ముంబై: వివిధ అంశాలకు సంబంధించి భారత్ బ్యాంకింగ్ సామర్థ్యాలపై అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు మూడీస్, ఫిచ్ దృష్టి సారించాయి. ఆయా అంశాలకు సంబంధించి రేటింగ్‌లపై కోత పెట్టాయి.
ఎస్‌బీఐపై మూడీస్ ఇలా...
భారత బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ డెట్ రేటింగ్‌కు మూడీస్ కోతపెట్టింది. ప్రస్తుత ‘బీఏఏ2’ రేటును ‘బీఏఏ3’కి డౌన్‌గ్రేడ్ చేస్తున్నట్లు సోమవారం తెలిపింది. సీనియర్ అన్‌సెక్యూర్డ్ డెట్, లోకల్ కరెన్సీ డిపాజిట్ రేటింగ్‌లపై ఈ కోత పెడుతున్నట్లు వెల్లడించింది. మొండిబకాయిల సమస్య, పునఃపెట్టుబడులు జరగవేమోనన్న సందేహాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దీనిపై వ్యాఖ్యలకు ఎస్‌బీఐ వర్గాలు తక్షణం అందుబాటులో లేవు.
పీఎన్‌బీ, బీఓబీ రేటింగ్‌లకు ఫిచ్ కోత
కాగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) లాభదాయకతకు సంబంధించిన వయబిలిటీ రేటింగ్స్‌ను గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ తగ్గించింది. ఇప్పటివరకూ ఈ రేటింగ్ ‘బీబీబీ’కాగా దీనిని ‘బీబీప్లస్’కు కుదిస్తున్నట్లు వెల్లడించింది. బ్యాంకుల రుణ సామర్థ్యానికి ఈ రేటింగ్ ప్రతిబింబంగా ఉంటుంది. కాగా దీర్ఘకాలిక ఇష్యూయెర్ డిఫాల్ట్ రేటింగ్స్‌ను మాత్రం ‘బీబీబీ’గా కొనసాగిస్తున్నట్లు పేర్కొంది.
మరికొన్ని నిర్ణయాలు ఇవీ...: కాగా ఇండియన్ బ్యాంక్ దీర్ఘకాలిక (ఎల్‌టీ) ఇష్యూయెర్ డిఫాల్ట్ రేటింగ్ (ఐడీఆర్)ను ‘బీబీబీ’ నుంచి ‘బీబీప్లస్’కు తగ్గిస్తున్నట్లు ఫిచ్ తెలిపింది. ఆ బ్యాంక్ వయబిలిటీ రేటింగ్‌ను సైతం ‘బీబీబీ’ నుంచి ‘బీబీప్లస్’కు కోతపెడుతున్నట్లు వెల్లడించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరాబ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, బీఓబీ న్యూజిలాండ్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ దీర్ఘకాలిక ఇష్యూయెర్ డిఫాల్ట్ రేటింగ్స్ ‘బీబీబీ’గా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ విషయంలో వయబిలిటీ రేటింగ్స్ ‘బీబీబీ’గా కొనసాగుతుందని పేర్కొంది. కాగా కెనరాబ్యాంక్‌కు సంబంధించి ఈ రేటింగ్ ‘బీబీప్లస్’కాగా, ఐడీబీఐ బ్యాంక్ విషయంలో ‘బీబీ’గా కొనసాగుతుందని వెల్లడించింది.
బ్యాంకుల రేటింగ్ కట్
Published Tue, Sep 24 2013 2:38 AM | Last Updated on Fri, Sep 1 2017 10:59 PM
Advertisement
Advertisement