న్యూఢిల్లీ: రష్యా సావరిన్ రేటింగ్‌ను అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు మూడీస్, ఫిచ్ జంక్ గ్రేడ్‌కు తగ్గించాయి. ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో పశ్చిమ దేశాల తీవ్ర ఆంక్షలు రేటింగ్ కోతకు దారితీశాయి. అంతర్జాతీయంగా పెట్టుబడిదారులు ఒక దేశంలో పెట్టుబడులు పెట్టాలంటే ఆ దేశానికి సంబంధించి మూడీస్, ఫిచ్, ఎస్‌అండ్‌పీ వంటి సంస్థల రేటింగ్ ఏమిటన్నది పరిశీలిస్తాయి. మూడీస్, ఫిచ్ తాజా నిర్ణయం పుతిన్ ప్రభుత్వం రుణ వ్యయాలను భారీగా పెంచే అవకాశాలు ఉన్నాయి. రుణాలు చెల్లించలేని (డిఫాల్ట్ రిస్క్) పరిస్థితి ఉత్పన్నం కావచ్చని జంక్ కేటగిరీ సూచిస్తుంది.
మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్
రష్యా లాంగ్ టర్మ్ ఇష్యూయెర్ అండ్ సీనియర్ అన్‌సెక్యూర్డ్ (లోకల్–అండ్ ఫారిన్ కరెన్సీ) డెట్ రేటింగ్‌ను ‘బీఏఏ3’ నుంచి ‘బీ3’కి తగ్గించింది. ‘‘రష్యన్ ఫెడరేషన్ సెంట్రల్ బ్యాంక్ (సీబీఆర్)సహా కొన్ని పెద్ద ఆర్థిక సంస్థలపై పశ్చిమ దేశాలు విధించిన తీవ్రమైన ఆంక్షల కారణంగా రష్యా రేటింగ్‌లపై సమీక్ష నిర్వహించడం జరిగింది. పరిస్థితి తీవ్రతను బట్టి రేటింగ్‌ను మరింత డౌన్‌గ్రేడ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి’’ అని ఒక ప్రకటనలో పేర్కొంది.
ఫిచ్
దేశ రేటింగ్‌ను ‘బీబీబీ’ నుంచి ‘బీ’కి కుదించింది. దేశాన్ని ‘రేటింగ్ వాచ్ నెగెటివ్’ జాబితాలో పెట్టింది. ‘‘అంతర్జాతీయ ఆంక్షల తీవ్రత ఆర్థిక స్థిరత్వ ప్రమాదాలను పెంచింది. రష్యా క్రెడిట్ ఫండమెంటల్స్‌కు భారీ నష్టాన్ని తాజా పరిస్థితులు సూచిస్తున్నాయి. ప్రభుత్వ రుణ చెల్లింపుల పరిస్థితులను దెబ్బతీస్తున్నాయి’’ అని బ్రిటన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫిచ్ సంస్థ ఒక ప్రకటనలో వివరించింది. పలు దేశాల ఆంక్షలు, రూబుల్ పతనం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని, ఫైనాన్షియల్ వ్యవస్థలకు సంబంధించి విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించింది. ఫారిన్ కరెన్సీ డినామినేటెడ్ బ్యాంక్ డిపాజిట్లు (అధికంగా డాలర్ల రూపంలో ఉండే) భారీ ఉపసంహరణలకు పరిస్థితి దారితీస్తుందని వివరించింది. మొత్తం డిపాజిట్లలో వీటి వాటా 25 శాతమని (దాదాపు 200 బిలియన్ డాలర్లు) పేర్కొంది. ఇవి బయటకు వెళ్లిపోతే వ్యవస్థ స్థిరత్వానికి విఘాతం ఏర్పడుతుందని, రూబుల్ ద్రవ్య లభ్యత, స్థిరత్వాలకు సంబంధించి బ్యాంకులకు సహకరించడంలో రష్యన్ ఫెడరేషన్ సెంట్రల్ బ్యాంక్ విఫలమవుతుందని హెచ్చరించింది. అసలే అంతంతమాత్రంగా ఉన్న (క్రితం అంచనాలు 1.6%) జీడీపీ వృద్ధితీరుకు తాజా పరిణామాలు విఘాతం కలిగిస్తాయని పేర్కొంది. రష్యా ఎగుమతుల్లో 55% డాలర్ల రూపంలో ఉంటే, 29% యూరోలో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, తాజా పరిణామాలు రష్యా ట్రేడ్ చెల్లింపులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని తెలిపింది. 2021లో రష్యా ఎగుమతుల్లో 44% (దాదాపు 241 బిలియన్ డాలర్లు) ఇంధన రంగం వెయిటేజ్ కాగా, ఉక్రెయిన్‌పై దాడి, పర్యవసానాల నేపథ్యంలో వాణిజ్య భాగస్వామ్య దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటాయని కూడా ఫిచ్ పేర్కొనడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment