ఆర్థిక క్రమశిక్షణకు కట్టుబడతాం | We are committed to financial discipline | Sakshi
Sakshi News home page

ఆర్థిక క్రమశిక్షణకు కట్టుబడతాం

Published Thu, Mar 8 2018 4:35 AM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM

We are committed to financial discipline - Sakshi

న్యూఢిల్లీ: ఆర్థిక క్రమశిక్షణకు భారత్‌ కట్టుబడి ఉందని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం ఫిచ్‌ ప్రతినిధులకు ఆర్థిక శాఖ అధికారులు స్పష్టం చేశారు. నిర్మాణాత్మక సంస్కరణలు, వస్తు–సేవల పన్ను(జీఎస్‌టీ) వ్యవస్థ కూడా గాడిలో పడుతున్న నేపథ్యంలో భారత్‌ ఆర్థిక వ్యవస్థ వృద్ధి జోరందుకుంటోందని వారు చెప్పారు. ఈ తరుణంలో మళ్లీ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధి సాధిస్తున్న దేశంగా అవతరించినట్లు పేర్కొన్నారు. ఈ పరిణామాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని దేశ సార్వభౌమ రేటింగ్‌ను పెంచాలని సూచించారు. భారత్‌ రేటింగ్‌పై వార్షిక సమీక్ష ప్రక్రియలో భాగంగా బుధవారం ఫిచ్‌ డైరెక్టర్‌ (సావరీన్‌ రేటింగ్స్‌) థామస్‌ రూక్‌మాకెర్‌ కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్, ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణ్యం తదితర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఆర్థిక క్రమశిక్షణ కార్యచరణ (రోడ్‌మ్యాప్‌) బాటలోనే ప్రభుత్వం పయనిస్తోందని, సవరించిన ద్రవ్యలోటు లక్ష్యాలకు కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆర్థిక శాఖ అధికారులు చెప్పారు. 2020–21 ఆర్థిక సంవత్సరం నాటికి జీడీపీలో ద్రవ్యలోటును (ప్రభుత్వ ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసం) 3 శాతానికి కట్టడి చేయనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది జీఎస్‌టీ ఆదాయం 11 నెలలకే పరిమితమైనప్పటికీ... ద్రవ్యలోటును 3.5 శాతానికి కట్టడి చేస్తున్నట్లు ఫిచ్‌ ప్రతినిధులకు వివరించారు. 

పీఎన్‌బీ స్కామ్‌పై ఆరా!!
జీఎస్‌టీ అమలులో సమస్యలు, అదేవిధంగా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో (పీఎన్‌బీ) ఇటీవల చోటుచేసుకున్న భారీ కుంభకోణానికి సంబంధించి పలు అంశాలను ఫిచ్‌ ప్రతినిధులు ఈ సందర్భంగా లేవనెత్తినట్లు సమాచారం. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ అనేది ప్రభుత్వ తక్షణ ఎజెండాలో లేదని ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారు. నష్టజాతక ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) విక్రయం కొనసాగుతుందని.. ఈ ఏడాది డిజిన్వెస్ట్‌మెంట్‌ ఆదాయం రూ.లక్ష కోట్లను తాకిందని వారు ఫిచ్‌ ప్రతినిధులకు వివరించారు.

2006 నుంచి అదే రేటింగ్‌...
ప్రస్తుతం ఫిచ్‌ ‘బీబీబీ మైనస్‌ (స్థిర అవుట్‌లుక్‌)’ రేటింగ్‌ను కొనసాగిస్తోంది. ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రేడ్‌లో ఇదే అత్యంత తక్కువస్థాయి రేటింగ్‌. చివరిసారిగా 2006లో ‘బీబీ ప్లస్‌’ నుంచి ఇప్పుడున్న రేటింగ్‌కు అప్‌గ్రేడ్‌ చేసింది. అప్పటి నుంచి ఎలాంటి మార్పూ చేయలేదు. మధ్యలో అవుట్‌లుక్‌ను ప్రతికూలానికి మార్చినా, ఆ తర్వాత మళ్లీ స్థిరానికి చేర్చింది. కాగా, 14 ఏళ్ల తర్వాత మరో రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ గతేడాది నవంబర్‌లో భారత్‌ సార్వభౌమ రేటింగ్‌ను ‘బీఏఏ3’ నుంచి ‘బీఏఏ2’కు పెంచిన సంగతి తెలిసిందే. అదేవిధంగా అవుట్‌లుక్‌ను (భవిష్యత్తు రేటింగ్‌ అంచనా) కూడా స్థిరం నుంచి సానుకూలానికి మార్చింది. స్టాండర్డ్‌ అండ్‌ పూర్స్‌ (ఎస్‌అండ్‌పీ) మాత్రం 2007 నుంచి భారత్‌ రేటింగ్‌ను యథాతథంగానే (బీబీబీ మైనస్‌) కొనసాగిస్తోంది. కాగా, ఇటీవలి కేంద్ర బడ్జెట్‌ తర్వాత ఫిచ్‌... భారత్‌కు ఉన్న అధిక రుణ భారమే రేటింగ్‌ పెంపునకు అడ్డంకిగా మారుతోందని వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రస్తుతం భారత్‌ జీడీపీతో పోలిస్తే రుణ భారం 69 శాతం మేర ఉంది. కాగా, ఈ ఏడాది(2017–18) ద్రవ్యలోటు లక్ష్యాన్ని తాజా బడ్జెట్‌లో కేంద్రం 3.2 శాతం నుంచి 3.5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement