ముంబై: భారీ కుంభకోణం నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ) రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేసే అవకాశాలున్నాయని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు మూడీస్, ఫిచ్ హెచ్చరించాయి. భారీ నష్టాలు, బ్యాంకు నికర విలువ కరిగిపోవడం తదితర అంశాలను ఇందుకు కారణంగా పేర్కొన్నాయి.
రూ.11,400 కోట్ల భారీ కుంభకోణం.. పీఎన్‌బీ అంతర్గత రిస్కు మేనేజ్‌మెంట్ వ్యవస్థ, నియంత్రణ సంస్థ పర్యవేక్షణపై సందేహాలు రేకెత్తించిన నేపథ్యంలో రేటింగ్ ఏజెన్సీల హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రేటింగ్ డౌన్‌గ్రేడ్‌కి సంబంధించి... ప్రధానంగా మోసపూరిత లావాదేవీలు చోటు చేసుకున్న తరుణం, ఆర్థిక ప్రభావ పరిమాణం, బ్యాంకు మూలధన పరిస్థితులను మెరుగుపర్చేందుకు యాజమాన్యం తీసుకున్న చర్యలు, బ్యాంకుపై నియంత్రణ సంస్థ తీసుకున్న చర్యలను పరిగణనలోకి తీసుకోనున్నట్లు మూడీస్ ఒక నివేదికలో పేర్కొంది.
మరోవైపు, డౌన్‌గ్రేడ్ అవకాశాలను సూచిస్తూ.. బ్యాంకు వయబిలిటీ రేటింగ్‌కు నెగటివ్ వాచ్ ఇచ్చినట్లు ఫిచ్ సంస్థ తెలిపింది. రుణాలను తిరిగి చెల్లించడంలో ఆర్థిక సంస్థ సామర్థ్యాన్ని లెక్కించేందుకు ఫిచ్ వయబిలిటీ రేటింగ్‌ను పరిగణనలోకి తీసుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment