న్యూఢిల్లీ: ఇటీవల అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్‌లోని 4 కంపెనీల రేటింగ్‌లో మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ తాజాగా కోత పెట్టింది. స్థిరత్వం(స్టేబుల్) నుంచి రేటింగ్‌ను ప్రతికూలం(నెగిటివ్)కు దిగువముఖంగా సవరిస్తున్నట్లు మూడీస్ వెల్లడించింది. ఈ జాబితాలో అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ గ్రీన్ ఎనర్జీ రెస్ట్రిక్టెడ్ గ్రూప్–1, అదానీ ట్రాన్స్‌మిషన్ స్టెప్ వన్, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్‌లను పేర్కొంది. అదానీ గ్రూప్ కంపెనీల ఈక్విటీ విలువలు మార్కెట్లో ఇటీవలి కాలంలో అత్యంత వేగంగా పతనమైన నేపథ్యంలో తాజా సవరణలు చేపట్టినట్లు వివరించింది.
అదానీ గ్రూప్‌లో కార్పొరేట్ పాలన సక్రమంగా లేదంటూ యూఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలు చేసిన తదుపరి గ్రూప్ విలువ 100 బిలియన్ డాలర్లను కోల్పోయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో 4 కంపెనీలకు రేటింగ్‌ను ప్రతికూలానికి సవరించినప్పటికీ మరో 8 కంపెనీలకు ‘స్థిరత్వం’ను కొనసాగించినట్లు మూడీస్ తెలియజేసింది. స్టేబుల్ రేటింగ్‌ను కొనసాగిస్తున్న కంపెనీలలో అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, అదానీ ఇంటర్నేషనల్ కంటెయినర్ టెర్మినల్, అదానీ గ్రీన్ ఎనర్జీ రెస్ట్రిక్టెడ్ గ్రూప్–2, అదానీ ట్రాన్స్‌మిషన్ రెస్ట్రిక్టెడ్ గ్రూప్–1 ఉన్నట్లు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment