న్యూఢిల్లీ: దాదాపు 175 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న దేశీ డిజిటల్ ఎకానమీలో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై అదానీ గ్రూప్ దృష్టి పెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్‌చెయిన్ తదితర ఉత్పత్తులు, సేవలను మరింతగా వినియోగంలోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా అబుధాబీకి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (ఐహెచ్‌సీ) అనుబంధ సంస్థ సిరియస్ ఇంటర్నేషనల్ హోల్డింగ్‌తో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో (ఏఈఎల్) భాగమైన అదానీ గ్లోబల్ జట్టు కట్టింది.
సిరియస్ డిజిటెక్ ఇంటర్నేషనల్ పేరుతో జాయింట్ వెంచర్ సంస్థను ఏర్పాటు చేసింది. ఇది అబుధాబీ కేంద్రంగా పని చేస్తుంది. సిరియస్ జేవీలో సిరియస్‌కు 51%, అదానీ గ్రూప్‌నకు 49% వాటాలు ఉంటాయి. అంతర్జాతీయంగా డిజిటల్ పరివర్తన విభాగంలో సిరియస్ అనుభవం, దేశీ మార్కెట్‌పై అదానీ గ్రూప్ పరిజ్ఞానంతో భారత డిజిటల్ ఎకానమీలో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై సిరియస్ జేవీ దృష్టి పెట్టనుందని ఏఈఎల్ తెలిపింది.
ప్రస్తుతం 175 బిలియన్ డాలర్లుగా ఉన్న డిజిటల్ ఎకానమీ 2030 నాటికి ట్రిలియన్ (లక్ష కోట్ల) డాలర్లుగా ఎదగనుందని అంచనాలు ఉన్నట్లు పేర్కొంది. ఇన్‌ఫ్రాతో పాటు ఫిన్‌టెక్, హెల్త్‌టెక్, గ్రీన్‌టెక్ తదితర రంగాల్లోనూ అధునాతన కృత్రిమ మేథ (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), బ్లాక్‌చెయిన్ మొదలైన వాటిని మరింతగా వినియోగంలోకి తెచ్చేందుకు సిరియస్ జేవీ కృషి చేస్తుందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment