న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగం అవుట్‌లుక్ ఏప్రిల్ 1వ తేదీ నుంచీ ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరం అంత బాగుండక పోవచ్చని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం-ఫిచ్ అంచనా వేస్తోంది. క్తొత వ్యాపారాలు, ఆదాయ వృద్ధి, రుణ నాణ్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తాజా అంచనాకు వచ్చినట్లు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ప్రకటనలో ముఖ్యాంశాలు చూస్తే..
- కోవిడ్-19 నేపథ్యంలో ఎకానమీలో చోటుచేసుకున్న ప్రతికూల పరిస్థితులు, చిన్న వ్యాపారాలకు జరిగిన నష్టాలు, నిరుద్యోగం, ప్రైవేటు వినియోగంలో తగ్గుదల వంటి అంశాలు ఇంకా పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్స్‌లో ప్రతిబింబించడంలేదు.
- ఆయా అంశాల ప్రతికూలతలు, రుణ నాణ్యతలో లోపాలు 2022 మార్చి నాటికి ముగిసే బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్లపై ప్రభావితం చూపే అవకాశం ఉంది. భారత్ బ్యాంకులు ఫైనాన్షియల్ పరిస్థితులు, సవాళ్లపై అప్పటి వరకూ ఒక స్పష్టత వచ్చే అవకాశం లేదు.
- నిర్వహణా పరంగా తీసుకున్న కొన్ని చర్యల వల్ల మాత్రమే 2020 డిసెంబర్ వరకూ జరిగిన తొమ్మిది నెలల్లో బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లలో కొంత మెరుగుదల కనిపించింది తప్ప, వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రత్యేకించి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇంతకు ముందుకన్నా రుణ బలహీన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. రుణ వృద్ధి రేటు కూడా అంతంత మాత్రంగానే ఉంది.
- బ్యాంకింగ్‌కు భారీగా మూలధనం అందించే విషయంలో కూడా ప్రభుత్వానికి పరిమితులు ఉన్నాయి. సమస్య తీవ్రతలో ఇది మరో కోణం. రుణ నాణ్యత సరిగాలేకపోవడం, ఆర్థిక రికవరీలో అస్పష్టత వంటి అంశాలు బ్యాంకింగ్ రంగం అవుట్‌లుక్‌ను బలహీనపరుస్తున్నాయి.
- ప్రభుత్వ బ్యాంకింగ్ రంగానికి 5.5 బిలియన్ డాలర్లను (దాదాపు రూ.40,150 కోట్లు) మూలధనంగా అందించాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ, ఫిచ్ ‘అంచనా మూలధనం అవసరం’కన్నా ఇది చాలా తక్కువ. వివిధ పరిస్థితుల్లో బ్యాంకింగ్‌కు 15 బిలియన్ డాలర్ల నుంచి 58 బిలియన్ డాలర్ల వరకూ అవసరమవుతాయి.
- నియంత్రణా పరంగా ఇచ్చిన వెసులుబాటును వెనక్కు తీసుకుంటే, ఇది బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్లపై అలాగే మూలధనంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. గణాంకాలను లోతుగా విశ్లేషిస్తే, ఒత్తిడి తీవ్రతను గుర్తించవచ్చు.
- వచ్చే ఆర్థిక సంవత్సరం భారత్ జీడీపీ వృద్ధి రేటు 11శాతంగా నమోదుకావచ్చు. అయితే పలు రంగాలు సామర్థ్యానికి దిగువనే కార్యకలాపాలను నిర్వహించే అవకాశం ఉంది.
- రిటైల్ కస్టమర్‌లో ఒత్తిడి కొనసాగుతోంది. ప్రైవేటు వినియోగం తగ్గుదల, పట్టణ యుటిలిటీ బిల్లుల చెల్లింపుల్లో వైఫల్యాలు, సామాజిక భద్రతా పథకాల నుంచి ఉపసంహరణల వంటి అంశాలు దీనిని సూచిస్తున్నాయి.
- లఘు, మధ్య తరహా పరిశ్రమలకు 2021- 22 ఆర్థిక సంవత్సరం కూడా ఒక పరీక్షా కాలంగా నిలవనుంది.
మొండిబకాయిల తీవ్రత...
కోవిడ్-19 ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో భారత్ బ్యాంకింగ్‌పై మొండిబకాయిల(ఎన్‌పీఏ) భారం తీవ్రతరం కానుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్వైవార్షిక ద్రవ్య స్థిరత్వ నివేదిక (ఎఫ్‌ఎస్‌ఆర్) ఇటీవలే పేర్కొంది. ఎన్‌పీఏలకు సంబంధించి కనిష్ట ప్రభావం మేరకు చేసినా, మొత్తం రుణాల్లో మొండిబకాయిల భారం 2021 సెప్టెంబర్ నాటికి 13.5 శాతానికి చేరుతుందని నివేదిక పేర్కొంది. ప్రభావం తీవ్రంగా ఉంటే ఏకంగా ఇది 14.8 శాతానికి ఎగసే అవకాశం ఉందని తెలిపింది. ఇదే జరిగితే గడచిన 25 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత తీవ్ర మొండిబకాయిల భారం బ్యాంకింగ్‌పై ఉంటుంది.
2020 సెప్టెంబర్ నాటికి బ్యాంకింగ్‌పై ఎన్‌పీఏ భారం 7.5 శాతం. అప్పటి నుంచీ చూస్తే, కనీసమయినా ఎన్‌పీఏలు 600 బేసిస్ పాయింట్లు (6 శాతం) అయినా పెరుగుతుందన్నమాట. నివేదిక ప్రకారం, ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) మొండి బకాయిలు 2021 సెప్టెంబర్ నాటికి కనీస స్థాయిలో చూసినా 9.7 శాతం - 16.2 శాతాల శ్రేణిలో ఉండే వీలుంది. ప్రైవేటు బ్యాంకింగ్ విషయంలో ఈ శ్రేణి 4.6 శాతం-7.9 శాతం శ్రేణిలో ఉండవచ్చు. ఫారిన్ బ్యాంకుల విషయంలో ఈ శ్రేణి 2.5 శాతం - 5.4 శాతం శ్రేణిలో ఉండే వీలుంది. ఇక తీవ్ర స్థాయిల్లో పీఎస్‌బీ, ప్రైవేట్, ఫారిన్ బ్యాంకుల విషయంలో ఎన్‌పీఏలు వరుసగా 17.6 శాతం, 8.8 శాతం, 6.5 శాతం శ్రేణిలో ఉండే అవకాశం ఉంది.
రుణ నాణ్యత పటిష్టతపై ఇప్పుడే చెప్పలేం: క్రిసిల్
ఇదిలావుండగా, బ్యాంకింగ్ రుణ నాణ్యత పటిష్టత గురించి ఇప్పుడే ఏమీ నిర్థారణకు రాలేమని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– ఎస్‌అండ్‌పీ అనుబంధ విభాగం క్రిసిల్ తన తాజా నివేదికలో పేర్కొంది. తన క్రెడిట్ రేషియోను 0.54 నుంచి 1 స్థాయికి చేర్చింది.
Comments
Please login to add a commentAdd a comment