న్యూఢిల్లీ: నష్టాలను సర్దుబాటు చేసుకోతగినంత నగదు నిల్వలు కలిగిన ప్రైవేటు బ్యాంకులు.. అదే సమయంలో నష్టాలను తట్టుకోగల సామర్థ్యం తక్కువగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి మార్కెట్ వాటాను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. ‘‘తగినన్ని నిధులున్న బ్యాంకులు ముందుగానే నష్టాలను గుర్తించే సామర్థ్యాన్ని పెంచుకోగలవు. ఈ క్రమంలో పెద్దగా ఇబ్బంది పడకుండానే మార్కెట్ వాటాను పెంచుకోగలవు’’ అని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. అయితే, బ్యాంకింగ్ రంగంలో రుణ వృద్ధి (రుణాలకు డిమాండ్) స్తబ్దుగా ఉన్నందున తక్షణమే మార్కెట్ వాటాను పెంచుకుంటాయని భావించడం లేదని, కరోనా సమసిపోయిన తర్వాత స్థిరమైన వృద్ధిని చూపిస్తాయని తెలిపింది.
ప్రైవేటు బ్యాంకులు 14.4% మార్కెట్ వాటాను.. ఆస్తులు, రుణాల పరంగా 18.5% వాటాను ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి కైవసం చేసుకున్నాయని, ఇందులో అధిక శాతం వాటా గత ఐదేళ్ల కాలంలో సంపాదించుకున్నదేనని వివరించింది. ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనం వాటి మార్కెట్ స్థానాన్ని స్థిరీకరించుకునేందుకు గత కొన్నేళ్లలో సాయపడిందని.. కానీ, భవిష్యత్తులో ఎదురయ్యే ఒత్తిళ్లను తట్టుకునేందుకు, వృద్ధికి అవసరమైన నిధులను అవి సమీకరించుకోకపోతే మాత్రం వాటి మార్కెట్ వాటాను మరింత కోల్పోతాయని విశ్లేషించింది. ఆర్‌బీఐ సూచనల మేరకు కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు తాజా నిధులను సమీకరించినప్పటికీ.. ప్రైవేటు బ్యాంకులతో పోలిస్తే చాలా పరిమితమేనని పేర్కొంది. ‘‘కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు తాజా మూలధన నిధులను సమీకరించనున్నట్లు ప్రకటించాయి. ఎప్పటిలోపు సమీకరించేదీ ప్రకటించలేదు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఈ తరహా అస్పష్ట పరిస్థితి వెంటనే మెరుగుపడాల్సి ఉంది’’అని ఫిచ్ రేటింగ్స్ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment