జాగరూకత అవసరం.  
► తక్షణం కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక భారత్‌ ఎకానమీ అవుట్‌లుక్‌ స్థిరంగా ఉంది.  


పాత పెన్షన్‌ పథకాల పునరుద్ధరణ సరికాదు..!
ఉద్యోగుల వంతు జమతో (కాంట్రిబ్యూషన్‌) సంబంధంలేని పాత పెన్షన్‌ పథకాలు (ఓపీఎస్‌).. భవిష్యత్‌ తరాలపై దాడి వంటిదేనని సన్యాల్‌ పేర్కొన్నారు. కొన్ని ప్రతిపక్ష పాలక రాష్ట్రాల నుంచి వచ్చిన  ‘పాత పెన్షన్‌ పథకాలను పునరుద్ధరణ డిమాండ్‌’ సరైంది కాదని స్పష్టం చేశారు. గత రెండు దశాబ్దాలుగా చాలా కష్టాలతో అమల్లోకి తెచ్చిన పెన్షన్‌ సంస్కరణలను తిరిగి వెనక్కు మళ్లించే విషయంలో జాగరూకత అవసరమన్నారు.  పెన్షన్‌ మొ త్తాన్ని ప్రభుత్వమే ఇవ్వడానికి సంబంధించిన పాత పెన్షన్‌ పథకాలను 2003లో ఎన్‌డీఏ ప్రభుత్వం నిలిపివేసింది. 2004 ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమైన ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వచ్చింది.  కొత్త కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) కింద ఉద్యోగులు తమ ప్రాథమిక (బేసిస్‌) వేతనంలో 10 శాతం పెన్షన్‌కు జమ చేయాల్సి ఉండగా,  రాష్ట్ర ప్రభుత్వం 14 శాతం జమ చేస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement